మోడీకి టీడీపీ ఆఖ‌రి చాన్స్‌..ఇక కోర్టుకేన‌ట‌

Update: 2018-03-02 12:50 GMT
తెలుగుదేశం - బీజేపీల మ‌ధ్య మైత్రికి త్వ‌ర‌లో స్ప‌ష్ట‌త రానుంది. కేంద్ర బ‌డ్జెట్ నుంచి మొద‌లైన లుక‌లుక‌ల ప‌ర్వం కొన‌స‌గుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఏపీ కోసం మ‌రో చాన్స్ ఇవ్వాల‌ని అదే చివ‌రి చాన్స్ కావాల‌ని టీడీపీ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.  తాజాగా టీడీపీ అధినేత - సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ స‌మావేశం అనంత‌రం పార్టీ నేత‌లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హక్కులు సాధించుకునే క్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఎంపీ జయదేవ్ మాట్లాడుతూ  కేంద్రం ఇచ్చిన మాటను అమలు చేయకుండా మాట తప్పుతోందన్నారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టి అన్యాయం చేస్తే.. బీజేపీ హోదా ఇస్తామని ఇవ్వకుండా మోసం చేస్తోందన్నారు. విభజన హామీలపై అవసరమైతే కోర్టుకెళతామని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఫైనాన్స్ బిల్లులో సవరణలు చూశాక తదుపరి చర్యలుంటాయని జయదేవ్ అన్నారు. సమస్యకు పరిష్కారం వచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. ప్యాకేజీ ప్రకటించి ఏమీ ఇవ్వలేదు కాబట్టే.. హోదా డిమాండ్ చేస్తున్నామన్నారు. హోదా కింద ఇతర రాష్ట్రాలకు ఇస్తున్న వాటిని మాకూ ఇవ్వండని అడుగుతున్నామన్నారు.  

టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్ లో చర్చ జరగాలన్నారు. తమ  పోరాటానికి అన్ని పార్టీలు కూడా మద్దతును కూడగడతామన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీల నేతలు, ఎంపీలకు లేఖలు రాస్తామని అన్నారు. పార్లమెంట్ లో నిరసన ఉధృతం చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. మిత్రపక్షమైనప్ప‌టికీ ఎందుకు నిరసన చేయాల్సి వస్తుందో సభ్యులకు లేఖల ద్వారా తెలియజేస్తామన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాపోరాటం కొనసాగిస్తామని టీడీపీ ఎంపీ తోట నర్సింహం అన్నారు. ప్రత్యేక హోదా వద్దని టీడీపీ ఎప్పుడూ చెప్పలేదని, విభజన సమస్యలు పరిష్కరించే వరకు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. వ్యూహాత్మకంగా ముందుకెళ్తూ సభను స్తంభింపజేస్తామ‌ని అన్నారు. కేంద్రం దిగివచ్చే వరకూ మా పోరాటం ఆగదన్నారు. ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్దంగా ఉన్నామన్నారు.


Tags:    

Similar News