టీమిండియాలో ఒకే మ్యాచ్ లో ఏడుగురు 'ఎస్'లు.. అత్యంత అరుదే

Update: 2022-07-23 10:30 GMT
టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ లో పర్యటిస్తోంది.. వచ్చే 20 రోజుల్లో మూడు వన్డేలు, ఐదు టి20లు ఆడనుంది. వన్డేలకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి తొలి వన్డే జరిగింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్, పేసు గుర్ర జస్ప్ర్రీత్ బుమ్రా, ప్రధాన పేసర్లు మొహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ తదితరులు దూరంగా ఉన్నారు. ఈ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా నియమితుడైన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం తొలి వన్డేకు అందుబాటులో లేడు. కాగా, శుక్రవారం రాత్రి వన్డేలో వెస్టిండీస్ పై భారత్ 3 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది.

కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (97; 99 బంతుల్లో 10x4, 3x6) రాణించాడు. శతకం ముంగిట మోటీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే, యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ (64), శ్రేయస్‌ అయ్యర్‌ (54) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో దీపక్‌ హుడా (27), అక్షర్‌ పటేల్‌ (21) తమవంతు పరుగులు చేశారు. ఛేదనలో విండీస్‌ గొప్పగా పోరాడినా చివరికి 305/6తో నిలిచి 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా, త్రుటిలో సెంచరీ కోల్పోవడం బాధ కలిగించినా టీమ్‌ఇండియా బాగా ఆడిందని తాత్కాలిక కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ అన్నాడు. జట్టు బాగా ఆడిందని మెచ్చుకున్నాడు.

ఒకేసారి ఇంతమందా..?

ఈ మ్యాచ్ లో టీమిండియా తుది జట్టును చూస్తే ఆశ్చర్యమేసింది. అయితే, ఇది జాగ్రత్తగా పరిశీలించేవారికి మాత్రమే తెలుస్తుంది. అందులోనూ క్రికెట్ పరిజ్హానం బాగా ఉన్నవారికే అంత తొందరగా అర్థమవుతుంది. ఇక విషయానికి వస్తే.. తుది జట్టులో ఏడుగురు ''ఎస్''అక్షరంతో ప్రారంభమయ్యే ఆటగాళ్లు ఏడుగురు ఉండడం విశేషం. బహుశా ఇది అత్యంత అరుదు. మరే జట్టులోనూ ఇలా జరిగి ఉండకపోవచ్చు. తుది జట్టును పరిశీలిస్తే.. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్, వన్ డౌన్ లో శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో నంబరు ఆటగాడిగా వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఉన్నారు.

ఇక బౌలర్లలో సిరాజ్, శార్దూల్ పేసర్లుగా సేవలందించారు. వీరందరి పేర్లూ ఎస్ అక్షరంతోనే ప్రారంభం కావడం గమనార్హం. అయితే, మామూలుగా మనం వీరి పేర్లలోని చివరి పదంతో ఎక్కువగా పిలుస్తుంటాం. ఉదాహరణకు ధావన్, గిల్, అయ్యర్.. ఇలా. కానీ, వారి అసలు పేర్లు శిఖర్, శుభ్ మన్, శ్రేయస్. దక్షిణ భారత దేశంలో ఇంటిపేరును అసలు పేరుకు ముందుపెట్టుకుంటారు. ఉత్తరాదిలో ఇంటిపేరును చివరన పెట్టుకుంటారు. దీంతో ఆ పేర్లతోనే మనకు పిలిచే అలవాటు వచ్చింది.

గెలిపించినదీ.. ''ఎస్'' అక్షరం వారే.. హైదరాబాదీ సిరాజ్ కీలకం

వెస్టిండీస్ తో శుక్రవారం నాటి మ్యాచ్ ను గెలిపించడంలో శిఖర్, శ్రేయస్, శుభ్ మన్, సిరాజ్, శార్దూల్ కీలక పాత్ర పోషించారు. శిఖర్, శ్రేయస్, శుభ్ మన్ లు అర్థ సెంచరీలు చేయగా, బౌలింగ్ లో సిరాజ్, శార్దూల్ రెండేసి వికెట్లు తీసి కీలకపాత్ర పోషించారు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా.. హైదరాబాదీ పేసర్ సిరాజ్ అద్భుతంగా బంతులేసి 10 పరుగులే ఇచ్చాడు. ఇక. మ్యాచ్ అనంతరం ధావన్ మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లు బాగా ఆడారని, దాంతో విండీస్‌ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగామని చెప్పాడు. అయితే, ఛేదనలో విండీస్‌ గెలిచేంత పని చేయడంతో తాము ఉత్కంఠకు లోనయ్యామని పేర్కొన్నాడు. మ్యాచ్‌ అలాంటి స్థితికి చేరుతుందని ఊహించలేదన్నాడు.

మ్యాచ్‌ ఉత్కంఠకు దారితీసిన ఆఖరి క్షణాల్లో తాము ప్రశాంతంగా ఉన్నామని, ఆ సమయంలో చేసిన ఒక చిన్న మార్పు టీమ్‌ఇండియాకు ఉపయోగపడిందని ధావన్‌ తెలిపాడు. ఈ మ్యాచ్‌ నుంచి పలు విషయాలు నేర్చుకున్నామని, దాంతో మున్ముందు జరిగే మ్యాచ్‌ల్లో మరింత బాగా రాణించేందుకు కృషి చేస్తామని వివరించాడు. వెస్టిండీస్‌ సారథి నికోలస్‌ పూరన్‌ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో తాము విజయం సాధించినట్లుగా అనిపించిందని చెప్పాడు.

విజయపుటంచుల దాకా వెళ్లి 3 పరుగులతో ఓటమి పాలవ్వడం జీర్ణించుకోవడం కాస్త కష్టంగా ఉందన్నాడు. తాము అనుకున్నట్లుగా 50 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయడం శుభపరిణామం అని పేర్కొన్నాడు. దీంతో తాము ఎలా ఆడగలమో అందరికీ తెలిసొచ్చేలా చేశామన్నాడు. ఈ ఓటమి నుంచి నేర్చుకుంటామని, మిగతా మ్యాచ్‌లకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పూరన్‌ చెప్పుకొచ్చాడు. ఇది బ్యాటింగ్‌ పిచ్చే అయినా ఆఖర్లో తమ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌ను బాగా కట్టడి చేశారన్నాడు. ఏదేమైనా ఈ మ్యాచ్‌లోని సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్తామని పేర్కొన్నాడు.
Tags:    

Similar News