నయా నీతి : చినబాబు చెబితే వినాలి....?

Update: 2022-05-31 02:30 GMT
తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల రాజకీయం కాస్తా ఇపుడు కీలకమైన మలుపు తీసుకుంటోంది. పాతికేళ్లకు పైగా బాబు గారూ అంటూ చంద్రబాబు చుట్టూ చేరిన జనాలు ఇపుడు మెల్లగా కొత్త పల్లవి అందుకోవాల్సి వస్తోంది. అదేంటి అంటే చినబాబు సారూ అనిట. టీడీపీలో అంతకంతకు పెరిగిపోతున్న లోకేష్ బాబు ప్రాధాన్యత అది.

దాన్ని కాలం తెచ్చిన మార్పుగా చూసిన వారు, రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అని అర్ధం చేసుకున్న వారూ సర్దుకుపోతున్నారు. అయితే సీనియర్లమని భావించే వారు, చంద్రబాబుతోనే తమ రాజకీయం అని అనుకునే వారు మాత్రం నలిగిపోతున్నారుట. మహానాడు సాక్షిగా టీడీపీ గ్రాఫ్ ఎంత పెరిగింది అన్నది పక్కన పెడితే చినబాబు గ్రాఫ్ మాత్రం అమాంతం పెరిగింది అని తమ్ముళ్ళే అంటున్నారు.

మహానాడు వివిధ జిల్లాల నుంచి వెళ్ళి వచ్చిన వారి కబుర్లు చూస్తే లోకేష్ మాటలేంటిరా బాబూ, చాలా దూకుడుగా ఉన్నాయి. ఎంతలా మారిపోయాడు. సూపర్ స్పీచ్ అని పొగుడుతున్నారు. ఇలా పొగిడేవారు అంతా యాభై ఏళ్ల లోపు జనాలు. వారికి చినబాబు అలా కనెక్ట్ అయిపోయాడు. చినబాబు వయసు నలభై అనుకుంటే ఆయన కంటే పదేళ్ళు పెద్ద అయిన నాయకులు తమ తమ్ముడు లోకేష్ అని భావిస్తున్నారు.

దాంతో వారు ఆయనకు గౌరవం ఇచ్చేందుకు ఆయన చెప్పినట్లుగా వినేందుకు ఏ మాత్రం సంకోచించడంలేదు. ఇక నలభైలోపు వారు, యువతకు చినబాబు అన్నయ్య, వారంతా నవతరం నేతలు. దాంతో లోకేష్ తో చాలా హ్యాపీగా కనెక్ట్ అవుతున్నారు. ఎటొచ్చి సమస్యల్లా ఆరు పదులు దాటిన సీనియర్లతోనే. వారికి చినబాబు కొడుకు వయసు వారు. పైగా చంద్రబాబు ఈడువారు అంతా కూడా ఇపుడు చినబాబుకు సలాం కొట్టాలీ అంటేనే ఆలోచిస్తున్నారు.

వారంతా ఎప్పటికీ మా బాస్ చంద్రబాబే అని అంటున్నారు. ఆయన అలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నారు. అయితే ఈ వయసు తారతమ్యాలు ఇబ్బందులను గుర్తించిన చంద్రబాబు సీనియర్లను గౌరవంగా  చూస్తామని, అదే టైమ్ లో యువతకు నలభై శాతం పైగా అవకాశాలు ఇస్తామని చెబుతున్నారు. ఇది వయా మీడియా విధానం అన్న మాట.

ఈ విధంగా టీడీపీలో సర్దుబాటు జరుగుతున్నా చాలా మంది సీనియర్లు మాత్రం లోకేష్ నయా బాస్ అన్నది ఎంతో కొంత డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి ఉందనే అంటున్నారు. అయితే మహానాడు వేదికగా లోకేష్ కి వేదిక మీద ఇచ్చిన స్పేస్. ఆయన ప్రసంగాలకు ఇచ్చిన అధిక సమయం, ఇక వేదిక మీద ఉన్న బ్యానర్ లో ఒక వైపు ఎన్టీయార్ మరో వైపు చంద్రబాబు ఇంకో వైపు లోకేష్ ఫోటోలు పెట్టి టీడీపీ జనాలకు న్యూ బాస్ గురించి తేటతెల్లంగా వివరించిన తీరు అన్నీ చూసుకుంటే కనుక ఎస్ బాస్ అని చినబాబును అనాల్సిందే.

ఇక మీదట ఆయన చెప్పినట్లుగా వినాల్సిందే. మహానాడు సభ ఒక వైపు జరుగుతూంటే పార్టీ పాలసీల గురించి చినబాబు అంత ధాటీగా మీడియా ముందు ఎలా చెప్పగలిగారు అని ప్రశ్న కనుక వేసుకుంటే కచ్చితంగా జవాబు తెలుస్తుంది. చంద్రబాబు తన రాజకీయ వారసుడిని అలా ఎలివేట్ చేస్తున్నారు అని కూడా అనుకోవాల్సి వస్తుంది.

ఏదిఏమైనా కూడా  మంచి భర్తలు పెళ్ళం చెబితే వినాలీ అని అంటారు. అలాగే మంచి తమ్ముళ్ళు అనిపించుకోవాలీ అంటే చినబాబు చెబితే వినాల్సిందే. శషబిషలకు పోయినా లేక ఆభిజాత్యాలు అడ్డుపడినా కూడా టీడీపీలో ఇబ్బందే. అందుకే చాలామంది సీనియర్లు వారసులను ముందు పెట్టి తాము గౌరవంగా తప్పుకుంటున్నారు. ఆ వెసులుబాటు లేని వారు చిన బాస్ తోనే కలసి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది.

ఇక ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన కొందరు కీలక నాయకులు మాజీ మంత్రులు కూడా నిన్నటి దాకా లోకేష్ కు కాస్తా ఎడం పాటించినా ఇపుడు మాత్రం ఆయనతో కలిసి అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు ఇది కీలకమైన పరిణామమని అంటున్నారు. ఇదే తీరున ఏపీలో అన్ని చోట్లా కూడా చినబాబు మాట వినే తమ్ముళ్ల తరం ఒకటి రెడీ అవుతోంది.
Tags:    

Similar News