టీఢీపీ : శ్రీ‌కాకుళంలో చంద్ర‌బాబుకు ఇంటి పోరు !

Update: 2022-08-10 08:30 GMT
తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్త‌రాంధ్ర అని త‌రుచూ వినిపించే మాట. అయితే గత ఎన్నికల్లో పెద్ద దెబ్బ పడింది. అందుకే ఈసారి మ‌ళ్లీ ఉత్తరాంధ్ర వాకిట గెలుపు ప‌తాక ఎగుర‌వేయాల‌ని భావిస్తున్న టీడీపీకి కొన్ని ఇంటి పోరులు త‌ప్పే లా లేవు. వీటితో పాటు ఇంకొన్ని తిరుగుబాటు ధోర‌ణ‌లు కూడా త‌ప్పేలా లేవు అన్న వాద‌న‌లు కొన్ని ప‌రిశీల‌కుల నుంచి విన‌వ‌స్తున్న‌వి.

శ్రీ‌కాకుళం రాజ‌కీయాల్లో గుండ కుటుంబానికి మంచి పేరుంది. ఆ కుటుంబ పెద్ద మాజీ మంత్రివ‌ర్యులు గుండ అప్ప‌ల సూర్య‌నారా యణ  స్వ‌త‌హాగా సౌమ్యులు. స్వ‌భావ రీత్యా కాస్త ఆవేశం ఉన్న చిన్న,చిన్న‌త‌ప్పులు కూడా క్ష‌మించ‌ని నైజం కూడా ఉంది. ఇదే సంద‌ర్భంలో ఆయ‌న జీవ‌న స‌హ‌చ‌రి గుండ లక్ష్మీదేవి గ‌త ఎన్నిక‌ల్లో (అంటే 2014 ఎన్నిక‌ల్లో) పోటీ  చేశారు.  ఆ ఇంటి చుట్టం ఇప్ప‌టి రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావును ఓడించారు.

ఓ విధంగా అన్న‌య్య‌ను ఓడించి చెల్లెమ్మ గ‌ద్దెనెక్కారు.  రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఇష్టం లేక‌పోయినా, అప్ప‌టి ప‌రిస్థితుల రీత్యానే తాను వైఎస్సార్సీపీకి వెళ్లాల్సి వ‌చ్చింద‌ని చెబుతారు ధ‌ర్మాన. ఎందుకంటే ఆయ‌న ఫ‌క్తు కాంగ్రెస్ వాది. ప్రాంతీయ పార్టీల పిలుపు గ‌తంలో కూడా ఉన్నా వెళ్ల‌లేదు. పీఆర్పీ హ‌వాలోనూ నెగ్గుకువ‌చ్చిన నాయ‌కులు. ఈయ‌న కూడా స్వ‌భావ రీత్యా సౌమ్యులు.

గ‌తంలో ఆయన చుట్టూ ఉన్న కొంద‌రి త‌ప్పిదాల వ‌ల్ల  కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు గుండ కుటుంబం తో ధ‌ర్మాన‌కు అయితే పెద్ద‌గా పోటీ అయితే లేదు. కాస్త దృష్టి సారిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ధ‌ర్మాన హ‌వా కొన‌సాగ‌డం ఖాయం అని కొందరంటున్నారు. ముందున్న స్పీడు కూడా ఆయ‌న‌కు లేదు. ఒక‌ప్పుడు ఆయ‌న‌కు చెడ్డ‌పేరు తెచ్చిన రౌడీలూ, గూండాలూ ఇప్పుడు అంత‌గా హ‌వా సాగించ‌డం లేదు. ఆయ‌న చుట్టూ ఉన్న భ‌జ‌న ప‌రులు కూడా కాస్త త‌గ్గే ఉన్నారు.ఇవ‌న్నీ ధ‌ర్మాన కు సానుకూల‌త ఇచ్చే అంశాలు.

