బ‌ల‌హీనత తెలిసినా.. బ‌లోపేతం చేయ‌లేక‌పోతున్నారే!.. టీడీపీలో గుస‌గుస‌

Update: 2021-08-01 01:30 GMT
టీడీపీని బ‌లోపేతం చేయాలి! వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేయాలి!-సంక‌ల్పం బాగానే ఉంది. అదేస‌మ‌యంలో గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఎదురైన‌.. ఓట‌మి నుంచి బ‌ల‌హీన‌త‌ను కూడా గుర్తించారు. కానీ.. పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో అటు పార్టీ సార‌థి.. చంద్ర‌బాబు.. ఆయ‌న కుమారుడు లోకేష్‌బాబులు త‌డ‌బ‌డుతున్నార‌నే వ్యాఖ్య‌లు పార్టీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఒక సామాజిక వ‌ర్గానికే ప్రాధాన్యం ఇవ్వ‌డం.. ఆర్థికంగా బ‌లంగా ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వ‌డం వంటి ప‌రిణామాలే.. పార్టీని ఓడించాయ‌ని `లెక్క‌లు` తేల్చారు. ఈ క్ర‌మంలో త‌ప్పులు స‌రిదిద్దుకుని ముందుకు సాగుతామ‌ని.. గ‌తంలో క‌న్నా పార్టీని బ‌లోపేతం చేస్తామ‌ని.. చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని కూడా ఆయన అంటున్నారు. అయితే.. క్షేత్ర‌స్థాయిలోకి వ‌చ్చే స‌రికి మాత్రం గ‌తాన్నే అనుస‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు జోరుగా సాగుతున్నాయి. పైన చెప్పుకొన్న‌ట్టు.. ఒక సామాజిక వ‌ర్గానికే ఇప్పుడు కూడా ప్రాధాన్యం ఇస్తున్నార‌ని.. పార్టీలోని ఎస్సీ, బీసీ నేత‌లు వాపోతున్నారు. ``అధికారంలో ఉన్న‌ప్పుడు వారి మాటే నెగ్గింది. ఇప్పుడు కూడా వారే పెత్త‌నం చేస్తున్నారు. మ‌రి మేం ఏం చేయాలి. ఎన్నిక‌ల‌కుముందు మాత్ర‌మే.. మా అవ‌స‌రమా?`` అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో ఆర్థికంగా బ‌లంగా లేక‌పోయినా.. ప్ర‌జా బ‌లం ఎక్కువ‌గా ఉన్న నేత‌ల‌ను ఇప్పుడు కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. గ‌త‌ ఏడాది క‌రోనా కార‌ణంగా.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోలేక‌పోయినా.. నాయ‌కుల‌ను ఊర‌డించ‌లేక పోయినా.. ఇప్పుడు చంద్ర‌బాబు, లోకేష్‌లు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు.

అయితే.. వారు ప‌రామ‌ర్శిస్తున్న కుటుంబాల‌ను చూస్తే.. ఒక సామాజిక వ‌ర్గానికే చెంది ఉంటున్నాయి. అందునా.. ఆర్థికంగా బ‌లంగా ఉన్న కుటుంబాల‌నే వారు ప‌రామ‌ర్శిస్తున్నారు. లేదా గ‌తంలో హై ప్రొఫైల్ ఉన్న నాయ‌కుల‌కు మాత్ర‌మే వారి ద‌ర్శ‌నం ల‌భిస్తోంద‌ని అంటున్నారు త‌మ్ముళ్లు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు బాధితులుగా ఉన్న ఎస్సీ, బీసీ వ‌ర్గాల‌ను, ఆర్థికంగా బ‌లంగా లేని వ‌ర్గాల‌ను టీడీపీ అధినేత ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు. ఇది పార్టీని ఎలా బ‌లోపేతం చేస్తుంద‌ని.. ప్ర‌శ్నిస్తున్నారు. పార్టీ బ‌లోపేతం అంటే.. ఉన్న‌త‌స్థాయి నాయ‌కుల బ‌లోపేత‌మా? లేక‌.. అన్ని వ‌ర్గాల బ‌లోపేత‌మా? అనేది తేల్చాల‌ని అంటున్నారు.

అదేస‌మ‌యంలో యువత విష‌యంలో బాబు అనుస‌రిస్తున్న వైఖ‌రిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. యువ‌త అంటే.. ఎవ‌రు? అని ప్ర‌శ్నిస్తూ.. ఇటీవ‌ల ఒక‌రు చంద్ర‌బాబుకు పోస్టు పెట్టారు. దీనిపై టీడీపీ నేత‌లు ఎవ‌రూ స్పందించ‌లేదు.కానీ, టీడీపీ వ్య‌తిరేక మీడియా మాత్రం తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది. యువ‌త అంటే.. చంద్ర‌బాబు దృష్టిలో వార‌స‌త్వంగా వ‌చ్చిన వారేన‌ని.. పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ.. ఉద్యోగాలు సైతం వ‌దులుకుని పార్టీ కోసం కృషి చేసిన వారు యువ‌త కాద‌ని.. తండ్రుల ప‌రంగా.. త‌ల్లుల ప‌రంగా.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌వారే యువ‌త‌గా చంద్ర‌బాబు ప‌రిగ‌ణిస్తున్నార‌నేదివారి వాద‌న‌. నిజానికి గ‌త ఎన్నిక‌లు తీసుకుంటే.. ఇదే ప‌రిస్థితి క‌నిపించింది.

యువ‌త‌కు టికెట్లు ఇచ్చాన‌ని చెప్పుకొన్నా.. వారుసుల‌కే ఆయ‌న టికెట్లు ఇచ్చారు. మ‌రి వార‌స‌త్వం లేని యువ‌త ప‌రిస్థితి ఏంటి? వారిలో గెలిచే స‌త్తా లేద‌ని.. నిర్ణ‌యించుకుంటే.. మ‌రి వార‌సులుగా అరంగేట్రం చేసి.. టికెట్లు తెచ్చుకున్న‌వారిలో ఎంత‌మంంది విజ‌యం ద‌క్కించుకున్నారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌గా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికైనా.. అంద‌రినీ స‌మానంగా ఆద‌రిస్తేనే.. ముఖ్యంగా ఒక సామాజిక‌వ ర్గానికే ప‌రిమితం అవుతున్నార‌న్న ముద్ర‌ను తుడిపేసుకుంటేనే.. పార్టీ ప‌రిస్థితి మెరుగ‌వుతుంద‌ని అంటున్నారు పరిశీల‌కులు. మ‌రి బాబు ఏం చేస్తారో చూడాలి.




Tags:    

Similar News