ఉత్త‌రాంధ్ర కూడా టీడీపీ వెంట లేదుగా!

Update: 2017-03-23 09:24 GMT
నిన్న‌టితో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏపీలో అధికార పార్టీ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ త‌గులుతూనే ఉంది. నాలుగు కేట‌గిరీల ఎమ్మెల్సీ సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా... స్థానిక సంస్థ‌ల కోటాలో డ‌బ్బు - అధికార బ‌లం ప్ర‌యోగించిన టీడీపీ... ఈ కోటాలో ఎన్నిక‌లు జ‌రిగిన మొత్తం 9 స్థానాల్లో విజ‌యం సాధించింది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ త‌ర్వాత త‌న‌కున్న బ‌లం మేర‌కే విప‌క్ష వైసీపీ బ‌రిలోకి దిగ‌గా... 9 స్థానాల్లో ఆరింటిని ఏక‌గ్రీవంగా చేసుకున్న టీడీపీ, మిగిలిన మూడు చోట్ల గెలిచేందుకు నానా యాగీ చేసేసింది. ప‌చ్చ‌ని కుటుంబాల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు కూడా ఆ పార్టీ నేత‌లు వెనుకాడ‌లేద‌న్న వాద‌న కాస్తంత బ‌లంగానే వినిపిస్తోంది.

ఇక టీచ‌ర్స్‌ - గ్రాడ్యుయేట్స్ స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ గ‌ట్టి ఎదురు దెబ్బే త‌గిలింది. ఈ రెండు కోటాల్లో ఐదు సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా... ఏకంగా నాలుగింటిలో టీడీపీ ఓడిపోగా... ఉత్త‌రాంధ్ర గ్రాడ్యుయేట్స్ సీటును మాత్రం మిత్ర‌ప‌క్ష బీజేపీకి సీటిచ్చి ఎలాగోలా ద‌క్కించుకుంది. రాయ‌ల‌సీమ‌ - కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచినా... ఉత్త‌రాంధ్ర‌లోనైనా గెలిచాములే అన్న భావ‌న‌తో ఆ టీడీపీ కాస్తంత సంతోషించ‌ప‌డింద‌నే చెప్పాలి. ఆ సంతోషం కూడా ఒక్క‌రోజు కూడా నిల‌వ‌లేదన్న స‌రికొత్త వాద‌న తెర‌పైకి వ‌చ్చింది.

ఈ వాద‌న‌ను తెర‌పైకి తీసుకువ‌చ్చిన వారెవ‌రో కాదు... టీడీపీకి ఆది నుంచి ఉత్త‌రాంధ్రలో అండాదండ‌గా నిల‌బ‌డ్డ ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ - ప్ర‌స్తుతం ఏపీ శాస‌న‌మండ‌లిలో స‌భ్యుడిగా (ఎమ్మెల్సీగా) ఉన్న ఎంవీవీఎస్ మూర్తే కావ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. మూర్తి నోట నుంచి వినిపించిన‌ ఆ స‌రికొత్త వాద‌న వివ‌రాల్లోకెళితే... ఉత్త‌రాంధ్ర గ్రాడ్యుయేట్స్ స్థానానికి జ‌రిగిన పోటీలో టీడీపీ త‌న అభ్య‌ర్థిని బ‌రిలోకి దింప‌కుండా... మిత్రప‌క్షం బీజేపీకి అవ‌కాశ‌మిచ్చింది. ఈ క్ర‌మంలో బీజేపీ త‌న అభ్య‌ర్థిగా పీవీఎస్‌ మాధ‌వ్‌ ను రంగంలోకి దింపింది. ఇక ఇక్క‌డ పీడీఎఫ్ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన అజా శ‌ర్మ‌కు వైసీపీ మ‌ద్ద‌తు ఇచ్చింది.

ఎన్నిక‌లు హోరాహోరీగానే సాగాయి. సుదీర్ఘంగా జ‌రిగిన కౌంటింగ్ లో అజా శ‌ర్మ‌పై 9,215 ఓట్ల తేడాతో మాధ‌వ్ విజ‌యం సాధించారు. ఈ విజ‌యంపై బీజేపీలో సంబ‌రాలు చేసుకుంటోంది. అయితే నిన్న వెల‌గ‌పూడిలోని మండ‌లికి వ‌చ్చిన మూర్తి... మాధ‌వ్ గెలుపున‌కు తాము ఎలా క‌ష్ట‌ప‌డ్డామ‌న్న విష‌యాన్ని పూస‌గుచ్చిన‌ట్లు చెప్పుకొచ్చారు. మూర్తి ఏం చెప్పారంటే... *ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఓట్ల‌లో మెజారిటీ శాతం ఒక్క విశాఖ‌లోనే ఉన్నాయి. ఈ ఓట్ల‌ను ఒడిసిప‌ట్టేసినా... మాధ‌వ్ ఈజీగా గెలుస్తారు. ఇదే విష‌యాన్ని పార్టీ నేత‌ల‌కు చెప్పి... న‌గ‌రంలోని వార్డు వార్డుకూ తిరిగి ఓటర్ల‌ను క‌లుసుకున్నాం. న‌గ‌రంలోని ఒక్క ఓటు కూడా విప‌క్ష పార్టీకి చెందిన అభ్య‌ర్థికి వెళ్ల‌కూడ‌ద‌న్నదే మా భావ‌న‌. అంతా కూడ‌బ‌లుక్కుని అదే చేశాం. దీంతో మాధ‌వ్ ఈజీగా గెలిచిపోయారు. అదే స‌మ‌యంలో మిగిలిన ప్రాంతాల్లోనూ బాగానే ప్ర‌చారం చేశాం* అని మూర్తి చెప్పారు.

అంటే.. మూర్తి చెప్పిన దాని ప్ర‌కారం మాధ‌వ్ కు భారీ మెజారిటీనే రావాలి. కానీ కేవ‌లం 9,215 ఓట్ల మెజారిటీతోనే ఆయ‌న విజ‌యం సాధించారు. విశాఖ‌లోని ఏ ఒక్క ఓటు కూడా బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా చేసినా... మాధ‌వ్‌ కు భారీ మెజారిటీనే రావాలి. మ‌రి ప‌శ్చిమ రాయ‌ల‌సీమ‌లో వైసీపీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన గోపాల్ రెడ్డికి వ‌చ్చినంత మెజారిటీ కూడా మాధ‌వ్‌ కు రాలేదు. దీంతో ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖ స‌హా మిగిలిన అన్ని ప్రాంతాల గ్రాడ్యుయేట్స్‌లో చాలా మంది ప‌ట్ట‌భ‌ద్రులు బీజేపీ - టీడీపీ ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన మాధ‌వ్‌ కు ఓటేయ‌కుండా... వైసీపీ బ‌ల‌ప‌ర‌చిన అజా శ‌ర్మ‌కే ఓటేశార‌ని ఇట్టే అర్థం కాక మాన‌దు. అంటే... ఉత్త‌రాంధ్ర‌లోనూ బాబు అండ్ కోకు ఈ ఎన్నిక‌ల్లో ఎదురుగాలి వీచిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News