టీడీపీ మాజీ మహిళా మంత్రికి టికెట్ లేన‌ట్టేనా?!

Update: 2022-11-22 02:30 GMT
రాజ‌కీయాల్లో విన‌యం, విధేయ‌త‌, పార్టీ ప‌ట్ల అంకిత భావం అత్యంత ముఖ్యం. ఎంత ప్ర‌జ‌ల ఫాలోయింగ్ ఉన్నా.. పార్టీ పెట్టిన నియ‌మ నిబంధ‌న‌ల‌ను ఖ‌చ్చితంగా పాటించి తీరాల్సిందే. అది టీడీపీ అయినా, వైసీపీ అయినా ఒక్క‌టే. కానీ, క‌ర్నూలు జిల్లాలోని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మాత్రం త‌నే కేంద్రంగా సృష్టించుకున్న కొన్ని రాజ‌కీయాలు ఇప్పుడు ఆమెకే ఎస‌రు పెడుతున్నారు. వాస్త‌వానికి 2014లో సింప‌తీపై ఆమె నెగ్గుకొచ్చారు.

ఆమె మాతృమూర్తి భూమా శోభ ప్ర‌చారానికి వెళ్లి వ‌స్తూ ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో ఆ స్థానంలో వైసీపీ అఖిల ప్రియ‌కు టికెట్ ఇచ్చింది. దీంతో ఆమె త‌న త‌ల్లి ఫొటోను అడ్డు పెట్టుకుని విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, త‌న తండ్రి నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఆయ‌న‌కు దక్కాల్సిన మంత్రి సీటును త‌ను ద‌క్కించుకున్నారు. త‌న‌కంటూ సొంత కేడ‌ర్ను ఏర్పాటు చేసుకున్న ప‌రిస్థితికానీ, త‌న కంటూ సొంత ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొన్న ప‌రిస్థితి కానీ లేదు. అయితే, మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన త‌ర్వాత‌ మాత్రం త‌న‌దే రాజ్యంగా ఆమె వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

సొంత పార్టీలోనే ఏవీ సుబ్బారెడ్డి(నాగిరెడ్డికి మిత్రుడు కూడా)తో వివాదాలు, హైద‌రాబాద్‌లో భూమి కేసు, నియోజ‌క‌వ‌ర్గంలో ఇత‌ర నేత‌ల‌ను లెక్క చేయ‌క‌పోవ‌డం.. ఒంట‌రి సొంత అజెండాఅమ‌లు వంటివి అఖిల‌కు మైన‌స్‌గా మారాయి.

ఇక‌, ఇటీవ‌ల పార్టీ అధినేత‌ చంద్రబాబు  కర్నూలు జిల్లాలో పర్యటించినా అఖిలప్రియకానీ, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికానీ కనిపించలేదు. ఇతర నేతలంతా చివరకు మూడున్నర సంవత్సరాల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్న కేఈ సోదరులు కూడా కనిపించారు.

ఇక‌, చంద్రబాబుకు అందిన‌ సర్వేలో ఆళ్లగడ్డలో, నంద్యాలలో పార్టీ పరిస్థితి మెరుగుపడినప్పటికీ అభ్యర్థుల వల్ల ప్రత్యర్థి పార్టీకే అవకాశం ఉంటుందని తేలింది. దీంతో చంద్రబాబు రానున్న ఎన్నికల్లో భూమా అఖిలప్రియకు సీటిచ్చేది అనుమానమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అఖిలప్రియ బంధువు భూమా కిషోర్ రెడ్డి బీజేపీ నాయకుడిగా ఆళ్ల‌గ‌డ్డ నియోజకవర్గంలో దూకుడుగా ఉన్నారు. వ్యక్తిగతంగా ఆయనకు మైలేజ్ వస్తోంది. అఖిలప్రియకు బదులుగా కిషోర్ రెడ్డిని పార్టీలోకి తీసుకొని టికెట్ కేటాయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నంద్యాలో భూమా బ్రహ్మానందరెడ్డి కూడా బలోపేతం కాలేదని తేలింది.

అభ్యర్థుల బలాబలాలను బట్టి పార్టీల విజయావకాశాలు ఆధారపడివుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న బాబు మాజీ మంత్రికి దాదాపుగా చేయిచ్చినట్లుగా భావించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ఇటీవల తమది టికెట్ అడిగే స్థాయి కాదని.. 10 మందికి టికెట్ ఇచ్చే.. ఇప్పించేస్థాయి అని అఖిలప్రియ వ్యాఖ్యానించినట్టు ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ అంశాన్ని కొందరు నాయకులు అధినేత చంద్ర‌బాబుకు చేరవేశారు. అంతేకాకుండా ఇటీవల క‌ర్నూలు జిల్లాలోని నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌మీక్ష‌కు అఖిలప్రియ హాజ‌ర‌య్యారు. అయితే, ఇదే జిల్లాలో కొంద‌రికి టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసిన చంద్రబాబు.. అఖిల‌ప్రియ‌కు మాత్రం ఎలాంటి హామీ ఇవ్వ‌లేదు. తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిల సమావేశం ఏర్పాటు చేస్తే దానికి ఆమె గైర్హాజరయ్యారు.

పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉంటున్నప్పటికీ ఆళ్లగడ్డలో తనకు, నంద్యాలలో తన తమ్ముడు విఖ్యాత్ రెడ్డికి టీడీపీ టికెట్లు ఇస్తుంద‌ని ఆమె బ‌లంగా చెబుతున్నారు. ఇదే విష‌యాన్ని ప్ర‌చారం కూడా చేస్తున్నారు.  అయితే, చంద్రబాబు నుంచి ఈ విష‌యంపై స్పష్టమైన హామీ లభించలేదు. మ‌రోవైపు, అఖిలప్రియగ‌త రెండేళ్ల కాలంలో అటు వ్య‌క్తిగ‌తంగాను, ఇటు రాజ‌కీయంగా కూడా తీవ్ర వివాదాస్పదంగా మారారు. దీనివల్ల నియోజకవర్గంలో ఆమె హ‌వా త‌గ్గిపోయిన‌ట్టుగా ఇక్క‌డ చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అఖిల‌కు టికెట్ ఇచ్చినా ప్ర‌యోజ‌నం లేద‌ని, ఆమె మ‌నుషులే ఆమె ఓడించే ప్ర‌య‌త్నాలు చేస్తార‌ని చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News