అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్

Update: 2022-03-07 08:35 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తుండగా...టీడీపీ సభ్యులు గవర్నర్, వైసీపీ సభ్యులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లను కాపాడ‌లేని గ‌వ‌ర్న‌ర్ గో బ్యాక్ అంటూ టీడీపీ స‌భ్యులు నినాదాలు చేశారు. తమ చేతిలో ఉన్న బ‌డ్జెట్ ప్ర‌తులను చించేసి నిరసన వ్యక్తం చేశారు. అయితే, ఈ గంద‌ర‌గోళం మ‌ధ్యే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం కొనసాగింది.

ఆ తర్వాత గవర్నర్ వెళ్లే దారిలో టీడీపీ సభ్యులు నిరసన తెలిపే ప్రయత్నం చేయగా మార్షల్స్ అడ్డుకున్నారు. ఆ పరిణామంతో అసెంబ్లీ లాబీలో టీడీపీ సభ్యులు బైఠాయించి ఆందోళనకు దిగారు. మరోవైపు, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశఆరు. గత మూడేళ్లుగా సభలో తమను, తమ అధినేత చంద్రబాబును, ఆయన కుటుంబసభ్యులను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు.

టీడీపీ సభ్యులకు మైక్ ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్లబోమని అన్నారు. స్పీకర్ తమ్మినేని హుందాగా ప్రవర్తించాలని, అసెంబ్లీని కౌరవసభగా మార్చారని విమర్శలు గుప్పించారు.

అంతకుముందు, అసెంబ్లీకి బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. సీఎం, మంత్రుల మూమెంట్ ఉందంటూ వారిని మందడం చెక్ పోస్ట్ దగ్గర  పోలీసులు నిలిపివేశారు. దీంతో, పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే పోలీసులతో టీడీపీ నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఆ ఆందోళనతో టీడీపీ నేతలకు పోలీసులు దారి వదిలారు.
Tags:    

Similar News