మంది లేకున్నా టీడీపీనే ప‌ట్టు సాధించిందా?

Update: 2022-09-21 08:30 GMT
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ వ‌ర్షాకాల అసెంబ్లీ స‌మావేశాల్లో టీడీపీనే ప‌ట్టు సాధించింద‌నే అభిప్రాయాలు విశ్లేష‌కుల నుంచి వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీకి 151 మంది స‌భ్యుల బ‌లం ఉంది. మ‌రో న‌లుగురు టీడీపీ స‌భ్యులు, 1 జ‌న‌సేన పార్టీ స‌భ్యుడు అధికార పార్టీతోనే అంట‌కాగుతున్నారు. టీడీపీ గ‌త ఎన్నిక‌ల్లో గెలుచుకున్న 23 మంది ఎమ్మెల్యేల్లో న‌లుగురు అధికార పార్టీతో చెట్టాప‌ట్టాలేసుకు తిరుగుతున్నారు. దీంతో టీడీపీ బ‌లం 19కి ప‌డిపోయింది. ఇందులోనూ విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు అంత క్రియాశీల‌కంగా లేరు. ఆయ‌న అసెంబ్లీ స‌మావేశాల‌కు సైతం హాజ‌రు కావ‌డం లేద‌ని అంటున్నారు. ఇక పార్టీ అధినేత చంద్ర‌బాబు మ‌ళ్లీ గెలిచి సీఎం అయ్యాక కానీ శాస‌న‌సభ‌కు రాన‌ని శ‌ప‌థం చేసి హాజ‌రు కావ‌డం లేదు. దీంతో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మిగిలారు. వీరిలోనూ వివిధ కార‌ణాల‌తో ముగ్గురు, న‌లుగురు రావ‌డం లేద‌ని స‌మాచారం. దీంతో 13, 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలే శాస‌న‌స‌భ స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతున్నారు.

అయితే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ధీటుగా వివిధ అంశాల‌పై టీడీపీ నేత‌లు గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తున్నార‌ని, పోరాడుతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అధికార పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలున్నా, త‌మ పార్టీకి చెందిన న‌లుగురు వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతున్నా భ‌య‌ప‌డ‌కుండా వివిధ అంశాల‌పై శాస‌న‌స‌భ‌లో ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెడుతున్నార‌ని అంటున్నారు.

అదేవిధంగా శాస‌న‌మండ‌లిలోనూ ఇదే దూకుడు టీడీపీ క‌న‌బ‌రుస్తోంద‌ని అంటున్నారు. శాస‌న‌స‌భ‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియ‌ర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే, ప్ర‌జాప‌ద్దుల క‌మిటీ చైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్, పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు త‌దిత‌రులు వివిధ అంశాల‌పై గ‌ట్టిగా పోరాడుతున్నార‌ని ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పార్టీ అధినేత చంద్ర‌బాబు స‌భ‌కు రాకున్నా.. నిరుత్సాహ‌ప‌డ‌కుండా, భ‌య‌ప‌డ‌కుండా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని వివిధ అంశాల‌పై టీడీపీ ఎమ్మెల్యేలు నిల‌దీస్తున్నార‌ని పేర్కొంటున్నారు.

వివిధ అంశాల‌పై ప్ర‌భుత్వ లోపాల‌ను ఎత్తిచూప‌డంతోపాటు ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టేలా వివిధ స‌మ‌స్య‌ల‌పై బ‌ల‌మైన ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తున్నార‌ని చెబుతున్నారు. తాను అసెంబ్లీలో లేకున్నా వెర‌వ‌కుండా పోరాడ‌టంపై చంద్ర‌బాబు సైతం పార్టీ ఎమ్మెల్యేల‌ను ప్ర‌శంసించిన‌ట్టు స‌మాచారం.

మ‌రోవైపు శాస‌న‌స‌భ స‌మావేశాలు మొద‌లైన గురువారం నుంచే ప్ర‌తిరోజూ టీడీపీ ఎమ్మెల్యేలు రోజంతా సస్పెండ్ అవుతూనే ఉన్నారు. స్పీక‌ర్ పోడియంను చుట్టుముట్టార‌ని, స‌భా కార్య‌క్ర‌మాల‌కు అడ్డుత‌గిలార‌ని ఇలా స్పీక‌ర్ వీరిని సస్పెండ్ చేస్తున్నారు. అయినా స‌రే స‌భ‌లో ఉన్నంత‌వ‌ర‌కు అధికార పార్టీకి ధీటుగా వ్య‌వ‌హ‌రిస్తూ కౌంట‌ర్లు సంధిస్తున్నారు.

శాస‌న‌స‌భ‌లోనే కాకుండా శాస‌న‌మండ‌లిలో నారా లోకేష్‌, దీప‌క్‌రెడ్డి, ఫ‌రూక్ తదిత‌రులు వివిధ అంశాల‌పై ప్ర‌భుత్వ తీరును తూర్పూర‌బ‌డుతున్నారు. ప్రజా స‌మ‌స్య‌ల విష‌యంలో గ‌ట్టిగా నిల‌దీస్తున్నారు. మ‌రోవైపు అధికార పార్టీ మంత్రులు, నేత‌లు కూడా అంతేస్థాయిలో ధీటుగా స్పందిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌పై అస‌భ్య ప‌ద‌జాలం, దూష‌ణ‌ల‌తో విరుచుకుప‌డుతున్నార‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, మంత్రి మేరుగ నాగార్జున టీడీపీ స‌భ్యుల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ఈ కోవ‌లోకే వ‌స్తాయంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News