భాజపా- తెదేపా... డ్రామా ఆడుతున్నాయా?

Update: 2018-02-07 08:06 GMT
తెలుగుదేశం వారు రెచ్చిపోయే అవకాశం ఉన్నది గానీ.. ఒక కోణంలో చూసినప్పుడు లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ వారు చేసిన ఆరోపణ - విమర్శ సహేతుకమైనదేమో అనిపిస్తోంది. నిన్నటికి నిన్న మంగళవారం నాడు.. లోక్ సభలో నిరసనలు తెలియజేసిన సందర్భంలో ఓ చిత్రం జరిగింది. ఇప్పుడు అన్యాయం చేస్తున్నది మోడీ సర్కారు మొర్రో అని రాష్ట్ర ప్రజలు విలపిస్తోంటే.. ఆ సంగతి పక్కన పెట్టినట్టుగా లోక్ సభలో తెలుగుదేశం ఎంపీలు కాంగ్రెస్ వారి ప్రసంగాలకు అడ్డు తగలసాగారు. కాంగ్రెస్ అరాచకంగా విభజన చేసినందునే ఈ కష్టాలు వచ్చాయంటూ నినాదాలు చేశారు. ఈ వైఖరి చూసి.. ఈ నిరసనలు మొత్తం భాజపా- తెదేపా కలిసి ఆడుతున్న డ్రామా అంటూ కాంగ్రెస్ వారు ఆగ్రహించిన వైనం అందరికీ గుర్తుండే ఉంటుంది.

బుధవారం నాడు లోక్ సభలో - మోడీ ప్రసంగం చూస్తున్న ఎవరికైనా కాంగ్రెస్ ఆరోపణ నిజమే ఏమో అనిపిస్తుంది. లోక్‌ సభలో – రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు ప్రధాని మోడీ సుదీర్ఘంగా ప్రసంగించారు. తమాషా ఏంటంటే.. ధన్యవాద ప్రసంగం కాస్తా తెలుగుదేశం పార్టీ భజన ప్రసంగంలాగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ ఎలాంటి నేపథ్యంలో పుట్టింది.. పార్టీని స్థాపించిన ఎన్టీరామారావు ఎంత గొప్ప నాయకుడు - ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా చెమటలు పట్టించారు. ఏ రకంగా దెబ్బకొట్టారు. అన్నీ ఇవే అంశాలతో మోడీ మాట్లాడుకుంటూ పోయారు. తెలుగుదేశం పార్టీ వారు చాలా ఇంపుగా ఆ ప్రసంగాన్ని ఆస్వాదించారు.

కాంగ్రెస్ ను దూషిస్తూ మోడీ ప్రసంగం సాగింది గనుక.. ఆయన ప్రసంగానికి అడుగడుగునా ... కాంగ్రెస్ పార్టీ వారు అడ్డు పడుతూ - మోడీ వ్యతిరేక నినాదాలు చేస్తూ కనిపించారు. అయితే తెదేపా మోడీ ప్రసంగ సమయంలో మౌనం పాటించారు. నిజానికి రాష్ట్రం గురించిన శ్రద్ధ ఉంటే.. ఈ చరిత్రను తవ్వే ప్రసంగాలు తమకు అక్కర్లేదని బడ్జెట్ లో ఏం న్యాయం చేయబోతున్నారో చెప్పాలని.. తెదేపా సభ్యులు కూడా మోడీ ప్రసంగానికి అడ్డుపడి అడిగి ఉండాల్సింది. అలా జరగకపోవడం విశేషం. చూడబోతే.. మంగళవారం నాటి కాంగ్రెస్ ఆరోపణలే నిజంలా కనిపిస్తున్నాయి. భాజపా- తెదేపా కలిసి లోక్‌సభలో డ్రామా ఆడుతున్నాయేమో అని ప్రజలు భావిస్తున్నారు.
Tags:    

Similar News