బీజేపీకి ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ని కేసీఆర్‌

Update: 2017-01-27 10:11 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాల‌తో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీలో గంద‌ర‌గోళం నెల‌కొంటోంది. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మూడు రోజుల పాటు అమిత్‌ షా తెలంగాణలో పర్యటించనున్న నేప‌థ్యంలో ఏ విధ‌మైన ఎజెండాతో రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లాల‌నే సందిగ్దంలో ప‌డిపోయారు. కేంద్ర ప్ర‌భుత్వానికి ద‌గ్గ‌ర‌వుతున్న కేసీఆర్ తీరుతో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ ఎస్‌ - భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు పేచీ తారాస్థాయికి చేరుతోంది. తెలంగాణలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీతోనే జత కడుతుందా? లేక అధికార పక్షం టీఆర్‌ ఎస్‌ తో కలిసి పోటీ చేస్తుందా..? అనే సందేహం బీజేపీ నేతల్లో రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర నాయకత్వం మాత్రం పెదవి విప్పడంలేదు. దీంతో ఇటు టీడీపీతో ముందుకు సాగాలా లేదా టీఆర్‌ ఎస్‌ పొత్తు ఉంటుందా అన్ని విషయంలో రాష్ట్ర కమలనాథులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ సమీకరణాల నేపథ్యంలో టీఆర్‌ ఎస్‌ తో పొత్తు ఉన్నట్లో లేనట్లో ఇప్పటి నుండే భావించవద్దని పార్టీ పరంగా ప్రజా సమస్యలపై పోరు కొనసాగించాలని కేంద్ర నాయకత్వం రాష్ట్ర కమిటీని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో మద్యం అమ్మకాలపై-స్కాలర్‌ షిప్స్‌-విద్యా విధానాలపై పెద్ద ఎత్తున బీజేపీ ఉద్యామాలు, ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది.

అదే స‌మ‌యంలో మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ విష‌యంలోనూ ఆ పార్టీ తేల్చుకోలేక పోతోంది. తెలంగాణలో పూర్తిగా బలహీనపడిన తెలుగుదేశంతో జతకలిసి వచ్చే సార్వ త్రిక ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీ ఎంత వరకు నెగ్గుకు వస్తుందనే అనుమానాన్ని బీజేపీ నేతలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రెండు రోజులపాటు భద్రాచలంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలలోనూ బీజేపీ శ్రేణులు ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌ర్చారు. మ‌రోవైపు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారనే వార్తతో పార్టీ ఏ విధంగా ముందుకు సాగాల‌నే ప్ర‌శ్న కొన‌సాగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బూత్‌ స్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కేంద్ర నాయకత్వం ఆదేశించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో పూర్తి కేడర్‌ ను చైతన్య పరచి వారితో కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక 16పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పార్టీ నేతలు నిర్ణయించారు. బూత్‌ స్థాయిలో పార్టీ బలంగా ఉండి సంస్థాగతంగా పటిష్టంగా ప్రజలను బీజేపీకి అనుకూలంగా మార్చుకునేలా చేయవచ్చని యోచిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News