జ‌గ‌న్‌కు జైకొడ‌తాన‌న్న‌ టీడీపీ ఎంపీ గ‌ల్లా

Update: 2016-08-09 11:10 GMT
ప్ర‌త్యేక హోదా అంశం ఏపీ రాజ‌కీయ నేత‌ల‌కు ప్రాణ‌సంక‌టంగా ప‌రిణ‌మించింది. హోదాపై ఇంత ఆందోళ‌న చేసి, ఒకరోజు రాష్ట్ర బంద్ చేసినా.. కేంద్రం మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉండ‌డం విప‌క్షానికేమోకానీ, స్వ‌ప‌క్షంలోని టీడీపీ ఎంపీల‌కు చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. పార్ల‌మెంటు లోప‌ల, బ‌య‌ట టీడీపీ ఎంపీలు చేయ‌ని ఆందోళ‌న లేదు. గ‌త రెండు వారాల్లో పార్ల‌మెంటులో ఏ సంద‌ర్భం వ‌చ్చినా ఏపీకి ప్ర‌త్యేక హోదాపై వారు ధ్వ‌జ‌మెత్తుతూనే ఉన్నారు. ప్ల‌కార్డులు ప‌ట్టుకుని నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం, స‌భ‌లో త‌మ సీట్ల‌లోనే నిల‌బ‌డి ఆందోళ‌న తెలియ‌జేయ‌డం చేశారు.

ఈ క్ర‌మంలోనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. రాజ్య‌స‌భలో ఓ ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో టీడీపీ ఎంపీలు ఒకింత శాంతించారు. ఇంకేముంది తమ ప్ర‌య‌త్నంతో ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌చ్చేస్తోంద‌ని భావించారు. కానీ, ఇంత‌లో కేంద్రం నుంచి అందుతున్న సిగ్న‌ళ్ల‌ను బ‌ట్టి.. ప్ర‌త్యేక హోదా బ‌దులు ఏదో కొంత ముట్ట‌జెప్పి దానికి ప్యాకేజీ పేరుపెట్టి త‌ప్పించుకుందామ‌ని కేంద్రం యోచిస్తున్న‌ట్టు టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు. దీంతో రెండు రోజులుగా త‌మ‌లో తాము కుమిలిపోతున్నారు. ప్ర‌త్యేక ప్యాకేజీ.. అనేది కేంద్రం మొద‌టి నుంచి ఇస్తామ‌నే క‌దా చెబుతోంది. కానీ, ఏపీ వాళ్ల‌కి కావాల్సింది హోదా క‌దా. మ‌రి మ‌నం కూడా పోరాడింది దీనికోస‌మే క‌దా! ఇప్పుడేంటి కేంద్రం ఇలా ప్లేట్ ఫిరాయిస్తోంద‌ని తెగ చ‌ర్చించేసుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో తిరిగి ఆందోళ‌న కు సిద్ద‌మ‌వ్వాల‌ని కూడా డిసైడైన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఇప్ప‌టి వ‌ర‌కు విప‌క్ష ఎంపీలు చేసిన ఆందోళ‌న‌కు దూరంగా ఉన్న టీడీపీ ఎంపీలు ఇక‌పై జ‌గ‌న్ పార్టీ ఎంపీల‌తోనూ క‌లిసి ఆందోళ‌న‌లో పాల్గొనేందుకు సిద్ధ‌మ‌వుతున్న సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మంగ‌ళ‌వారం పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో మీడియాతో మాట్లాడిన గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య్‌దేవ్‌.. కేంద్రం వైఖ‌రిపై ప‌రోక్షంగా నిప్పులు చెరిగారు. త‌మ స‌హ‌నం న‌శిస్తోంద‌ని అనేశారు. అంతేకాదు.. కేంద్రం ఏదో ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకొనేందుకు య‌త్నిస్తున్న‌ట్టుగా ఉంద‌ని, కానీ త‌మ‌కు మాత్రం హోదాయే ముఖ్య‌మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటిస్తుందని వేచి చూస్తున్నామని కానీ, ఇటీవ‌ల సంకేతాలు మారిపోయిన‌ట్టు తెలుస్తోంద‌న్నారు. ఈ క్ర‌మంలో మ‌రింత గా తాము విజృంభిస్తామ‌న్నారు. అదేస‌మ‌యంలో త‌మ ప్ర‌త్య‌ర్థి జ‌గ‌న్ పార్టీ హోదా కోసం చేసే ప్ర‌య‌త్నాలను స్వాగ‌తిస్తామ‌ని చెప్పారు. మ‌రి చంద్ర‌బాబు ఈ హాట్ కామెంట్ల‌పై ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News