ఆనం కుమారుడికి టీడీపీ ఆఫ‌ర్‌.. విష‌యం ఏంటంటే!

Update: 2021-03-14 04:30 GMT
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోద‌రులు సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో ఉన్న విష‌యం తెలిసిందే. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న వీరు వైఎస్ హ‌యాంలో 2004 నుంచి జిల్లాలో చ‌క్రం తిప్పారు. దివంగ‌త ఆనం వివేకానంద‌రెడ్డి, ప్ర‌స్తుత వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిలు గ‌తంలో మంత్రులుగా కూడా ప‌నిచేశారు. అయితే, 2014 త‌ర్వాత రాష్ట్ర విబ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వీరు అప్ప‌ట్లో సైలెంట్ అయ్యారు. త‌ర్వాత కాలంలో టీడీపీలో చేరారు. ఇక‌, వివేకా అనారోగ్యంతో మృతి చెంద‌గా.. ఆనం రామ‌నారాయ‌ణ‌కు ఆశించిన విధంగా టీడీపీలో గుర్తింపు రాలేదు. ఆయ‌న ఎమ్మెల్సీ ఆశించారు. అయితే.. గ్రూపు రాజ‌కీయాల నేప‌థ్యంలో అప్ప‌ట్లో చంద్ర‌బాబు ఆ ప‌ద‌విని ఇవ్వ‌లేక పోయారు.

దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రామ‌నారాయ‌ణ రెడ్డి వైసీపీలోకి వెళ్లి.. వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019లో విజ‌యం సాధించారు. ఇదిలావుంటే.. వివేకా కుమారుడు రంగ మ‌యూర్ రెడ్డి కొన్నాళ్లు టీడీపీలో ఉన్నా.. త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ప్ర‌స్తుతం వైసీపీలోనూ ఆయ‌న లేరు. కొంత త‌ట‌స్థంగా ఉన్నారు. త‌న బాబాయి.. రామ‌నారాయ‌ణ‌తో ఉంటున్నా.. ఆయ‌న‌కే వైసీపీలో గుర్తింపు లేక‌పోవ‌డం.. ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డం.. వంటి కార‌ణాల‌తో ఇప్పుడు బాబాయి, అబ్బాయిలు ఇద్ద‌రూ కూడా అసంతృప్తితో ఉన్నారు. వైసీపీ పాల‌న‌పై కొన్నాళ్ల కింద‌ట రామ‌నారాయ‌ణ రెడ్డి.. తీవ్ర విమ‌ర్శ‌లు కూడా చేశారు. దీంతో ఆయ‌నను వ‌దిలించుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

మ‌రోవైపు.. టీడీపీ నెల్లూరులో బ‌ల‌ప‌డాల‌ని నిర్ణ‌యించుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. టీడీపీ స‌త్తా చాటాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో రంగ‌మ‌యూర్‌రెడ్డిని పార్టీలోకి తీసుకుని కోరిన టికెట్ ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ఆత్మ‌కూరు.. లేదంటే నెల్లూరు రూర‌ల్ లేదా సిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రంగ‌మ‌యూర్‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని చంద్ర‌బాబు సైతం భావిస్తున్న‌ట్టు నెల్లూరు వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదే స‌మ‌యంలో రేపు జ‌గ‌న్ క‌నుక ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి ప్రాదాన్యం లేకుండా చేస్తే.. ఆయ‌న‌ను కూడా పార్టీలోకి తీసుకుని.. గుర్తింపు ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్టు చెబుతున్నారు. ఇప్ప‌టికైతే.. రంగ‌మ‌యూర్ విష‌యంలో చంద్ర‌బాబు నుంచి క్లారిటీ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. మ‌రి ఆయ‌న ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News