కేసీఆర్ కు చంద్రబాబు షాక్

Update: 2022-10-08 16:39 GMT
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని రాజేసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను  కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేయడంతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసే దిశగా ప్రయత్నాలు మొదలుబెట్టాయి. తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక, మునుగోడులో పార్టీ పరంగా కాంగ్రెస్ కు మంచి పట్టు ఉండడంతో గెలుపు తమదేనని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక, మొన్నటివరకు తన అభ్యర్థి విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేసిన టీఆర్ఎస్...నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మునుగోడు ఉపఎన్నిక పోరులో నిలిపింది. ఈ క్రమంలోనే మునుగోడులో త్రిముఖ పోరు మాత్రమే ఉంటుందని అంతా అనుకున్నారు.

అయితే, అలా ఆలోచిస్తున్న వారందరికీ టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు షాకివ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక బరిలో టీడీపీ తరఫున కూడా అభ్యర్థిని నిలబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుబెట్టారని తెలుస్తోంది. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు, కొందరు సీనియర్ నాయకులతో మాట్లాడిన చంద్రబాబు....సీనియర్ పొలిటిషన్ బూర నర్సయ్య గౌడ్ ను టీడీపీ అభ్యర్థిగా మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

టీఆర్ఎస్ తరఫునుంచి టికెట్ ఆశించి బూర నర్సయ్య గౌడ్ భంగపడ్డారు. బీసీ నేతగా మంచి గుర్తింపు ఉన్న నర్సయ్య గౌడ్ ను పోటీ చేయించి విజయం సాధించాలని, ఈ గెలుపుతో తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తీసుకురావాలని చంద్రబాబు అనుకుంటున్నారట. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు అగ్రవర్ణాలకు చెందిన నేతలకు టికెట్లు ఇవ్వడంతో బీసీ కార్డును చంద్రబాబు ఉపయోగించాలని ఫిక్స్ అయ్యారట.

తెలంగాణలో టీడీపీ దాదాపుగా అంతర్ధానం అయిపోతున్న దశలో బూర నర్సయ్య గౌడ్ వంటి నేత తమ పార్టీలో చేర్చుకోవాలని, మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి టీడీపీ క్యాడర్లో కొత్త జోష్ నింపాలని చంద్రబాబు అనుకుంటున్నారట. మరి, చంద్రబాబు ప్రతిపాదనను బూర నర్సయ్య గౌడ్ అంగీకరిస్తారా? తెలంగానలో పత్తా లేని టీడీపీ తరఫున పోటీ చేస్తారా? అన్నది తేలాలంటే మరి కొద్దిరోజులు వేచి చూడక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News