దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో మరోమారు బీజేపీ విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మార్క్ ప్రచారంతో సొంత రాష్ట్రంలో మరోమారు పార్టీని విజయతీరానికి చేర్చారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నేతల్లో ఉత్సాహంలో నింపింది. ప్రధాని మోడీకి పరీక్ష వంటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించడమే కాకుండా...2019 ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు చేర్చే నమ్మకాన్ని మరోమారు ప్రోది చేశారని ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫలితంతో తెలంగాణ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున సంతోషపడుతున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ - మాజీ కేంద్ర మంత్రి - ఎంపీ బండారు దత్తాత్రేయ - బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి.కిషన్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు బీజేపీ ఊహించినవేనని లక్ష్మణ్ అన్నారు. అవుట్ సోర్సింగ్ లీడర్ లతో కాంగ్రెస్ ప్రచారం చేసుకుందని అయినప్పటికీ...అభివృద్ధికి రెండు రాష్ట్రాల ప్రజలు పట్టం కట్టారని సంతోషం వ్యక్తం చేశారు. జీఎస్టీపై రాహుల్ విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని.. బీజేపీ గతం కంటే ఓటింగ్ శాతాన్ని పెంచుకుందని సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకొని అరువు తెచ్చిన నాయకులతో ప్రచారం చేసినా ప్రజల విశ్వాసాన్ని పొందలేక పోయారు. జీఎస్టీ - పెద్ద నోట్ల రద్దు - పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు పేరుతో ఎన్ని విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మలేదని అన్నారు. జీఎస్టీ - పెద్ద నోట్ల రద్దు పేద ప్రజలకు మేలు చేస్తుందనేదానికి ఈ ఫలితాలు నిదర్శనమని లక్ష్మణ్ విశ్లేషించారు.
తాజా ఫలితాలు చూస్తుంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ ఖాయమని తేలిపోయిందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఎస్టీ, ఓబీసీలు బీజేపీ వైపు ఉన్నారని ఫలితాలు చాటుతున్నాయని తెలిపారు. గుజరాత్ లో కాంగ్రెస్ ఇంకో 20ఏళ్ళైనా అధికారంలోకి రాదని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ గెలుపు తెలంగాణపై ప్రభావం ఉంటుందని అన్నారు. బీజేపీ జాతీయ రథసారథి అమిత్ షా చూపు ఇక తెలంగాణపైనే ఉంటుందన్నారు. మోడీ అభివృద్ధి ,కేసీఆర్ వైఫల్యాలను అస్త్రంగా తీసుకొని భవిష్యత్ లో తెలంగాణలో కూడా పాగా వేస్తామన్నారు. ఈ ఓటమితో కాంగ్రెస్ ఆశలు తేలిపోయాయని ఆయన పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు రెఫరెండం గా ఈ ఎన్నికలను తమ ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేశాయని...బీజేపీ విజయం చూసిన తరువాత 2019 ఎన్నికల నుంచి ప్రత్యర్థి పార్టీలు విరమించుకోవాలని బీజేపీ నేత లక్ష్మణ్ సూచించారు. కులాలు మతాల వారీగా ప్రజలను రెచ్చగొట్టినా కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీ బీజేపీకి రాష్ట్రాల్లో అధికారాన్ని బదిలీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ కాంగ్రెస్ సంప్రదాయానికి విరుద్ధంగా ఈ సారి గుళ్ళు గోపురాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రజలు నమ్మలేదని అన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజలకు నమ్మకం పోయిందని తెలిపారు. గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ లో ప్రజలు అభివృద్ధి కి పట్టం కట్టారన్నారు. కాంగ్రెస్ కుల - మత రంగు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ దుష్ప్రచారం చేసినా...ప్రజలు మోడీ సంస్కరణలకు మద్దతు పలికారని అన్నారు. ఈ విజయం బీజేపీకి గొప్ప బహుమానమని...తెలంగాణకు గుజరాత్ గెలుపు శుభ సూచకమని దత్తాత్రేయ తెలిపారు.