డిజిట‌ల్ మీడియా ప్ర‌భావం పై టీడీపీ వ్యూహం.. స‌క్సెస్ రేటెంత‌?

Update: 2021-07-22 02:30 GMT
రాజ‌కీయాల్లో వ్యూహాలు మారుతూ ఉంటాయి. అయితే.. అవి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. క‌నీసం 50 శాతం మంది ప్ర‌జ‌ల‌నైనా.. స‌ద‌రు వ్యూహాలు చేరుకోవాలి. లేక‌పోతే.. వ్యూహాలు బెడిసికొట్టే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. మ‌రి ఈ విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కానీ, ఆయ‌న కుమారుడు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. లోకేష్‌లు పెద్ద‌గా దృష్టి పెడుతున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.

ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కుల్లో డిజిట‌ల్ లిట‌రీ 5% మించ‌ద‌ని అంద‌రికీ తెలిసిందే. చాలా మందికి వాట్సాప్ ఆప‌రేష‌న్ ఒక్క‌టే తెలిసిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు డిజిట‌ల్ మాధ్య‌మాన్ని ఎంచుకోవ‌డం.. టీడీపీకే చెల్లిందా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

ఏపీ టీడీపీలో ఒక‌విధ‌మైన నైరాశ్యం వెంటాడుతోంది. నాయ‌కులు ఎవ‌రికివారుగా ఉన్నారు. వీరిని స‌రిచేయ‌డంతోపాటు.. పార్టీలో ఊపు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అయితే.. దీనిపై కొన్నాళ్లు దృష్టి పెట్టిన చంద్ర‌బాబు.. త‌ర్వాత‌.. మ‌ళ్లీ మౌనం పాటించారు. పార్టీ దానంత‌ట అదే పుంజుకుంటుంద‌ని అనుకున్నారు. కానీ, ప‌రిస్థితి అలా క‌నిపించ‌డం లేదు. ఎవ‌రికివారు మాకేంటి? అనే ధోర‌ణిలోనే ఉన్నారు.

ఎవ‌రూ కూడా పార్టీని ఓన్ చేసుకుని ముందుకు నడిపించాల‌నే వ్యూహంతో ముందుకు సాగుతున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో పార్టీలో స‌మూల మార్పులైనా తీసుకురావాలి.. లేదా.. అధిష్టాన‌మైనా.. చ‌ర్య‌లు తీసుకోవాలి.

ఈ రెండు విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టి.. డిజిట‌ల్ టీడీపీకి ప్రాధాన్యం క‌ల్పించారు. మొత్తం 25 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ డిజిట‌ల్ టీడీపీకి నాయ‌కుల‌ను నియ‌మించారు. పోనీ.. ఇది కూడా మంచిదే అనుకున్నా.. అస‌లు రాష్ట్రంలో డిజిట‌ల్ మాధ్య‌మాన్ని వాడుతున్న‌వారు ఎంద‌రు?  ఏయే వ‌ర్గాలు డిజిట‌ల్ వైపుఉన్నారు?  వారంతా ఎన్నిక‌ల స‌మ‌యంలో క్యూలో నిల‌బ‌డి ఓట్లు వేస్తున్నారా? అనే ప్ర‌శ్న‌లను ప‌రిశీలిస్తే.. లేద‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది.

ఎందుకంటే.. రాష్ట్రంలోని మొత్తం జ‌నాభా 5 కోట్లు అనుకుంటే..కేవ‌లం కోటి మందికి లోపే డిజిట‌ల్ మీడియాతో అనుబంధం ఉంది. అది కూడా ఫేస్‌బుక్‌,యూట్యూబ్ త‌దిత‌ర అంశాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు.

ఒక‌వేళ‌.. మిగిలిన మాధ్య‌మాల‌ను కూడా అడాప్ట్ చేసుకున్నార‌ని అనుకున్నా.. డిజిట‌ల్ మాధ్య‌మంలో జ‌రిగే డిబేట్ల‌ను, ప్ర‌క‌ట‌న‌ల‌ను ప‌ట్టించుకునేవారు 15 % మించి ఉండ‌ర‌నేది అంద‌రికీ తెలిసిందే. ఇక‌, వీరిలోనూ ఎన్నిక‌ల స‌మ‌యంలో బూత్ కు వ‌చ్చి ఓట్లేసేవారు.. పార్టీ స‌భ్య‌త్వాలు తీసుకునేవారు 5% మించి ఉండ‌రు.

మ‌రి ఇంతగా డిజిట‌ల్ మాధ్య‌మానికి వ్య‌తిరేక‌త‌లు ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు కానీ,, ఆయ‌న కుమారుడు కానీ.. దీనిని న‌మ్ముకుని ముందుకు సాగుతామ‌ని చెప్ప‌డం.. ఆదిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం వంటివి పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాల‌నుకుంటున్నార‌నే వ్యాఖ్య‌ల‌కు ఆస్కారం ఇస్తోంది.
Tags:    

Similar News