ఇంత కాలానికి లోకేష్ కోరిక తీరిందా ?

Update: 2021-08-17 06:30 GMT
ఇప్పటికి ఓ వెయ్యిసార్లయినా తనను అరెస్టు చేయాలని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్ వైసీపీ ప్రభుత్వానికి సవాలు విసురుంటారు. అలాంటి సవాలును, లోకేష్ కోర్కెను ప్రభుత్వం సోమవారం తీర్చేసింది. గుంటూరులో పోలీసులు లోకేష్ ను అరెస్టుచేశారు. గుంటూరులో హత్యకు గురైన బీటెక్ స్టూడెంట్ రమ్య విషయంలో జరిగిన ఆందోళనలో లోకేష్ పాల్గొన్నారు. ఈ నేపధ్యంలోనే లోకేష్ ను పోలీసులు అరెస్టు చేసి తర్వాత బెయిల్ పై విడుదల చేశారు.

నిజానికి రమ్య హత్య కేసులో కన్నా ఇంకేదన్నా ప్రజాసమస్యపై లోకేష్ ఆందోళన చేసి అరెస్టయ్యుంటో బాగుండేది. పొలిటికల్ కెరీర్లోనే మొదటిసారి అరెస్టయిన లోకేష్ ఉత్సాహాన్ని కూడా పోలీసులు కాదనలేకపోయారు. నిజానికి రమ్య హత్యకేసులో ప్రతిపక్షాలు ఆందోళన చేయాల్సింది ఏమీలేదు. ఎందుకంటే రమ్య హత్య జరిగింది వ్యక్తిగత కారణాల వల్లే. మృతురాలికి ఆమె ప్రియుడితో తలెత్తిన గొడవల వల్లే హత్య జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

కానీ ఆ ఘటనను టీడీపీ, వామపక్షాలు శాంతిభద్రతల సమస్యగా మార్చాలని ప్రయత్నించాయి. ఇందులో భాగంగానే టీడీపీ, వామపక్షాల నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళన చేశారు. నిజానికి రమ్యను చంపిన శశిధర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే మృతురాలి కుటుంబానికి జరిగిన నష్టానికి పరిహారంగా ప్రభుత్వం రు. 10 లక్షలు పరిహారం అందచేసింది. నిందుతుడిని కఠినంగా శిక్షించాలన్న కుటుంబసభ్యుల డిమాండ్ కు ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. అంటే బాధితులడిగినట్లే చేయటానికి ప్రభుత్వం కూడా రెడీ అయ్యింది.

సమస్య పరిష్కారమైపోయిన తర్వాత మధ్యలో ఘటనకు ఎలాంటి సంబంధంలేని రాజకీయ పార్టీల జోక్యం అవసరమేలేదు. అయినా మధ్యలో దూరిపోయి నానా గోల చేశాయి. ఈ నేపధ్యంలోనే పోలీసులు చాలామందితో పాటు లోకేష్ ను కూడా అరెస్టుచేశారు. పోలీసుల అరెస్టుతో లోకేష్ చిరకాల డిమాండ్ తీరిపోయినట్లయ్యింది. అయినా రాజకీయ నేతన్నాక కేసులు, అరెస్టులు, కోర్టులు, బెయిళ్ళు మామూలే కదా.
Tags:    

Similar News