ఇందిరాగాంధీ... ఎన్టీయార్.... జగన్ కూడానట... ?

Update: 2022-02-27 23:30 GMT
ఈ పేర్లు ఏంటి, వాటితో కలిపి జగన్ కి ముడి పెట్టడమేంటి అని కన్ఫ్యూజ్ అయితే మ్యాటర్ లోకి రావాల్సిందే. విషయం తెలుసుకోవాల్సిందే. ఆ ఇద్దరు ప్రముఖుల పక్కన జగన్ పేరుని కూడా చేర్చిన వారు ఆయన భక్తుడు కాడు, పార్టీ మనిషి అంతకంటే  కాదు, జగన్ అంటే వ్యతిరేకించే ప్రత్యర్ధి పార్టీ టీడీపీకి చెందిన వారు. ఆయనే బీటెక్ రవి అనబడే మరెడ్డి రవీంద్రనాధ్ రెడ్డి. ఆయనకు  చంద్రబాబు ఫస్ట్ టికెట్ కన్ ఫర్మ్ చేశారు. వచ్చే ఎన్నికల కోసం బాబు అన్నీ చూసి ప్రకటించిన మొదటి సీటు బీటెక్ రవిదే.

మరి రవికి ప్రత్యర్ధి ఎవరు అంటే ఇంకెవరు ఏపీ సీఎం జగన్. రవి పోటీ చేసే కార్యక్షేత్రం పులివెందుల. మరి చంద్రబాబు ఆ విధంగా రెండేళ్ళ ముందే జగన్ మీద రవిని రెడీ చేసి పంపారన్న మాట. ఇంతకీ రవికి పులివెందులలో పోటీ ఇది కొత్త అనుకుంటే పొరపాటు. 2011లో జగన్  కాంగ్రెస్ కి రాజీనామా చేస్తే కడప లోక్ సభతో పాటు  పులివెందులలో ఉప ఎన్నికలు వచ్చి పడ్డాయి. అప్పట్లో టీడీపీ తరఫున రవి   వైసీపీ తరఫున నిలబడిన  వైఎస్  విజయమ్మ మీద పోటీ చేసి ఓడిపోయారు.

అయితే ఆ తరువాత 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవి ఏకంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మీద పోటీ చేసి ఘన విజయం సాధించారు. నాటి నుంచి బీటెక్ రవి ప్రాభవం టీడీపీలో బాగా పెరిగింది. ఇక మరో వైపు చూస్తే నాటి వైఎస్సార్ నుంచి నేటి జగన్ దాకా వరసబెట్టి ఆ కుటుంబం మీద వరసబెట్టి  పోటీ చేస్తూ ఒక రికార్డు క్రియేట్ చేసిన సతీష్ కుమార్  రెడ్డి టీడీపీకి ఆ మధ్య రాజీనామా చేశారు. దాంతో ఆయనకు బదులుగా ఈసారి బీటెక్ రవిని బాబు వ్యూహాత్మకంగా ఎంపిక చేసి వదిలారు.

ఇక జగన్ తో పోటీ అంటే గెలుపు సాధ్యమా అంటే ఏమో జయాపజయాలు దైవాధీనాలు అని నానుడి ఉండనే ఉంది. దీని మీద ఒక చానల్ ఇంటర్యూలో రవి మాట్లాడుతూ తాను ఆశావాదిని అని అన్నారు. 2019 ఎన్నికల్లో 90 వేల పై చిలుకు మెజారిటీతో జగన్ గెలిచి ఉండవచ్చు కాక. సీఎం గా కూడా ఉండవచ్చు కాక. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం తనదే గెలుపు అయినా ఆశ్చర్యం ఏముంది అని అంటున్నారు.

ఇప్పటికే వైఎస్ వివేకా దారుణ  హత్య విషయంలో జరుగుతున్న ప్రచారం సీబీఐ దర్యాప్తు  నేపధ్యంలో వైసీపీ రాజకీయంగా పులివెందులలో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందని ఆయన అంటున్నారు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారన్నది పులివెందులలో చెట్టుకూ పుట్టకూ, పిట్టకూ కూడా తెలుసు అని, అదే విధంగా ప్రభుత్వ పాలన మీద జనాల్లో వ్యతిరేకత ఉంది, దాంతో తన గెలుపు సాధ్యమే అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన ఇందిరాగాంధీ, ఎన్టీయార్ వంటి ప్రముఖులు ఎన్నికల్లో ఓడిపోలేదా అని లాజిక్ పాయింట్ ని తీశారు. రాజ్ నారాయణ్ అనే ఆయన ఇందిరను ఓడిస్తాను అనే అనుకున్నారా. అలాగే కల్వకుర్తిలో  1989 ఎన్నికల్లో ఎన్టీయార్ మీద పోటీ చేసిన జె చిత్తరంజన్ దాస్ కూడా ఎన్టీయార్ ని ఓడిస్తాను అనే భావించి దిగారా. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. తన గెలుపు కూడా జగన్ మీద సాధించడం ఈజీ కావచ్చు అంటూ బీటేక్ రవి  హాట్ హాట్ కమెంట్స్ చేశారు.

మొత్తానికి చూస్తే రెండేళ్ల ముందే క్యాండిడేట్ ని టీడీపీ ప్రకటించడం ఇదే ఫస్ట్ టైమ్. అది కూడా ఏకంగా సీఎం క్యాండిడేట్ మీదనే పోటీకి ప్రకటించారు. ఇక బీటెక్ రవి కూడా చాలా  దూకుడు మీద ఉన్నారు.  చూడాలి మరి 2024లో పులివెందుల రాజకీయం ఎలా ఉంటుందో.
Tags:    

Similar News