అక్కడ అమ్మాయిలను వేలం వేస్తారు.. రెండేళ్లకే ఎంగేజ్‌మెంట్ చేస్తారు..

మధ్యప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామంలో వింత ఆచారం ఇప్పటికీ యువతలను బాధపెడుతోంది.

Update: 2024-12-03 17:30 GMT

మధ్యప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామంలో వింత ఆచారం ఇప్పటికీ యువతలను బాధపెడుతోంది. అక్కడ అమ్మాయిలను వేలం వేయడాన్ని తీవ్రంగా వేధిస్తోంది. ఇదే క్రమంలో అక్కడి ఓ బాధిత యువతి వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా వెల్లడించింది. ‘ఝగడా నాతరా’ సంప్రదాయం ప్రకారం ఆమెకు రెండేళ్ల వయసులోనే నిశ్చితార్థం చేశారు. ఇక 22 ఏళ్ల వయసు వచ్చాక పెళ్లి చేశారు. ఆమె పడిన కష్టాలు ఆమె మాటల్లోనే..

‘మా ప్రాంతంలో అమ్మాయిలను వేలం వేస్తారు. కానీ.. నాకు అమ్ముడవ్వాలని లేదు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా పగారియా గ్రామంలో తరతరాలుగా ‘ఝగడా నాతరా’ అనే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు’ అని రోదిస్తూ తెలిపింది. కానీ.. నాకు పెళ్లయిన ఈ మూడేళ్లలో అనేక చిత్రహింసలు అనుభవించినట్లు వెల్లడించింది. రూ.5లక్షల రూపాయలు, బైక్ తీసుకురావాలని తన అత్తారింటి వారు వేధించారని తెలిపారు. ఆ వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చినట్లు పేర్కొంది. అయితే.. ఇంటికి వచ్చాక సర్దుకుపోవాలంటూ ఆమె కుటుంబసభ్యులు ఆమెకు సూచించారు. వివాహ బంధం నుంచి బయటపడితే సమాజం ఏం అనుకుంటుందోనని ఆమె పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో నచ్చజెప్పి మళ్లీ అత్తగారింటికి పంపించారు.

అయినప్పటికీ మళ్లీ తనను కొట్టారని, ఈ బంధం తెంచుకోవాలంటే  వాళ్లు రూ.18 లక్షలు డిమాండ్ చేస్తున్నారని తెలిపింది. 2023లో తన పుట్టింటికి వచ్చింది. ఇక జన్మలో తన అత్తగారింటికి వెళ్లొ్ద్దని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే.. మళ్లీ ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అత్తామామలు డిమాండ్ చేసినట్లుగా అంత మొత్తం చెల్లించడానికి సాధ్యం కాలేదని, అందుకే ఈ సమస్య గ్రామ పెద్దలకు చెప్పి్నట్లు చెప్పింది. అక్కడి పెద్ద మనుషులు సైతం ఆ వివాహిత ఈ బంధం నుంచి బయటపడాలంటే రూ.18 లక్షలు చెల్లించాల్సిందేనని నిర్ణయించారు.

బాధిత యువతి వెనుకబడిన వర్గమైన సోందియాకు చెందినది. ఈ సముదాయినికి చెందిన వారు సాధారణంగా తమ సమస్యలపై పోలీస్ స్టేషన్ గడప తొక్కింది లేదు. ఊర్లో పెద్దల ముందే పంచాయితీ పెట్టి పరిష్కరించుకోవడం ఆనవాయితీ. కానీ.. మొదటి సారి ఆ యువతి పోలీస్ స్టేషన్ గడపను తాకింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. పగారియా గ్రామం అభివృద్ధిలోనూ అంతంతే. ఈ గ్రామానికి రావాలంటే కూడా ధ్వంసమైన రోడ్డుపై నుంచి రావాల్సిందే. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం కూడా రాజ్‌గఢ్ జిల్లాలో 52 శాతం మహిళలు నిరక్షరాస్యులు ఉన్నారు. వారిలో 20-24 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలు 46 శాతం ఉన్నారు. వీటికితోడు వీరిలో చాలా మందికి 18 ఏళ్లు కూడా నిండకుండానే పెళ్లిళ్లు జరిగాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా మొత్తం జనాభా 15.45 లక్షలు. అందులో మహిళల సంఖ్య 7.55 లక్షలు. రాజ్‌గఢ్‌తోపాటు రాజస్థాన్‌లోని అగర్ మాల్వా, గుణ, ఝలావర్, చిత్తోర్‌గఢ్ తదితర ప్రాంతాల్లో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ సంప్రదాయం ప్రకారం వితంతువులు, పెళ్లికాని అమ్మాయిలు పురుషులు కలిసి జీవించ వచ్చు. వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. కానీ.. కాలక్రమేణా ఈ ఆచారం మారిపోయింది. ప్రస్తుతం ఇది మహిళల బేరసార వ్యాపారంగా మారిపోయింది. చిన్నప్పుడే అమ్మాయిలకు నిశ్చితార్థం లేదా పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఎప్పుడైనా ఈ బంధంలో సమస్యలు ఏర్పడితే బయటపడడానికి పురుషుడి తరఫున వాళ్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని ఇక్కడి ప్రజలు ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తున్నారు. గడిచిన మూడేళ్లలో ఒక్క రాజ్‌గఢ్ జిల్లాలోనూ దాదాపు 500లకుపైగా ‘ఝగడా నాతరా’కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఇవి బయటకు వచ్చినవి మాత్రమే. బయటకు రానివి ఇంకా ఎన్నో అర్థం చేసుకోవచ్చు.

అన్యాయానికి గురైన ఓ యువతి పట్ల అక్కడి ఎస్పీ ఆదిత్య మిశ్రా స్పందించారు. మహిళల హక్కులను కాలరాసే ఈ సంప్రదాయం చట్టవిరుద్ధమని, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని పేర్కొన్నారు. చిన్నప్పుడే నిశ్చితార్థాలు చేయడం, పెద్దయ్యాక అమ్మాయి ఈ బంధం నుంచి బయటపడాలంటే అబ్బాయి తరఫు ఫ్యామిలీకి లక్షల రూపాయలు చెల్లించడం వంటి కేసులు చాలా వరకు వస్తున్నాయని తెలిపారు. కేసులు నమోదు కావడం మంచి పరిణామమే అని తెలిపారు. ఇప్పటికైనా బాధితులు ధైర్యంగా తమ సమస్యను బయటకు చెబుతూ న్యాయం కోసం వస్తున్నారని పేర్కొన్నారు.

Tags:    

Similar News