బాబు చెప్పేశారు...టీడీపీ జ‌న‌సేన క‌లిసి న‌డ‌వ‌డ‌మే

Update: 2019-11-06 09:26 GMT
``విశాఖలో జనసేన లాంగ్ మార్చ్‌లో టీడీపీ పాల్గొంటే విమర్శిస్తారా?  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం త‌ప్పు అవుతుందా? ఇక నుంచి క్షేత్ర‌స్థాయిలో, ముఖ్య‌మైన అంశాల్లో క‌లిసి వ‌చ్చే అంశాల్లో ఇత‌ర విప‌క్షాల‌తో క‌లిసి ప‌నిచేద్దాం. ప్ర‌భుత్వం తీరును ఎండ‌గ‌డుదాం`` విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకుల శిక్షణ శిబిరంలో టీడీపీ అధినేత‌ చంద్రబాబు చేసిన వ్యాఖ్య‌లివి. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చేసిన ఈ కామెంట్లు..ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు మ‌రోమారు...టీడీపీ-జ‌న‌సేన మ‌ధ్య పొత్తుకు సంకేతాల‌ని అంటున్నారు.

జనసేన ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన లాంగ్‌మార్చ్ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా కలిసి రావాల‌ని...పవన్ క‌ళ్యాణ్ విప‌క్షాల‌న్నింటిని కోర‌గా...మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్టీతో క‌లిసి పోటీ చేసిన వామ‌ప‌క్షాలు మొండి చేయి చూపాయి. బీజేపీ త‌మ‌ది ప్ర‌త్యేక ఆందోళ‌న అని తెలిపింది. కాంగ్రెస్ స్పందించ‌లేదు. కానీ టీడీపీ మాత్రం ముందుండి మ‌ద్ద‌తు ప‌లికింది. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ అచ్చెన్నాయుడు, సీనియ‌ర్ నేత అయిన మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు సంఘీభావం ప‌లికారు. ప‌చ్చ‌పార్టీ తమ్ముళ్లు సైతం పెద్ద సంఖ్య‌లోనే పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ....ఇసుక కొరత సమస్య పరిష్కారానికి రెండు వారాలు గడువు ఇచ్చారు. గడువులోగా సమస్యను పరిష్కరించకపోతే జనసేన శ్రేణులు భవన నిర్మాణ కార్మికులకు అండగా టెంట్లు వేసుకొని కూర్చుంటారని తెలిపారు. అయితే, ప‌వ‌న్ ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆల‌స్యం చంద్ర‌బాబు సైతం ఏపీలో నెలకొన్న ఇసుక కొరత సమస్యపై ఈనెల 14న ఒకరోజు దీక్ష చేయనున్నట్లు ప్ర‌క‌టించారు. ఇసుక అంశం కేంద్రంగా...ఇరు పార్టీల మ‌ధ్య సాగుతున్న ఈ బంధం ఇక్క‌డితో ఆగిపోద‌ని...రాబోయే పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో పొత్తుకు బీజ‌మ‌ని ప‌లువురు అంటున్నారు.

వాస్త‌వంగా...వైసీపీ నేత‌లు ప‌వ‌న్ లాంగ్‌మార్చ్ కేంద్రంగా ఆయ‌న‌కు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. టీడీపీని ప్ర‌స్తావిస్తూ...సూటిగా ప‌లు విష‌యాలు పేర్కొన్న‌ప్ప‌టికీ...ప‌వ‌న్ జ‌వాబు ఇవ్వ‌లేదు. ``గత అయిదేళ్ల పాలనలో ఇసుక దోపిడీతో కోట్లు వెనకేసుకున్న అచ్చెన్నాయుడుని పక్కన పెట్టుకుని ఇసుకపై లాంగ్‌మార్చ్ చేస్తారా? భ‌వ‌న నిర్మాఖ కార్మికుల నిధుల‌ను వారికి ద‌క్కకుండా అచ్చెన్నాయుడు చేసింది నిజం కాదా? ప్రశ్నించడానికే జనసేన పార్టీ పుట్టిందన్న పవన్ ఏనాడైనా చంద్రబాబును కానీ, టీడీపీ ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించారా? లేక తాను పార్టీ పెట్టింది జగన్‌ను ప్రశ్నించడానికేనా?`` అని విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే, ఈ అంశాల‌పై ప‌వ‌న్ నేరుగా స్పందించ‌లేదు.

ఇదే స‌మ‌యంలో... చంద్ర‌బాబు ఐక్య‌తా రాగం జ‌పిస్తున్నారు. క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో స‌ర్కారుపై క‌దం తొక్కుతామ‌ని చెప్తున్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబుతో క‌లిసి వ‌చ్చే పార్టీ జ‌న‌సేన ఒక్కటే అన్న‌ది తెలిసిన సంగ‌తే. కాంగ్రెస్ పార్టీ అడ్ర‌స్ గ‌ల్లంతు అయింది. పైగా బాబు అంటే ఉన్న కొద్దిమంది నేత‌లు పెద్ద‌గా ఆసక్తి చూప‌ట్లేదు. ఇక బీజేపీ పెద్ద‌లు బాబు ప్ర‌స్తావ‌న తెస్తేనే భ‌గ్గుమంటున్నారు. వామ‌ప‌క్షాల సంగ‌తి తెలిసిందే. ఇట్లాంటి ప‌రిస్థితుల్లో బాబుతో క‌లిసి వ‌చ్చేది ఒక్క ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన మాత్ర‌మే అన్న‌ది సుస్ప‌ష్టం. అందుకే...స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జ‌న‌సేన‌-టీడీపీ ద‌గ్గ‌ర‌య్యే ఎత్తుగ‌డ‌కు లాంగ్ మార్చ్ వేదిక‌గా నిలిచింద‌ని అంటున్నారు. `ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త‌, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఓట్లు చీల‌కుండా ఉండే ప్రణాళిక‌` అనే పేరుతో...త్వ‌ర‌లో ఈ రెండు పార్టీలు పొత్తును ప్ర‌క‌టిస్తాయ‌ని...ఇంకొంద‌రు జోస్యం చెప్తున్నారు.
Tags:    

Similar News