జీవీఎల్ పై స‌భాహ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు

Update: 2019-02-05 07:56 GMT
భాజ‌పా నేత - రాజ్య‌స‌భ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు చిక్కుల్లో ప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడిని ఉద్దేశించి ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ట్విట‌ర్ లో చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న‌కు క‌ష్టాలు తెచ్చిపెట్టేలా క‌నిపిస్తున్నాయి. జీవీఎల్ పై అసెంబ్లీలో స్పీక‌ర్ కు టీడీపీ స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసులు ఇవ్వ‌డ‌మే అందుకు కార‌ణం.

ఎన్డీయేతో టీడీపీ తెగ‌దెంపులు చేసుకున్న‌ప్ప‌టి నుంచి ఏపీలో రాజ‌కీయం బాగా వేడెక్కిన సంగ‌తి తెలిసిందే. హోదా విష‌యంలో రాష్ట్రాన్ని కేంద్ర‌ ప్ర‌భుత్వం మోసం చేసిందంటూ టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించిన ప్ర‌తిసారీ జీవీఎల్ ఎదురుదాడికి దిగారు. రాష్ట్ర ప్ర‌భుత్వ వ్య‌వ‌హార శైలిని ఎండ‌గ‌ట్టారు. ప్ర‌తి విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఏపీపై కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా నల్ల‌చొక్కా ధ‌రించి సీఎం చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. నాటి స‌మావేశంలో బీజేపీ ఫ్లోర్ లీడ‌ర్ విష్ణుకుమార్ రాజు - ఆ పార్టీకే చెందిన మ‌రో ఎమ్మెల్యే మాణిక్యాల రావుతో టీడీపీ నేత‌ల‌కు వాగ్యుద్ధం జ‌రిగింది. రాష్ట్రం ప‌ట్ల కేంద్రం వైఖ‌రిపై టీడీపీ - బీజేపీ నేత‌లు భిన్న వాద‌న‌లు వినిపించారు. ప‌ర‌స్ప‌రం మాట‌ల తూటాలు పేల్చుకున్నారు. ఒకానొక స‌మ‌యంలో చంద్ర‌బాబు ఆగ్ర‌హంతో ఊగిపోయారు. కేంద్ర‌ప్ర‌భుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం చూస్తుంటే ర‌క్తం మ‌రిగిపోతోందని అన్నారు.

అనంత‌రం చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై ట్విట‌ర్ లో జీవీఎల్ స్పందించారు. అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు - మాణిక్యాల రావుల‌తో సీఎం చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్తించిన తీరు చూస్తుంటే ఆయ‌న‌కు పిచ్చి పీక్స్ కు చేరిన‌ట్లు క‌నిపిస్తోందని వ్యాఖ్యానించారు. మ‌హా ప్ర‌స్టేషన్ లో ఉన్న సీఎం అసెంబ్లీ రౌడీలా ప్రవర్తించార‌ని పేర్కొన్నారు. సీఎంపై సభాహక్కుల నోటీసును ఇచ్చే ఆలోచన ఉంద‌ని కూడా తెలిపారు.

జీవీఎల్ ట్వీట్ ఏపీ శాసనసభను - ముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిచే విధంగా ఉందంటూ తాజాగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ కు ఫిర్యాదు చేశారు. జీవీఎల్ పై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చారు. జీవీఎల్ ట్వీట్ ను నోటీసుకు జతచేశారు. దీంతో జీవీఎల్ చిక్కుల్లో ప‌డే అవ‌కాశ‌ముందని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆయ‌న్ను కోడెల వివ‌ర‌ణ కోర‌డం ఖాయ‌మ‌ని.. జీవీఎల్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క త‌ప్ప‌ద‌ని విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News