క‌ర్నూలు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌..ఉత్కంఠ

Update: 2017-12-20 10:09 GMT

క‌ర్నూలు జిల్లాలో మ‌రోమారు రాజ‌కీయ వేడి ర‌గులుతోంది. కర్నూలు స్థానిక సంస్థల శాసనమండలి సభ్యునిగా తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించిన శిల్పా చక్రపాణిరెడ్డి ఆగస్టులో జరిగిన నంద్యాల శాసన సభ ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ - శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో శాసనమండలి సభ్యుని ఎన్నిక అనివార్యమైంది. ఈ నేప‌థ్యంలో క‌ర్నూలు స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థి ఎన్నికకు నిర్వహిస్తున్న ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ను ఎన్నికల అధికారి - జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మంగళవారం విడుదల చేశారు. దాంతో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లకు తుదిగడువు డిసెంబరు 26. జనవరి 12న పోలింగ్‌. జనవరి 16న కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు.

అయితే ఈ ప్ర‌క‌ట‌న అధికార తెలుగుదేశం పార్టీలో కొత్త స‌మీక‌ర‌ణాల‌కు వేదిక‌గా మారింది. టీడీపీ తరపున పోటీ చేస్తే... సులభంగా విజయం సాధించే అవకాశముండటంతో టికెట్ కోసం ముగ్గురు - నలుగురు పోటీ పడుతున్నట్లు సమాచారం. ప్రధానంగా మాజీమంత్రి - ఎపీఐడీసీ చైర్మన్ కేఈ ప్రభాకర్ - నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీ‌ధ‌ర్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు నందికొట్కూరు టీడీపీ ఇన్‌ చార్జి మాండ్ర శివానందరెడ్డి - మాజీమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం.

కాగా, నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఎస్పీవై రెడ్డితో జరిపిన చర్చల్లో శాసనమండలి స్థానిక సంస్థల అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు నంద్యాలలో ప్రచారం జరిగింది. చంద్రబాబు ఇచ్చిన హామీ కారణంగా ఆయనకే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కుతుందన్న భావన కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో బీసీ సామాజికవర్గం వారిని సంతృప్తిపర్చడానికి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తన సోదరుడైన కేఈ ప్రభాకర్‌ కు టికెట్ ఇప్పించడానికి విశేష కృషి చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. దీంతో వీరివురిలో ఒకరికి టికెట్ ఖాయమని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే మాండ్ర శివానందరెడ్డి - ఏరాసు ప్రతాపరెడ్డి సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తుండటంతో పార్టీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలంటున్నారు.

ఇలా పెద్ద ఎత్తున పార్టీ సీనియ‌ర్లు - ముఖ్య నేత‌లు పోటీ ప‌డుతున్న నేప‌థ్యంలో కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఇంతవరకు టీడీపీ నిర్ణయించలేదు.వారం రోజుల క్రితం జరిగిన పార్టీ నేతల సమావేశంలో విడి విడిగా కాలువ శ్రీనివాసులు - టిడిపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అభిప్రాయాలను సేకరించారు.ఈ అభిప్రాయాలను చంద్రబాబునాయుడుకు అందించారు. అదే రోజు మంత్రివర్గ సమావేశం తర్వాత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కానీ, అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదు.  ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేసుకొనేందుకు నేతలంతా ఏకాభిప్రాయానికి రావాలని - కర్నూల్ జిల్లా ఇంచార్జీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఈ ప్ర‌క్రియ‌కు బాధ్య‌త వ‌హించాల‌ని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. మరో వైపు అభ్యర్థి ఎవరో తేలకుండానే టీడీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం విశేషం.

ఈ ఎన్నికల్లో మొత్తం 1142 ఓట్లు ఉండగా ఇందులో కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికలు నిర్వహించనందున 51 ఓట్లు - ఎంపీటీసీలుగా ఎన్నికైన వారిలో 16 మంది - జడ్పీటీసీలు ఇద్దరు మరణించారు. దీంతో ఎంపీటీసీలు 800 మంది - పురపాలక వార్డుసభ్యులు 222 మంది - జడ్పీటీసీలు 51 మంది కలిపి 1073 మంది స్థానిక ప్రతినిధులు - ఆరుగురు ఎమ్మెల్యేలు - ఒక ఎంపీ కలిపి మొత్తం 1080 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక - ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి - పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కర్నూలు నగర పాలకసంస్థను ఎంచుకోడంతో అక్కడ పాలక మండలి లేని కారణంగా వారు శాసనమండలి ఎన్నికల్లో ఓటు వేయడానికి వీలు లేకుండా పోయింది.
Tags:    

Similar News