వైసీపీ నేత‌ల‌తో టీడీపీ రాధా చెట్ట‌ప‌ట్టాల్‌.. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తున్నారు?

Update: 2022-12-26 09:05 GMT
టీడీపీలో ఏం జరుగుతోంది?  నాయ‌కులు ఎవ‌రి మానాన వారు వ్య‌వ‌హ‌రిస్తున్నారా?  మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తున్న‌ట్టు?  ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు రాజ‌కీయంగా టీడీపీని ఇర‌కాటంలోకి నెట్టేస్తున్నాయి. టీడీపీలో ఉన్న వంగ‌వీటి రాధా.. త‌ర‌చుగా.. వైసీపీ నేత‌ల‌తో చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం.. వారితో క‌లిసి విందులు చేసుకోవడం.. వంటివి టీడీపీపై అనేక ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతున్నాయి. మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. చంద్ర‌బాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు?

తాజాగా విజ‌య‌వాడ శివారు ప్రాంతం నున్న‌లో జ‌రిగిన రంగా విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో రాధా పిలిచారో.. లేక వారే వెళ్లారో తెలియ‌దు కానీ.. మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని, ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

అంతేకాదు. ఈ సంద‌ర్భంగా కొడాలి నాని.. టీడీపీని టార్గెట్ చేశారు. టీడీపీ నేత‌లే.. ఆనాడు రంగాను చంపించార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అదేస‌మ‌యంలో రాధాను త‌న వాడిగా పేర్కొన్నాడు.

దీనిని అక్క‌డే ఉన్న రాధా ఖండించ‌లేదు. పైగా.. అంద‌రితోనూ క‌లిసిఆయ‌న స‌భ‌లో పాల్గొన్నారు. మ‌రి ఈ ప‌రిణామాల‌ను ఎలా అర్ధం చేసుకోవాలి?  నిజానికి 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. రాధా త‌న‌కు విజ‌య‌వా డ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఇవ్వ‌ని కార‌ణంగా వైసీపీ నుంచి వ‌చ్చి.. టీడీపీలో చేరారు. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు సీఎం అయ్యేందుకు ఆయ‌న త‌న మాతృమూర్తితో క‌లిసి యాగం కూడా చేశారు.

కానీ, అనూహ్యంగా త‌ర్వాత ప‌రిణామాలు మారిపోయాయి. వైసీపీ నేత‌ల‌తో ఆయ‌న స్నేహం పేరు చెప్పి.. క‌లిసి తిరుగుతున్నారు. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న వైసీపీ లోకి వెళ్లిపోతార‌నే చ‌ర్చ కూడా సాగింది. దీంతో చంద్ర‌బాబు చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఖాయ‌మ‌నే మాట వినిపించింది.

కానీ, చంద్ర‌బాబు మాత్రం ఎక్క‌డా రాధాపై స్పందించ‌లేదు. మ‌రి ఆయ‌న‌ను కెలికితే.. రంగా అభిమానుల‌కుముఖ్యంగా కాపు సామాజిక‌వ‌ర్గానికి కోపం వ‌స్తుంద‌ని అనుకుంటున్నారా?  కీల‌క ఓటు బ్యాంకు దూర‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారా? అనేది సందేహం. ఏదేమైనా.. టీడీపీ ప‌రిస్థితి ఇలా అయితే.. క‌ష్ట‌మనే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News