బుద్ధా వెంకన్న నమ్మకం... జగన్ దెబ్బకు వమ్ము

Update: 2020-01-27 10:15 GMT
ఏపీ శాసన మండలి రద్దుపై గడచిన నాలుగైదు రోజులు గా సాగుతున్న చర్చలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి. నిన్నటిదాకా మండలిని జగన్ రద్దు చేస్తారా? లేదా? అన్న దిశగానే చర్చలు సాగితే... తాజాగా మండలిని రద్దు చేస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకోవడం, కేబినెట్ లో ఆమోదం తెలపడం, వెనువెంటనే అసెంబ్లీ లో తీర్మానం పెట్టేయడం తో ఇప్పుడు నిన్నటి దాకా జరిగిన చర్చ మాయమై పోయి... మండలి రద్దుకు ఎంత సమయం పడుతుందన్న విషయం పై చర్చ మొదలై పోయింది. ఈ దిశగా ఓ ఆసక్తికర ఘటనను చెప్పుకోవాలి. శాసన మండలిని జగన్ రద్దు చేయరంటే చేయరని, ఈ విషయం పై తాను బల్ల గుద్ది చెబుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నమ్మకాన్ని జగన్ వమ్ము చేశారని చెప్పాలి.

అయినా జగన్ పై బుద్ధా కు నమ్మకమేమిటన్న విషయానికి వస్తే... తన పదవిని కాపాడుకునేందుకో, లేదంటే... తన పార్టీ కి ఆధిపత్యం ఉన్న మండలిని కొనసాగించుకునేందుకో బుద్ధా వెంకన్న నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘మండలి రద్దు దిశగా జగన్ చేస్తున్న వ్యాఖ్యలన్నీ కేవలం బెదిరింపులు మాత్రమే. జగన్ బెదిరిస్తున్నారే తప్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ మండలిని రద్దు చేయరు. టీడీపీ ఎమ్మెల్సీలు లేకపోతే రాష్ట్రం ఇప్పటికే ముక్కలయ్యేదన్న భావన ప్రజల్లో ఉంది. వైసీపీలో ఎంతోమందికి ఎమ్మెల్సీ పదవులిస్తామని చెప్పారు. బల్ల గుద్ది చెబుతున్నా... మండలిని రద్దు చేయరు’’ అని బుద్ధా ధీమా వ్యక్తం చేశారు. అంటే...మండలి రద్దు చేయరని, ఆ విషయం లో తనకు జగన్  పై ఎంతో నమ్మకముందని కూడా బుధ్దా సంచలన వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి.

అయితే టీడీపీతో పాటు తనపై నమ్మకం పెట్టుకున్నానని చెప్పుకున్న బుద్ధా వెంకన్న కు షాకిస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న జగన్... ఈ దిశగా వడివడిగా అడుగులు వేశారు. సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవడానికి ముందే... కేబినెట్ ను సమావేశపరచి మండలి రద్దుపై నిర్ణయం తీసుకుని... ఆ వెంటనే అసెంబ్లీలో అదే ప్రతిపాదనను పెట్టేశారు. అసెంబ్లీలో మూడొంతుల్లో రెండొంతుల మేర మెజారిటీ వస్తే బిల్లుకు ఆమోదం లభించినట్లే. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాలను పరిశీలిస్తే... మండలి ప్రతి పాదనకు ఆమోదం లభించే విషయంలో తిరుగు లేదనే చెప్పాలి. అంటే... తనపై బుధ్ధా పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసినట్టే కదా.
Tags:    

Similar News