పవన్ నాయుడు.. క్లారిటీ గా చెప్పాలంటే పవన్ పాలకొల్లు నాయుడట

Update: 2020-01-03 04:49 GMT
అమరావతి అంశం ఇప్పుడు ఏపీ ని ఎంతలా ఊపేస్తుందో తెలిసిందే. మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రజలు క్లారిటీగా ఉన్నా.. విపక్షాలు చేస్తున్న రాజకీయ అలజడితో ఆగమాగం అవుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్.. ఇతర పార్టీ నేతలు అమరావతి లో పెద్ద ఎత్తున వ్యవసాయ భూముల్ని కొనుగోలు చేసి.. ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. బాబు అండ్ కో చేసిన ఇన్ సైడ్ ట్రేడింగ్ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇలాంటి వేళ తెర మీదకు వచ్చిన టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అమరావతి కోసం ఆందోళన చేస్తున్న రైతుల్నిపెయిడ్ ఆర్టిస్టులంటూ వ్యాఖ్యానించటాన్ని తప్పు పట్టారు. అమరావతి భూముల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగినట్లుగా సాగుతున్న ప్రచారానికి బ్రేకులు వేసేలా చేస్తున్నారని మండిపడ్డారు. కావాలంటే ఈ అంశం మీద న్యాయవిచారణను జరిపించాలని సవాల్ విసిరారు. ఏదైనా ఆధారాలు చూపించి తప్పు పడితే బాగుంటుందన్నారు. అంతేకానీ ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ బురద జల్లదొద్దన్నారు. ఆవేశంతో మాట్లాడిన బొండా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసే క్రమంలో ఏపీ అధికారపక్షం చంద్రబాబు దత్త పుత్రుడిగా అభివర్ణించటం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బొండా ఉమా.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు జగన్ పెంపుడు కొడుకులని వ్యాఖ్యానించారు. అదే సమయంలో పవన్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ ను పవన్ నాయుడిగా అభివర్ణించిన బొండా.. అయన్ను పవన్ పాలకొల్లు నాయుడని పిలవొచ్చంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

జగన్ ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ జగన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానిస్తున్న వేళ.. అదే పవన్ ను బొండా ఇప్పుడు పవన్ నాయుడు అని పేర్కొనటం ఒక ఎత్తు అయితే.. తాను చెబుతున్నది అబద్ధమేమీ కాదని.. ఏమైనా సందేహాలు ఉంటే చెక్ చేసుకోవాలన్నారు. రైతుల మీద వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు దాడి చేస్తున్నారంటూనే పవన్ మీద బొండా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయని చెప్పాలి.


Tags:    

Similar News