కమ్మ సామాజికవర్గం ఈ పరిస్థితి నుంచి మళ్లీ పుంజుకుంటుందా?

Update: 2022-05-19 06:19 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను శాసించిన కమ్మ సామాజికవర్గం ఇప్పుడు చాలా ఒడిదుడుకుల్లో ఉంది. గతంలో శాసనసభలో, పార్లమెంటులో ఈ సామాజికవర్గం నుంచి భారీగా సభ్యులు ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ శాసనసభలో కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యేల సంఖ్య 17కి పడిపోయింది. తెలంగాణ శాసనసభలోనూ కమ్మ ఎమ్మెల్యేలు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. తాజాగా రాజ్యసభలో కొంతమంది సభ్యులు పదవీ విరమణ చేయడంతో అక్కడ కూడా కమ్మ ప్రాతినిధ్యం తగ్గిపోయింది.

రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తక్కువలో తక్కువ కాకుండా కనీసం 50 మంది వరకు కమ్మ శాసనసభ్యులు ఉండేవారు. ఈ సంఖ్య 2004 ఎన్నికల నుంచి తగ్గుతూ వచ్చింది. అలాగే పార్లమెంటులో అంటే లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి పది మంది వరకు కమ్మ ఎంపీలు ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య ఐదుకి పడిపోయింది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ ఎమ్మెల్యేల సంఖ్య 17కి తగ్గిపోయింది. ఈ 17 మందిలో టీడీపీతోపాటు వైఎస్సార్‌సీపీ నుంచి కూడా గెలిచారు. భారీ సంఖ్యలో కమ్మ ఎమ్మెల్యేలు తగ్గిపోవడానికి టీడీపీ అధికారం కోల్పోవడమే కారణం.

ఇక కమ్మ సామాజికవర్గం అతి తక్కువగా ఉన్న తెలంగాణలో ఐదారుగురు మించి కమ్మ ఎమ్మెల్యేలు లేరు. 2014, 2019 ఎన్నికల్లో ఇదే పరిస్థితి. ప్రస్తుతం ఖమ్మం, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, సిర్పూర్‌ కాగజ్‌నగర్, మిర్యాలగూడ, కూకట్‌పల్లి నుంచి మాత్రమే కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు.

అలాగే పార్లమెంటులో ఇప్పుడు వివిధ పార్టీల తరఫున కమ్మ ఎంపీల సంఖ్య ఐదుకు పడిపోయింది. వైఎస్సార్‌సీపీ తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంవీ సత్యనారాయణ, టీడీపీ తరఫున గళ్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌ మాత్రమే ఎంపీలుగా ఉన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో అయితే కమ్మ సామాజికవర్గం నుంచి భారీగానే ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించాక జరిగిన 1983 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల తరఫున 52 మంది కమ్మ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇక 1985 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కమ్మ ఎమ్మెల్యేలు సంఖ్య కూడా 52. దివంగత నేత వంగవీటి రంగా హత్య తర్వాత జరిగిన 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. అయినా ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల తరఫున 36 మంది కమ్మ ఎమ్మెల్యేలు నెగ్గారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం నుంచి అన్ని పార్టీల తరఫున 54 మంది ఎమ్మెల్యేలు నెగ్గారు. అలాగే 1999 అసెంబ్లీ ఎన్నికల్లో 43 మంది కమ్మ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అటు కాంగ్రెస్‌ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల నుంచి కూడా కమ్మ ఎమ్మెల్యేలు ఉండేవారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 2004, 2009 ఎన్నికల్లోనూ దాదాపు 30 (అన్ని పార్టీల తరఫున)కి తక్కువ కాకుండా కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2004 శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీల తరఫున గెలిచిన కమ్మ ఎమ్మెల్యేల సంఖ్య.. 34. ఇక 2009 శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీల తరఫున గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య.. 28. ఇక అదే సంవత్సరం జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఐదుగురు కమ్మ సామాజికవర్గం నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు.

ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక 2014లో జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా ఒక్క ఏపీ నుంచే 33 మంది (టీడీపీ తరఫున 30 మంది, కాంగ్రెస్‌ తరఫున 3) కమ్మ ఎమ్మెల్యేలు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఈ సామాజికవర్గానికి గట్టి దెబ్బ తగిలింది. కేవలం 17 మంది మాత్రమే గెలిచారు. చరిత్రలో తొలిసారిగా 30 కంటే తక్కువగా (2009 మినహాయించి) కమ్మ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం పడిపోయింది.
Tags:    

Similar News