రాజ్యసభకు ఆ ముగ్గురు

Update: 2016-04-20 06:21 GMT
రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేసే ముగ్గురు పేర్లు దాదాపు ఖరారయినట్లు తెలుగుదేశం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు - నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి - బిజెపి కోటాలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ కు రాజ్యసభ సీటు ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఏపిలో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికల కోసం ఈనెలాఖరులో నోటిఫికేషన్ వెలువడనుంది.  ఇప్పటిక లెక్కల ప్రకారం టిడిపికి 3 - వైసీపీకి 1 స్థానం లభించనుంది.

టిడిపి నుంచి ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు - నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పేర్లు దాదాపు ఖరారయిందని చెబుతున్నారు. అయితే, రామకృష్ణుడు విషయంలో ఇంకా తర్జనభర్జన జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రామకృష్ణుడు ఢిల్లీకి వెళితే శాసనసభ వ్యవహారాలు ఎవరు చూస్తారన్న సందిగ్థం నెలకొంది. జగన్ వంటి బలమైన నాయకుడిని ఎదుర్కోవాలంటే సీనియారిటీ ముఖ్యమని - ప్రస్తుతం అంత అనుభవం ఉన్న నాయకుల సంఖ్య తక్కువేనని గుర్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో యనమల అనుభవమే ప్రభుత్వానికి అక్కర కు వచ్చిందని చెబుతున్నారు. అయితే, తనకు పార్లమెంటుకు వెళ్లాలన్న కోరికను యనమల రెండు మూడేళ్ల క్రితమే బాబు వద్ద వెల్లడించారు. సీఎం రమేష్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసిన సమయంలోనే యనమల తన ఆసక్తిని వెల్లడించారు.  ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న సుజనాచౌదరికి మళ్లీ సీటు ఇవ్వకపోవచ్చంటున్నారు. కాగా, బిజెపి నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ కు సీటు ఇవ్వడం దాదాపు ఖరారయిందని చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో బిజెపి నాయకులతో ఎన్ని విబేధాలున్నప్పటికీ, ఢిల్లీ స్థాయిలో సంబంధాలు సవ్యంగానే ఉన్నందున, ఆమెకు మరోసారి సీటు ఇవ్వాలని బాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Tags:    

Similar News