కేశినేని కూడా జగన్ ను పొగిడేశారబ్బా!

Update: 2019-09-07 10:07 GMT
కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని... బెజవాడ ఎంపీగా రాజకీయాల్లో తనదైన మార్కును చూపిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైనా... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ వైపు వీచిన బలమైన గాలిలోనూ నిలిచి గెలిచి సత్తా చాటారు. ఆ తర్వాత అటు సొంత పార్టీ నేతలపైనే కాకుండా ఏకంగా సొంత పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపైనా తనదైన శైలి వ్యాఖ్యలు చేస్తున్న నాని... తన ప్రత్యర్థి పొట్టూరి వర ప్రసాద్ పైనా, సీఎం జగన్ పైనా సెటైర్లు సంధిస్తున్నారు. అలాంటి నాని... ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేేస్తూ జగన్ పైనా ప్రశంసలు కురిపించారు. తాను ఎవరినీ పొగడటం లేదంటూనే జగన్ ను నాని ఆకాశానికెత్తిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయినా జగన్ ను నాని ఏ విషయంలో పొగిడారు అన్న విషయానికి వస్తే... జగన్ ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పిల్లలను పాఠశాలకు పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లుగా పాదయాత్ర సమయంలోనే హామీ ఇచ్చిన జగన్... అధికారంలోకి రాగానే ఆ పథకాన్ని పట్టాలెక్కిస్తున్నట్లుగా ప్రకటించారు. వచ్చే జనవరి నుంచి ఈ పథకాన్ని లాంచనంగా ప్రారంభించనున్నట్లు కూడా జగన్ సర్కారు కీలక ప్రకటన చేసింది. ఈ పథకంపై చాలా మంది ప్రశంసలు కురిపించగా... టీడీపీ మాత్రం తనదైన శైలి విమర్శలు చేసింది. ఈ పథకంపై టీడీపీ విమర్శలు చేసినా... ఆ పార్టీ ఎంపీగా ఉన్న నాని మాత్రం ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ దిశగా నాని ఏమన్నారంటే... జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన అమ్మ ఒడి పథకం చాలా గొప్పదని నాని కితాబిచ్చారు. ఈ పథకం విధివిధానాలు సరిగ్గా ఉంటే... ప్రతీ తల్లికి ఏడాదికి రూ.15,000 అందుతాయని కూడా నాని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలే దేవాలయాలనీ - ఆ స్కూళ్లే ెంతో మంది మేధావులను దేశానికి అందించాయని కూడా నాని అన్నారు.మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన పెరగాల్సిన అవసరం ఉందని కూడా నాని వ్యాఖ్యానించారు, ఈ వ్యాఖ్యల ద్వారా ఎవరు కాదన్నా కూడా... జగన్ ను నాని పొగిడినట్టుగానే చెప్పాలి. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో నాని తనదైన శైలిని చూపించారు. ‘నేను ఎవరినీ పొగడటం లేదు. ప్రెస్ వాళ్లు తప్పుగా రాయొద్దు. నేను ఎవరినీ పొగడటం లేదు’ అంటూ నాని మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News