ఆ ఎమ్మెల్యేపైనే టీడీపీ అనుమానం?

Update: 2022-06-04 12:30 GMT
ఆంధ్రావ‌ని వాకిట వ‌రుస రాజ‌కీయ హ‌త్య‌లు సంచ‌ల‌నం రేకెత్తిస్తున్నాయి. గ‌తం క‌న్నా భిన్నంగా శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పి ఉన్నాయి. ఉమ్మ‌డి గుంటూరు జిల్లా లో నిన్న‌టివేళ చోటుచేసుకున్న హ‌త్యోదంతం ప‌లు అనుమానాలకు తావిస్తోంది. హ‌త్య జ‌రిగాక సంబంధిత ఘ‌ట‌న‌ను ప్ర‌మాదంగా మార్చేందుకే అధికార పార్టీ స‌భ్యులు విప‌రీత‌మ‌యిన ప్రాధాన్యం ఇచ్చార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తాజాగా చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం  ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణా రెడ్డి త‌క్ష‌ణ స్పంద‌న కోసం బాధిత వ‌ర్గం ఎదురు చూస్తోంది. టీడీపీ మాత్రం నిందితుల‌ను అరెస్టు చేసి, క‌ఠిన శిక్ష‌లు విధించాల‌ని ప‌ట్టుబడుతోంది.

హ‌త్యా రాజకీయాలు ఆగ‌వా ?

ఎప్ప‌టి నుంచో అశాంతికి ఆన‌వాలుగా నిలుస్తున్న ప‌ల్నాడులో హ‌త్యా రాజ‌కీయాలు అయితే ఆగ‌డం లేదు. పాత క‌క్ష‌ల నేప‌థ్యంలో జ‌రుగుతున్న యుద్ధానికి ముగింపే లేకుండా పోతోంది. పేద కుటుంబాలు, కాస్తో కూస్తో బ‌తికేందుకు, పొట్ట నింపుకునేందుకు వివిధ మార్గాల్లో క‌ష్ట‌ప‌డి నాలుగు రూపాయ‌లు సంపాదించుకుని, పార్టీల వెంట న‌డిచే కార్య‌క‌ర్త‌లు వ‌రుస ఘ‌ట‌న‌ల‌కు బ‌లైపోతున్నారు.

ఈ నేప‌థ్యంలో బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వం నుంచి ఏ మాత్రం భ‌రోసా అంద‌డం లేదు. క‌నీస సాయం కోసం ప‌ట్టుబ‌ట్టినా ఫ‌లితం లేకుండా పోతోంది. వైసీపీ స‌ర్కారు కేవ‌లం త‌మ‌ను అడ్డుకునేందుకు మాత్రం తెగ ప్రాధాన్యం ఇస్తోంద‌ని కొల్లు ర‌వీంద్ర వాపోతున్నారు.

ఇవాళ  బాధిత కుటుంబం (బీసీ లీడ‌ర్ జ‌ల్ల‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు  బ‌య‌లుదేరిన కొల్లు ర‌వీంద్ర)ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్తున్న ర‌వీంద్ర‌ను పోలీసులు అడ్డుకుని, శాంతి భ‌ద్ర‌త‌ల కార‌ణంగా మృతదేహాన్ని చూసేందుకు  కానీ బాధిత కుటుంబాన్ని క‌లిసి మాట్లాడేందుకు కానీ అస్స‌లు అనుమ‌తి ఇవ్వ‌లేదు.

ఈ నేప‌థ్యంలో టీడీపీ ఏం అంటుంది అంటే..

"హంతకుల తరపు నిలిచిన పోలీసుల దౌర్జన్యం ఇది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల చేతిలో హతమైన తెలుగుదేశం కార్యకర్త జల్లయ్య కుటుంబసభ్యులను సంప్రదించకుండానే పోలీసులు పోస్టుమార్టం చేయించేశారు. బంధువులు మార్చురీ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. తెలుగుదేశం నేతలు వచ్చేంత వరకు పోస్టుమార్టం చేయొద్దని వేడుకున్నా లెక్కచేయని పోలీసులు హడావిడిగా జల్లయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేసేసి, మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పకుండా నరసరావు పేట ఏరియా వైద్యశాల నుంచి బొల్లాపల్లి మండలం రావులాపురంకు తరలించేశారు.." అని చెబుతోంది టీడీపీ.
Tags:    

Similar News