టీమిండియాకు కెప్టెన్లే కెప్టెన్లు.. నెలల వ్యవధిలో ఏడుగురు

Update: 2022-07-09 15:30 GMT
టీమిండియా టెస్టు, వన్డే, టి20 కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ, వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ కెప్టెన్. ఇంగ్లండ్ తో ఇటీవలి ఐదో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా సారథి. అంతకుముందు దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ కు రిషభ్ పంత్ నాయకత్వం.. ఈ ఏడాది ప్రారంభంలో అన్ని ఫార్మాట్లకు స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి కెప్టెన్సీ. మధ్యలో కొన్ని మ్యాచ్ లకు ఓపెనర్ కేఎల్ రాహుల్ సారథ్యం.. ఐర్లాండ్ తో టి20 సిరీస్ కు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు.. మళ్లీ ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్. అంటే.. ఆరు నెలల్లో ఏడుసార్లు సారథ్యం మారింది. ఇందులో ఆశ్చర్యమేమీ లేకున్నా.. కొంత అనూహ్యమే.

గంగూలీతోనే అంతం.. గంగూలీ మార్గదర్శకంలో మొదలు

అసలు భారత క్రికెట్ లో సౌరభ్ గంగూలీ శకం ప్రారంభమయ్యాక కెప్టెన్సీ అనిశ్చితికి తెరపడింది. అంతకుముందు హైదరాబాదీ సొగసరి బ్యాట్స్ మన్ అజహరుద్దీన్ సైతం సుదీర్ఘ కాలం సారథిగా వ్యవహరించినా.. అతడు ఫామ్ కోల్పోయాక సచిన్ టెండూల్కర్ బాధ్యతలు దక్కాయి. సచిన్ స్వభావం రీత్యా కెప్టెన్సీ బాధ్యతలకు న్యాయం చేయలేకపోయాడు. ఇక గంగూలీ రాకతో ఐదారేళ్లు కెప్టెన్సీ మరొకరి చేతికి వెళ్లిందే లేదు.

అయితే, గంగూలీ ఫామ్ కోల్పోవడంతో రాహుల్ ద్రవిడ్ కు బాధ్యతలు దక్కాయి. కానీ, ద్రవిడ్ సైతం సచిన్ లా సాదు స్వభావి కావడంతో జట్టుపై పట్టు తెచ్చుకోలేకపోయాడు. దీంతో మళ్లీ సంక్షోభం. కానీ, అప్పటికి మహేంద్ర సింగ్ ధోనీ రూపంలో సుస్థిరమైన సారథి దక్కడం ఓ పదేళ్లు కెప్టెన్సీ గురించి ఆలోచించాల్సిన పనే లేకపోయింది.

కోహ్లి ఓ ఐదేళ్లు ఏలినా..

2014 చివరిలో టెస్టు కెప్టెన్సీ, 2016 నుంచి వన్డే, టి20 సారథ్యం దక్కిన విరాట్ కోహ్లి 2021 వరకు జట్టును అద్భుతంగా నడిపించాడు. అయితే, కోహ్లి అంతగా ఫామ్ కోల్పోకున్నా.. సెంచరీ మాత్రం కొట్టలేకపోతున్నాడు. దీంతోపాటు బీసీసీఐతో తలెత్తిన విభేదాలతో తొలుత పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి, తర్వాత టెస్టు కెప్టెన్సీకీ రాంరాం పలికాడు. దీంతో రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత రోహిత్ గాయాలు, కొవిడ్ బారినపడడం, ప్రత్యమ్నాయంగా మరో జట్టు రూపుదిద్దుకుని.. ఒకే సమయంలో రెండు సిరీస్ లు ఆడాల్సి వస్తుండడంతో ఇద్దరు కెప్టెన్లు తెరమీదకు వచ్చారు. వీటన్నిటిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పందించాడు. తన 50వ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆ విశేషాలు పంచుకున్నాడు.

కెప్టెన్లే కాదు.. కోచ్ లూ మారారు

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. అయితే, అతడు ఇంగ్లండ్ తో ఐదో టెస్టుతో బిజీగా ఉండడంతో ఐర్లాండ్ తో సిరీస్ కు హైదరాబాదీ సొగసరి బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా వెళ్లాడు. అంటే.. ఇద్దరు కోచ్ లు అన్నమాట. కాగా, జట్లకు కెప్టెన్లు మారిన ప్రతిసారీ ఇది జరగలేదు. ఎక్కువ సిరీస్ లకు ద్రవిడే కోచ్ గా ఉన్నాడు. మరోవైపు కెప్టెన్లతో సమన్వయం చేసుకోవడం ద్రవిడ్ కు కొంత సమస్యనే. విశేష అనుభవం ఉన్న ద్రవిడ్ కు దీనిని అధిగమించడం పెద్ద విషయమేం కాదు. ఇదే అంశంపై గంగూలీ మాట్లాడుతూ.. 'ఇంత స్వల్ప కాలంలో ఏడుగురు కెప్టెన్లు మారడం అనేది నిజంగా మంచిది కాదు. ఈ విషయాన్ని నేను కూడా అంగీకరిస్తా. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో అలా జరిగిపోయింది.

గతేడాది చివర్లో దక్షిణాఫ్రికా పర్యటనలో రోహిత్‌ టీమ్‌ఇండియాను నడిపించాల్సింది. కానీ, సరిగ్గా టోర్నీ ప్రారంభానికి ముందు అతడు గాయపడ్డాడు. దాంతో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ చేశాడు. ఇక దక్షిణాఫ్రికా ఇటీవల భారత్‌కు వచ్చినప్పుడు కేఎల్ రాహుల్‌ గాయపడ్డాడు. దాంతో పంత్‌కు కెప్టెన్సీ వచ్చింది. అలాగే ఇంగ్లాండ్‌ పర్యటనలో టీమ్‌ఇండియా వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతుంటే రోహిత్‌ కరోనా బారినపడ్డాడు. ఇందులో ఎవరి తప్పూ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వడం, మధ్యలో గాయాలు, ఆటగాళ్ల పనిభారం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నడిపించాల్సి ఉంది. ఈ విషయంలో హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను చూసి జాలిపడాలి'అని గంగూలీ వివరించాడు.
Tags:    

Similar News