త‌గ్గేదేలే.. మ‌రోసారి టీడీపీ ఎంపీ కేశినేని ఘాటు వ్యాఖ్య‌లు!

Update: 2022-07-22 03:18 GMT
విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఆయన త‌న సొంత‌ పార్టీ టీడీపీ పైన విరుచుకుప‌డుతున్నారు. అటు మీడియాతోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోనూ సొంత పార్టీ నేత‌ల తీరును ఏకిప‌డేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం త‌న ఎంపీ స్టిక్క‌రును కారుకు అతికించుకుని ఒక‌ అజ్ఞాత వ్య‌క్తి తిరుగుతున్నాడంటూ కేశినేని నాని త‌న‌ సోదరుడు కేశినేని చిన్నిపైన పోలీసుల‌కు, లోక్ స‌భ సెక్ర‌ట‌రీకి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ది రికార్డు మాట్లాడుతూ నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఇప్పుడు తాజాగా సోష‌ల్ మీడియాలోనూ సొంత పార్టీ నేత‌ల‌పై కేశినేని నిప్పులు చెరిగారు.

అందులో ఆయన.. యదార్ధవాది.. లోక విరోధి అనే సామెత గుర్తు వస్తోంది. నన్ను కొన్ని రోజులు బీజేపీలోకి, కొన్ని రోజులు వైసీపీలోకి పంపించే బదులు.. చెప్పింది అర్థం చేసుకొని.. పార్టీని పటిష్టపరచుకొని.. అధికారంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తే మంచిది.. అంటూ టీడీపీ నాయకత్వాన్ని ఉద్దేశించి పోస్టు చేశారు.

తాను బీజేపీలోకి వెళ్తున్నాన‌ని, వైసీపీలోకి వెళ్తున్నాన‌ని కొంత‌మంది నేత‌లు నానిపై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని.. ఆ ఆగ్ర‌హంతోనే కేశినేని నాని తాజాగా సోష‌ల్ మీడియాలో వేదిక‌గా మండిప‌డ్డార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న‌పై దృష్టి పెట్ట‌డం మాని.. పార్టీ ప‌టిష్ట‌త‌కు కృషి చేయ‌డం మంచిద‌ని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం ఇందులో భాగ‌మేన‌ని అంటున్నారు.

విజ‌య‌వాడ టీడీపీలో ఎంపీ కేశినేని నానికి, విజ‌య‌వాడ న‌గ‌ర టీడీపీ అధ్య‌క్షుడు బుద్ధా వెంక‌న్న‌, మ‌రో నేత నాగుల్ మీరాతో తీవ్ర విభేదాలు ఉన్నాయి. ప‌లుమార్లు వీరు రోడ్లెక్కి మ‌రీ బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ విభేదాలు ముదిరి పాకాన ప‌డ్డాయి. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థుల‌కు టికెట్ల విష‌యంలో వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు పొడ‌సూపాయి. టీడీపీ మేయ‌ర్ అభ్య‌ర్థిగా కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ప్ర‌చారంలోకి వ‌చ్చారు. అయితే ఇందుకు బుద్ధా, నాగుల్ మీరా వ‌ర్గాలు ఒప్పుకోలేదు.

అయితే కేశినేని కుమార్తె శ్వేత కార్పొరేట‌ర్ గా విజ‌యం సాధించినా కార్పొరేష‌న్ లో వైఎస్సార్సీపీ గెలుచుకుంది. దీంతో మేయ‌ర్ పీఠం వైఎస్సార్సీపీకే పోయింది. కేశినేని కుమార్తె కేవ‌లం కార్పొరేట‌ర్ గానే మిగిలిపోయారు. ఈ నేప‌థ్యంలో కేశినేని టీడీపీ అధిష్టానంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడ్డారు. బుద్ధా వెంక‌న్న‌, నాగుల్ మీరా వ‌ర్గాల‌కు చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ అండ‌దండ‌లు అందిస్తున్నార‌ని భావించిన కేశినేని తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. టీడీపీ నుంచి కేశినేని నాని త‌ప్పుకుంటార‌నే వార్త‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని కేశినేని నాని చాలా రోజుల క్రితమే వెల్లడించారు. అయితే, కేశినేని వ్యవహార శైలి.. పార్టీకి దూరంగా ఉంటున్న క్రమంలో టీడీపీ ప్రత్యామ్నాయం వైపు ఆలోచన మొదలు పెట్టింద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో కేశినేని నాని సోద‌రుడు కేశినేని చిన్నిని విజ‌య‌వాడ నుంచి ఎంపీ అభ్య‌ర్థిగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దింపుతుంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News