కానీ ఇదే స‌మ‌యాన గుండ కుటుంబానికి మాత్రం రాజ‌కీయ ఎదుగుద‌ల అన్న‌ది పెద్ద‌గా లేదు. ప‌ద‌వి లేని కార‌ణంగా కొంత సైలెంట్ అయిపోయారు. పెద్ద‌గా ప్ర‌జా ఉద్యమాల్లో కూడా పాల్గొంటున్న దాఖ‌లాలూ లేవు. ఇదే సంద‌ర్భంలో కిష్ట‌ప్పపేట యువ నాయ‌కుడు, స‌ర్పంచ్  సీన్ లోకి వ‌చ్చారు. ఆయన పేరు గొండు శంక‌ర్.  నిన్న‌టి వేళ అధినేత చంద్ర‌బాబును క‌లిశారు.

త‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వాల‌ని కోరారు అని కూడా ఓ ప్రాథ‌మిక స‌మాచారం. స్వ‌భావ రీత్యా శంక‌ర్ పార్టీ విధేయుడు. ఆయ‌న నాన్న గొండు జ‌గ‌ప‌తి కూడా తెలుగుదేశం పార్టీనే మొద‌టి నుంచి న‌మ్ముకుని ఉన్నారు. గ‌తంలో ఎంపీపీ గా ప‌నిచేశారు. ఓ విధంగా ఈ కుటుంబం మొత్తం ఎప్పటి నుంచో తెలుగుదేశంనే న‌మ్ముకుని ఉన్నా కూడా పార్టీ ప‌రంగా కానీ ఇంకా ఇత‌ర ప‌ద‌వుల విష‌య‌మై కానీ స్థానిక నాయ‌కత్వంతో కానీ, అధి నాయ‌క‌త్వంతో కానీ త‌గాదాలు ప‌డిన దాఖ‌లాలే లేవు. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయింది. గొండు శంక‌ర్ అనే యువ నాయ‌కుడు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. పై స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నార‌న్న వార్త‌లూ ఉన్నాయి.

ఈ క్ర‌మంలోనే నిన్న‌టి వేళ అధినేత బాబును క‌లిసి పార్టీ బాగు కోసం తానేం చేస్తున్నానో , ప్రాంతం బాగు కోసం తానేం చేయ‌గ‌ల‌నో వంటి విష‌యాలు అన్నింటినీ వివ‌రించారు అని తెలుస్తుంది. అధినేత కూడా అన్నింటినీ విన్నారు. స‌మ‌యానుకూలంగా నిర్ణ‌యాలు అన్న‌వి ఉంటాయి క‌నుక శంక‌ర్ ను మాట్లాడి పంపించారు. అయితే ఇక్క‌డితో క‌థ ఆగ‌లేదు.

గ‌తంలో ఇదే విధంగా నాగావ‌ళి కృష్ణ (ఖాజీపేట నాయకులు, దివంగ‌త ఎర్ర‌న్న ప్ర‌ధాన అనుచ‌రులు, ప్ర‌స్తుత ఎంపీ రామూ స్నేహితులు) కూడా గ‌త ఎన్నిక‌ల్లో ఆఖ‌రి నిమిషం వ‌ర‌కూ టికెట్ కోసం ట్రై చేశారు. కానీ స‌ఫ‌లీకృతం కాలేదు. ఇక ఇంకొంత మంది కూడా త‌మ‌కు టికెట్ ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచ‌న‌తో అధినేతకు విన్న‌పాలు ఇస్తున్నారు. వీటితో పాటు గుండ కుటుంబం నుంచి వారి చిన్న‌బ్బాయి విస్సు ఇటుగా వ‌స్తార‌న్న వార్త‌లు కూడా ఉన్నాయి. ఇన్నీఇవ‌న్నీ రాబోవు ఎన్నిక‌ల‌ను ఏ విధంగా ప్ర‌భావితం చేస్తాయో అన్న‌ది చూడాలిక.
Tags:    

Similar News