టీడీపీ స్పీక్స్ : స‌హ‌జ మ‌ర‌ణాలు అస‌హ‌జ అబ‌ద్ధాలు

Update: 2022-03-19 03:10 GMT
రాజ‌కీయంగా రెండు ప్ర‌ధాన పార్టీల యుద్ధానికి అమాయ‌క ప్ర‌జ‌ల ప్రాణాలు పోవ‌డం అన్న‌ది ఓ ఫోక‌స్ పాయింట్ అవుతుందే త‌ప్ప‌! బాధితుల‌కు ద‌క్కే న్యాయం ఏంట‌న్న‌ది నాయ‌కులే చెప్పాలి. డ‌బ్బులిచ్చినంత మాత్రాన ప్రాణాలు రావు. విప‌క్షం త‌ర‌ఫున ఒక్కో బాధిత కుటుంబానికి ల‌క్ష రూపాయ‌లు అంద‌జేసిన టీడీపీ, అదే వేగంతో రాష్ట్ర వ్యాప్తంగా నాటు సారా కు వ్య‌తిరేకంగా ఉద్య‌మించ‌గ‌ల‌దా అన్న ప్ర‌శ్న ఒక‌టి ఇప్పుడు ప‌రిశీల‌కుల నుంచి వినిపిస్తోంది.

రాష్ట్రంలో మ‌ద్య నిషేధం అన్న‌ది సాధ్యం కాని ప‌ని అని తేలిపోయిందా? లేదా ఆదాయ ఆర్జ‌న అన్న‌దే ప్ర‌ధాన ధ్యేయంగా పాల‌క ప‌క్షాలు వీటిపై ప్రేమ‌ను పోగొట్టుకోలేక‌పోతున్నాయా? అంతేకాదు గిరి తండాల్లోనూ నాటు సారా ప్ర‌వాహాల‌ను ఎందుకు క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతోంది? అని ప్ర‌శ్నిస్తోంది టీడీపీ. ఎక్సైజ్ శాఖ‌ను స్పెష‌ల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోగా పేరు మార్చి పోలీసుల విధుల‌ను క‌ఠిన‌త‌రం చేసినా కూడా ఆశించిన ఫ‌లితాలు ఎందుకు రావ‌డం లేదు? అని కూడా ప్ర‌శ్నిస్తోంది.మ‌ద్య నిషేధం చేస్తే సంబంధిత ఆదాయ వ‌న‌రులు ఆగిపోతాయని బెంగ‌తో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఉంద‌ని విమ‌ర్శ‌లు చేస్తోంది.ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప‌రిణామాలు దేశ పార్ల‌మెంట్ దాకా వెళ్లాయి. అయినా కూడా వైసీపీ దిద్దుబాటులో లేద‌ని కూడా స్ప‌ష్టం అవుతోంద‌ని టీడీపీ అంటోంది. ఆ రోజు పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ చెప్పిన మాట‌ల‌కూ ఇప్పుడు చెబుతున్న మాట‌ల‌కూ అస్స‌లు పొంత‌న‌లేద‌ని, న‌వ్వులు రువ్వితే అబ‌ద్ధాలు నిజం కావ‌ని అంటోంది.

ఇవ‌న్నీ ఎలా ఉన్నా కూడా చాలా ప్రాంతాల‌లో న‌మోదు కాని మ‌ర‌ణాలు కూడా ఉన్నాయ‌ని తెలుస్తోంది.కొన్ని చోట్ల వైద్యుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా కూడా మ‌ర‌ణాలు  న‌మోదు అవుతున్నాయి.ఇవ‌న్నీ చీప్ లిక్క‌ర్ కార‌ణంగానే సంభవిస్తున్నాయి. ఏద‌యినా ఘ‌ట‌న జ‌రిగితే వెంట‌నే రంగంలోకి దిగి హ‌డావుడి చేసి నాలుగు సారా బ‌ట్టీలు ప‌గుల‌గొట్టి త‌రువాత పోలీసులు వీటి సంగ‌తిని మ‌రిచిపోవ‌డం వ‌ల్ల‌నే ఇటువంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయ‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. ఇవే ఇప్పుడు విలువైన ప్రాణాలు గాల్లో క‌లిసి పోయేందుకు కార‌ణం అవుతున్నాయి. అంటే పోలీసుల నిర్లక్ష్యంతో పాటు వైద్యుల నిర్ల‌క్ష్యం కూడా ఇవాళ అమాయ‌క ప్ర‌జ‌ల ప్రాణాలు పోయేందుకు దోహ‌దం అవుతోంది అన్న‌ది సుస్ప‌ష్టం.

ఈ ద‌శ‌లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా,జంగారెడ్డి గూడెంలో నాటుసారా తాగి 18మందికి పైగా మ‌ర‌ణించిన ఉదంతం రాజ‌కీయంగా ప్ర‌కంప‌నాల సృష్టిస్తోంది.వీటిపై అధికార ప‌క్షం చెప్పే ఏ మాట‌నూ అంగీక‌రించ‌లేని స్థితిలో టీడీపీ ఉంది.ముందుగా వీటి గురించి న్యాయ విచార‌ణ చేపట్టి ఆ త‌రువాతే మాట్లాడాల‌ని టీడీపీ అంటోంది.ఎన్న‌డూ లేనిది ఇవ‌న్నీ స‌హ‌జ మ‌ర‌ణాలు అని ఓ సీఎం స్థాయి వ్య‌క్తి ఎలా స్టేట్మెంట్ ఇస్తారు అని, అసెంబ్లీ సాక్షిగా  అబ‌ద్ధాలు చెబితే అవి నిజాలు అయిపోవ‌ని కూడా అంటోంది.దీంతో వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది.

జ‌గన్ చెప్పిన‌వ‌న్నీ తాము న‌మ్మ బోమ‌ని, క‌ల్తీ సారా అమ్మ‌కాల‌కు ప్ర‌ధాన కార‌ణం రాష్ట్రంలో కొన్ని మ‌ద్యం బ్రాండ్ల ధ‌ర‌లు విప‌రీతంగా పెంచ‌డం వ‌ల్ల‌నే, వేరే దారి లేక క‌ల్తీ సారా వైపు మందుబాబులు మొగ్గు చూపుతున్నార‌ని,అయినా మ‌ద్య నిషేధం చేస్తామ‌ని చెప్పి ఆ విష‌య‌మే మ‌ర్చిపోవ‌డం విడ్డూరం అని అంటోంది టీడీపీ.

త‌మ హ‌యాంలో మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా 2016 -17లో నాలుగు వేల కోట్ల‌కు పైగా ఖ‌జానాకు ఆదాయం వ‌స్తే ప్ర‌స్తుత ప్ర‌భుత్వ హ‌యాంలో 2021 -22 లో 14 వేల కోట్ల‌కు పైగా ఆదాయం వ‌చ్చింద‌ని గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రిస్తున్నారు.మ‌ద్యపాన నిషేధం అన్న‌ది అమ‌లు చేస్తే ఆదాయం త‌గ్గాలి క‌దా మ‌రేంటి ఈ విధంగా పెరిగిపోయింది అని టీడీపీ వైసీపీని నిలదీస్తోంది.
Tags:    

Similar News