వారి కోసం తెలంగాణ అసెంబ్లీకి వారం బ్రేక్‌?

Update: 2017-11-04 05:20 GMT
యాభై రోజుల పాటు అసెంబ్లీని నిర్వ‌హిస్తామ‌ని చెప్పి విప‌క్షాల‌కు షాకిచ్చింది తెలంగాణ స‌ర్కారు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా స‌మావేశాన్ని ఎక్కువ రోజులు పొడిగించాల‌ని ప్ర‌తిప‌క్షాలు కోర‌టం.. అవ‌స‌రం లేదంటూ చెప్ప‌టం అధికార‌ప‌క్షం స్ప‌ష్టం చేయ‌టం.. దీని మీద యాగీ న‌డ‌వ‌టం చూసేదే. అనుకోని రీతిలో ఆశ్చ‌ర్య‌క‌ర నిర్ణ‌యాలు తీసుకోవ‌టం అల‌వాటైన కేసీఆర్ స‌ర్కారు.. అసెంబ్లీ స‌మావేశాల విష‌యంలోనూ అనూహ్య నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ప‌ది రోజులు కాదంటే.. ఇర‌వై రోజులు వ‌ర్షాకాల స‌మావేశాల్ని నిర్వ‌హిస్తార‌నుకున్న దానికి భిన్నంగా ఏకంగా యాభై రోజుల పాటు అసెంబ్లీని నిర్వ‌హిస్తామ‌ని చెప్పి విప‌క్షాల‌కు మంట పుట్టేలా చేశారు.

సాధార‌ణంగా అసెంబ్లీ స‌మావేశాలంటే ప్ర‌భుత్వానికి దిన దిన గండంగా ఉంటుంది. ఎప్పుడు ఏ రీతిలో ప్ర‌తిప‌క్షాల నుంచి ఎదురుదాడి జ‌రుగుతుందో అర్థం కాక భ‌యం భ‌యంగా స‌మావేశాల్ని పూర్తి చేస్తారు. కానీ.. తెలంగాణ‌లో మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. ఎందుకంటే విప‌క్షాలు బ‌ల‌హీనంగాఉండ‌టం.. కేసీఆర్ స‌ర్కారును నిల‌దీసి.. ఇరుకున పెట్టే ప‌రిస్థితి లేక‌పోవ‌టంతో కేసీఆర్ సావ‌ధానంగా ఉన్నారు.

ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు స‌భ‌ను న‌డుపుకుందామంటూ.. 50 రోజుల మాట కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చిన వెంట‌నే విప‌క్ష నేత జానారెడ్డి వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారంటే ఆయ‌నెంత ఇబ్బంది ప‌డ్డారో అర్థం చేసుకోవ‌చ్చు. సుదీర్ఘ కాలం సాగేలా ప్లాన్ చేసుకున్న అసెంబ్లీ స‌మావేశాలు పెద్ద ఆస‌క్తిని క‌లిగించ‌లేకున్నాయి.

బ‌ల‌హీన‌మైన ప్ర‌తిప‌క్షం కార‌ణంగా.. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడ‌లేక‌పోవ‌టంతో ప్ర‌భుత్వానిదే పైచేయిగా మారింది. దీంతో.. నిత్యం అధికార‌ప‌క్షం అధిక్య‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో స‌భాప‌ర్వం పెద్ద‌గా ఆస‌క్తిక‌రంగా సాగ‌టం లేద‌ని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈ నెలాఖ‌రులో ఓ వారం పాటు స‌భ‌కు బ్రేక్ ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ స‌ర్కారు ఉంది.

ఈ నెల 28 నుంచి 30 వ‌ర‌కు హైద‌రాబాద్ లో ప్ర‌పంచ పారిశ్రామిక‌వేత్త‌ల స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌ద‌స్సుకు ప్ర‌ధాని మోడీతో పాటు.. అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజ‌రుకానున్నారు.  ఈ నెల 28న హైద‌రాబాద్‌కు రానున్న మోడీ.. ప్ర‌పంచ పారిశ్రామిక‌వేత్త‌ల స‌ద‌స్సు ప్రారంభ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. అదే రోజు హైద‌రాబాద్ మెట్రో రైల్ ను ప్రారంభిస్తారు. ఆ రోజు రాత్రి పారిశ్రామిక‌వేత్త‌ల స‌ద‌స్సుకు హాజ‌రై.. ప్ర‌తినిధుల‌తో క‌లిసి విందు చేస్తారు. 29న ఆయ‌న ఢిల్లీకి తిరిగి వెళ‌తారు. మూడు రోజుల పాటు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా జ‌రిగే స‌ద‌స్సు కావ‌టంతో ఈ కార్య‌క్ర‌మాన్ని భారీగా చేప‌ట్టాల‌ని భావిస్తోంది తెలంగాణ స‌ర్కారు.

ఈ నేప‌థ్యంలో స‌భ‌ను 28కు రెండు రోజుల‌ ముందు నుంచి అసెంబ్లీ స‌మావేశాలకు విరామం ఇవ్వాల‌ని భావిస్తోంది. అధికార యంత్రాంగం స‌ద‌స్సు ఏర్పాట్లు.. వ‌చ్చిన అతిధుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చూసుకోవాల్సిన నేప‌థ్యంలో వారం పాటు అసెంబ్లీకి విరామం ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అదే జ‌రిగితే.. కేసీఆర్ చెప్పిన 50 రోజుల స‌మావేశాలు డిసెంబ‌రు రెండో వారం వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్నాయి.
Tags:    

Similar News