తెలంగాణ బీజేపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారా?

Update: 2016-07-14 07:51 GMT
తిరుగులేని అధికారపక్షంగా అవతరించిన కేసీఆర్ సర్కారుపై తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు ఆసక్తికరంగా మారాయి. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తెలంగాణ విపక్షాల నుంచి పలువురు నేతల్ని కారు ఎక్కించిన తీరు తెలిసిందే. గులాబీ బాస్ పుణ్యమా అని.. విపక్షాలన్నీ బలహీనమైన పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ కమలనాథులు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. టీఆర్ ఎస్ కు చెందిన ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. పలువురు నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని.. త్వరలో తమ పార్టీలో చేరతారంటూ ప్రకటనలు చేస్తున్న పరిస్థితి.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని రాజకీయ పక్షంగా మారిన టీఆర్ ఎస్ నుంచి వలసలు ఉండే ఛాన్స్ ఉందా? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఇలాంటి వ్యాఖ్యలు కమలనాథులు ఎందుకు చేస్తున్నారన్నది అంతుబట్టనిదిగా మారింది. సమీప భవిష్యత్తులో తెలంగాణలో కేసీఆర్ ను కొట్టే నాయకుడు రాలేరన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. బీజేపీలోకి వచ్చి సాధించేది ఏమిటన్నది ఒక ప్రశ్న.

పనుల కోసమో.. పవర్ కోసమో అయితే.. టీఆర్ ఎస్ ను విడిచి పెట్టాల్సిన అవసరమే లేదు. పుష్కలంగా కాకున్నా.. చూసీచూడనట్లుగా ఎవరికి అవసరమైన పనులు వారు చేయించుకుంటున్న పరిస్థితి. ఇలాంటప్పుడు పార్టీ మారాల్సిన అవసరం లేదు. దీనికి తోడు అధికార పక్షమన్న రక్షణ కవచాన్ని విడిచి పెట్టి బయటకు రావాల్సిన అవసరం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

బీజేపీ శాసనసభాపక్ష ఉప నేత ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్ ఈ మధ్యన మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ కు చెందిన పలువురు మంత్రులు త్వరలోనే బీజేపీలోకి చేరనున్నట్లుగా చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఈ ప్రకటనను ఖండించని తెలంగాణ బీజేపీ చీఫ్ తాజాగా మాట్లాడుతూ.. ఆ వ్యాఖ్యల్లో కొంత నిజం ఉందన్నట్లుగా చెప్పటం గమనార్హం. తమ పార్టీలోకి రావటానికి అధికారపక్షానికి చెందిన కొందరు నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పటం గమనార్హం. అయితే.. లక్ష్మణ్ చెబుతున్న మాటలపై రాజకీయ వర్గాల విశ్లేషణ వేరుగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ ఎస్ ను విడిచి వెళ్లే ధైర్యం ఏ నేత చేయరని.. ఇదంతా బీజేపీ మైండ్ గేమ్ గా అభివర్ణిస్తున్నారు. బీజేపీలో ఇమడటం అంత తేలికైన విషయం కాదని.. కమలనాథులు చెప్పినట్లుగా వలసలు ఉండే అవకాశం తక్కువగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News