మాన‌వ‌త్వం మ‌రిచిన టీడీపీ ఎమ్మెల్యే!

Update: 2018-10-30 05:19 GMT
అహంకారం ఎంత‌టి వారినైనా కూల్చివేస్తుంది. అంత‌కు మించిన చెడు ఏముంటుంది. కానీ టీడీపీ నేత‌లు మాత్రం ఆ అహంకారాన్ని అలంకారంగా భావిస్తున్న‌ట్టున్నారు. ఇప్ప‌టికి తెలుగుదేశం నేత‌ల‌పై అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అందులో దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని వ్య‌వ‌హారం మ‌రీ దారుణం. ఒక ఎమ్మార్వోని ఈడ్చి మ‌రీ కొట్టారాయ‌న‌. అయినా, దానిని కూడా స‌మ‌ర్థించుకుంది టీడీపీ నాయ‌క‌త్వం. ఆయ‌న‌పై క‌నీస చ‌ర్య‌ల‌కు ఆదేశించ‌లేదు. అది పార్టీ నేత‌ల‌ను ఎంక‌రేజ్ చేసిన‌ట్టుంది. తాజాగా తూర్పుగోదావ‌రిలో పిఠాపురం ఎమ్మెల్యే... దెందులూరు ఎమ్మెల్యేని ఆద‌ర్శంగా తీసుకున్నారు. మాన‌వ‌త్వం మ‌రిచి ప్ర‌వ‌ర్తించారు. 

ఇంత‌కీ ఏం జ‌రిగింది?... పిఠాపురం ప‌రిధిలోని గొల్ల‌ప్రోలు మున్సిపాలిటీ పిఠాపురం ప‌రిధిలోకి వ‌స్తుంది. స్థానికులు మురుగు నీటి స‌మ‌స్య‌పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. సాధార‌ణంగా అలాంటి ఫిర్యాదులు వ‌చ్చిన‌పుడు క‌మిష‌న‌ర్‌ ను పిలిచి ఆరా తీయాలి. ఫిర్యాదులో ఎంత నిజ‌ముందో తెలుసుకోవాలి. త‌ర్వాత ఆ స‌మ‌స్య ప‌రిష్కారానికి అధికారుల‌కు ఓ డెడ్‌ లైన్ ఇస్తూ ఆదేశాలు జారీచేయాలి. ఇది ప‌ద్ధ‌తి. కానీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎన్ వర్మ ఇదంతా మ‌రిచిపోయారు. అస‌లు మాన‌వ‌త్వ‌మే మ‌రిచిపోయారు.

గొల్లప్రోలు 10వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమంలో ఫిర్యాదు వ‌చ్చిన వెంట‌నే వర్మ - శానిటరీ అధికారులకు ఫోన్‌ చేసి బండ బూతులు తిట్టారు. శానిటరీ ఇన్స్‌ పెక్టర్‌ శివలక్ష్మిని పిలిపించారు. ఆమె సెల్‌ ఫోన్‌ లాక్కున్నారు. మ‌హిళ అని కూడా చూడ‌కుండా అంద‌రి ముందు తిట్టి అవ‌మానించారు. అంత‌టితో ఆగ‌లేదు. మ‌నం ద‌గ్గ‌ర కూడా నిల‌బ‌డ‌డానికి ఇబ్బంది ప‌డే కచ్ఛ డ్రైయిన్‌ లో శివలక్ష్మీ చేత్తో మట్టిని బలవంతంగా తీయించారు. దీనిని తీవ్ర అవ‌మానంగా భావించిన శివలక్ష్మీ సెలవు పెట్టి వెళ్లిపోయారు. అయినా ఎమ్మెల్యే కోపం పోలేదు. మున్సిపల్‌ కమిషనర్ ను ఆదేశించి ఆమెను విధుల నుంచి తొల‌గించారు. దీనిపై శివ‌ల‌క్ష్మి స్పందించింది. ఎమ్మెల్యే వర్మ తనకు చేసిన అవమానంపై ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని - కేవ‌లం కుటుంబం రోడ్డున ప‌డుతుంద‌ని ఆగిపోయాన‌ని క‌న్నీరు పెట్టుకుంది. 40 వేల‌ మంది ఉండే గొల్లప్రోలు మున్సిపాలిటీలో 60 మంది సిబ్బందికి బ‌దులు 32 మంది మాత్రమే ఉన్నాము. సిబ్బందిని పెంచ‌కపోవ‌డం వ‌ల్ల  ప‌నులు మాకు రెట్టింప‌యినా చేస్తున్నాం. అయినా మ‌నిషికి ఇవ్వాల్సిన క‌నీస మ‌ర్యాద ఇవ్వ‌కుండా దారుణంగా అవ‌మానించారు అని ఆమె చెప్పింది.
Tags:    

Similar News