ధూమ్ ధామ్ గా పాదయాత్ర ...స్వయంగా ప్రకటించిన లోకేష్

Update: 2022-11-25 13:29 GMT
తన పాదయాత్ర గురించి చినబాబు లోకేష్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ఏడాది పాటు సుదీర్ఘమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లుగా లోకేష్ పేర్కొన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే మంగళగిరి నియోజకవర్గంలోనే ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు.

ఇప్పటిదాకా లోకేష్ పాదయాత్ర గురించి ప్రచారం సాగుతూ వచ్చింది. కానీ ఫస్ట్ టైం అఫీషియల్ గా లోకేష్ డేట్ టైం కూడా ఫిక్స్ చేసి మరీ డిక్లేర్ చేశారు. 2023 జనవరి 27 నుంచి పాదయాత్ర చేపడుతున్నానని ఆయన పార్టీ జనాలకు చెప్పారు.  ప్రస్తుతం మంగళగిరిలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లోకేష్ ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతూ తాను త్వరలో  పాదయాత్రికుడిని కాబోతున్నాను అని వెల్లడించారు.

మళ్ళీ ఏడాది పాటు మంగళగిరి నియోజకవర్గం ముఖం చూసే ప్రసక్తి ఉండదని కూడా చెప్పారు. అందువల్ల మంగళగిరి బాధ్యతలను పార్టీ నాయకులు కార్యకర్తలు చూసుకోవాలని కోరారు. అదే విధంగా తన పాదయాత్ర మంగళగిరిలో నాలుగు రోజుల పాటు జరుగుతుందని ఆయన ఒక శుభ సందేశం ఇచ్చారు.

ఇక తనను మంగళగిరిలో ఓడించడానికి ముఖ్యమంత్రి జగన్ వైసీపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంటాయని, వాటికి టీడీపీ క్యాడర్ తిప్పికొట్టలాని, సత్తా చాటాలని ఆయన పిలుపు ఇచ్చారు. మంగళగిరిలో టీడీపీని మీరు గెలిపించండి, ఏపీలో టీడీపీని గెలిపించే బాధ్యతను నేము భుజాన మీద వేసుకుంటాను అని ఆయన ఒక గంభీర ప్రకటన చేశారు.

ఇదిలా ఉంటే లోకేష్ పాదయాత్ర ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల దూరం సాగుతోంది. మొత్తం ఏపీలోని ఇరవై ఆరు జిల్లాలను చుట్టుముడుతుంది. అదే విధంగా నాలుగు వందల రోజుల పాటు పాదయాత్ర సాగుతుంది. జగన్ పాదయాత్ర 3750 కిలోమీటర్లు ఉంది. ఇప్పటిదాకా పాదయాత్రలో జగన్ దే రికార్డు. ఇపుడు ఆ రికార్డుని బ్రేక్ చేయడానికి లోకేష్ కంకణం కట్టుకున్నారు అని అర్ధమవుతోంది.

మరో వైపు పాదయాత్ర ద్వారా టీడీపీ లోపలా బయటా తానే అసలైన నాయకుడిని అని చాటి చెప్పడానికి లోకేష్ చూస్తున్నారు అని అంటునారు. పాదయాత్ర ఏపీ రాజకీయాలకు బాగా కలసివచ్చే సెంటిమెంట్ అస్త్రం. పాదయాత్ర చేసి వైఎస్సార్, చంద్రబాబు, జగన్ సీఎం లు అయ్యారు. ఇపుడు లోకేష్ జాతకం కూడా పాదయాత్రలో మారుతుందా అంటే జవాబు దానికి కాలమే చెప్పాలి.

ఏది ఏమైనా చినబాబు ఉత్సాహంగా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. టీడీపీకి ఎన్నికల ఏడాదిలో గట్టి వేడిని పుట్టించడానికి ఆయన చూస్తున్నారు. ఈ దెబ్బతో ఏపీలో సైకిల్ పరుగులు తీయాల్సిందే అని ఆయన అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News