బాబు నిర్ణ‌యంపై విస్మ‌యం.. స‌రికాదంటున్న సీనియ‌ర్లు!

Update: 2021-04-03 04:13 GMT
ఏపీలో ప‌రిష‌త్ ఎన్నిక‌ల వ్య‌వ‌హారం మ‌రో రాజ‌కీయ వివాదానికి తెర‌దీసింది. ప్ర‌స్తుతం ఈ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్న‌ట్టు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యాన్ని నేరుగా పార్టీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంద‌ని అనుకున్నా.. ఈ నిర్ణ‌యంపై కొన్నాళ్లుగా లీకులు ఇవ్వ‌డం.. ఇప్పుడు నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డం మాత్రం సీనియ‌ర్లు త‌ప్పు ప‌డుతున్నారు. ఇప్ప‌టికిప్పుడు తీసుకున్న నిర్ణ‌యం కాక‌పోవ‌డంతో పార్టీపై ఒక‌విధమైన అభిప్రాయం ప్ర‌జ‌ల్లోకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు. `మంచి నిర్ణ‌య‌మా?  కాదా.. అన్న‌ది ప‌క్క‌న పెడితే.. నిర్ణ‌యం తీసుకునే విష‌యాన్ని అస‌లు ఎన్నిక‌లపై ఒక ప్ర‌క‌ట‌న రాక‌ముందు నుంచే లీకులు ఇవ్వ‌డం అవ‌స‌ర‌మా?` అనేది సీనియ‌ర్ల మాట‌.

ప‌రిష‌త్ ఎన్నిక‌ల విష‌యంలో.. బ‌ల‌వంతపు ఏక‌గ్రీవాలు జ‌రిగాయ‌నేది టీడీపీ ఆరోప‌ణ‌. అయితే.. ఇప్ప‌టికే హైకోర్టు.. ఏక‌గ్రీవాల‌పై విచార‌ణ జ‌రిపి.. వాటిని ప్ర‌క‌టించాల‌ని కూడా సూచించింది. ఈ నేప‌థ్యంలో న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు తొలిగిపోయాయ‌ని ప్ర‌స్తుతం ఎస్ ఈసీ నీలం సాహ్నీ ప్ర‌క‌టించారు. ఈ క్ర‌తువు ముగిసిన త‌ర్వాతే.. తాము ఎన్నిక‌ల విష‌యాన్ని ప్ర‌క‌టించామ‌ని.. 8న ఎన్నిక‌లు 10న రిజ‌ల్ట్ ఖాయ‌మ‌ని అంటున్నారు. అయితే.. చంద్ర‌బాబు మాత్రం ఏక‌గ్రీవాల‌పై విచార‌ణ లేకుండానే ఇలా ప్ర‌క‌టిస్తారా? అనేది ఆగ్ర‌హం. ఇక‌, తాజాగా సాహ్ని నిర్వ‌హించిన అఖిల పక్ష స‌మావేశానికి టీడీపీ నేత‌లు వెళ్ల‌లేదు. ఇది కూడా చెడు సంప్ర‌దాయ‌మే అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఏదైనా స‌మ‌స్య ఉంటే.. అక్క‌డ చెప్పుకొనేందుకు అవ‌కాశం ఉంటుంది. అక్క‌డ నిర‌స‌న వ్య‌క్తం చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ, ఏకంగా స‌మావేశాన్ని బాయ్ కాట్ చేయ‌డం.. ఇప్పుడు ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించ‌డం వంటివి పార్టీకి మంచి ప‌రిణామాలు కాద‌ని అంటున్నారు. పార్టీ బ‌లోపేతం చేయాల‌ని అనుకున్న‌ప్పుడు.. చంద్ర‌బాబు త‌న వాద‌న‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేం దుకు ఇది చ‌క్క‌ని అవ‌కాశ‌మ‌ని.. లేక‌పోతే.. సరైస సంకేతాలు వెళ్లే అవ‌కాశం లేకుండా పోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఇప్ప‌టికే నామినేష‌న్ల వ‌ర‌కు వ‌చ్చిన అభ్య‌ర్థులు కూడా డీలా ప‌డి.. పార్టీలో నైరాశ్యం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. నిర్ణ‌యం అంద‌రికీ సానుకూలంగా ఉండేలా ఉండాలి త‌ప్ప‌.. ఏక‌ప‌క్షంగా.. తీసుకోవ‌డం.. అందునా.. ముందే నిర్ణ‌యించుకుని.. ఇప్పుడు ప్ర‌క‌టించ‌డం వంటివి చంద్ర‌బాబు సీనియార్టీకి స‌రికాద‌నేది సీనియ‌ర్లు సైతం చెబుతున్న మాట‌.

జ్యోతుల రాజీనామా..
పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఏపీ ఉపాధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాజీనామా చేశారు.  టీడీపీ అధిష్టానం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించడం నిరాశ కలిగించిందని చెప్పారు. అయితే రాష్ట్ర  ఉపాధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశానని తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా మాత్రమే కొనసాగుతానని ప్రకటించారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని జ్యోతుల నెహ్రూ భరోసా ఇచ్చారు.
Tags:    

Similar News