పవన్ ను రప్పిస్తే తప్ప దిక్కులేదు!

Update: 2017-08-04 18:21 GMT
నంద్యాలలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రకరకాలుగా మల్లగుల్లాలు పడుతోంది. జగన్ మోహన్ రెడ్డి సభ అనూహ్యమైన రీతిలో సక్సెస్ కావడం, భారీ సంఖ్యలో జనసందోహం హాజరు కావడం వారిని బెంబేలెత్తిస్తోంది. ఆ సభ తలదన్నేలా ఏదో ఒకటి చేస్తే తప్ప.. తాము సేఫ్ పొజిషన్ లో ఉన్నట్లు కాదనే అభిప్రాయం తెలుగుదేశం సీనియర్లలో వ్యక్తం అవుతోంది. చంద్రబాబు  సభ ఆల్రెడీ నిర్వహించేశారు కనుక.. కనీసం ఇప్పుడు ఏదో ఒకలా కష్టపడి పవన్ కల్యాణ్ ను ప్రచారానికి తీసుకు వచ్చి సభ నిర్వహిస్తే తమకు మైలేజీ పెరుగుతుందని ఆశిస్తున్నారు. అయితే అది అంత ఈజీనా అనే భయం కూడా వారిలో ఉంది.

పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా భూమా నాగిరెడ్డికి మంచి స్నేహితుడు. భామా నాగిరెడ్డి ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటినుంచే పవన్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే వాటిని గుర్తుచేసి.. ఆయన మరణం నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలో ఓటమి పాలవకుండా కాపాడడానికి రంగంలోకి రావాలని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ రూపంలో ఒప్పించాలని తెదేపా నాయకుల్లో కొందరు అనుకుంటున్నట్లు సమాచారం.

ఇందుకోసం పవన్ ను ఆహ్వానించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఏపీ కేబినెట్ లో పవన్ కు సన్నిహితులు అయిన కొందరు మంత్రుల్ని ఆశ్రయించి.. వారిద్వారా పవన్ ను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఒకవైపు తన పార్టీని కూడా ప్రకటించి.. తన సొంత పార్టీ తరఫున వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ.. ఉన్న పవన్ తెదేపా తరఫున ప్రచారానికి వస్తారా అనేది అనుమానం. ఎందుకంటే.. గత ఎన్నికల సమయంలో ఆ రెండు పార్టీలు గెలిస్తే ప్రజలకు మంచిది అనే ఉద్దేశంతో వారికి అనుకూలంగా ప్రచారం చేశానే తప్ప.. నేను వారి కూటమిలోని వ్యక్తిని కాను అని పవన్ పలు సందర్భాల్లో కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. మరి అలాంటప్పుడు తెలుగుదేశం కోసం ఇప్పుడు ప్రచారం చేస్తే.. జనంలో పలుచన అయిపోతారనే అభిప్రాయం పవన్ అభిమానుల్లో ఉంది. తెలుగుదేశం మాత్రం తమకు గత్యంతరం లేదని భావిస్తోంది.

పవన్ ను ఇందుకోసం సంప్రదించినప్పుడు ఎటూ తేల్చలేదని సమాచారం. అయితే మంత్రలు ద్వారా లాబీయింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పవన్ వచ్చి సభ నిర్వహించలేని పక్షంలో కనీసం ప్రెస్ నోట్ ఇవ్వడం ద్వారా

అయినా, ట్వీట్ ల ద్వారా అయినా తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి  ఓటు వేయాల్సిందిగా నంద్యాల ప్రజలకు పిలుపు ఇస్తే దానిని తమకు అనుకూలంగా ఎంత ఎక్కువ ప్రచారం చేసుకోవాలో తాము చేసుకోగలమని వారు భావిస్తున్నారట. అయితే కనీసం ట్వీట్లు ఇవ్వడానికి కూడా పవన్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని అనుకుంటున్నారుట.
Tags:    

Similar News