కేసీఆర్ ను తిట్టాలా... మోడీని తిట్టాలా?

Update: 2016-12-05 10:01 GMT
తెలంగాణ బీజేపీ నేతలకు సంకట పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒక పక్క తలంటుతుంటే.. మరోవైపు ప్రధాని మోడీ మాత్రం తెలంగాణలోని అధికార పార్టీ అధినేత - సీఎం కేసీఆర్ తో చెట్టపట్టాలేసుకుంటున్నారు. దీంతో పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపాలన్న తమ వ్యూహాన్ని అమలు చేయలేక లోకల్ బీజేపీ లీడర్లు తెగ ఇబ్బందిపడుతున్నారు.
    
నిజానికి మొదట్లో టీఆరెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగేది. కేసీఆర్ కూడా మోడీపై విరుచుకుపడేవారు. ఆ సమయంలో తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ ను - టీఆరెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేవారు. కానీ... ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కేసీఆర్ మోడీకి మంచి స్నేహితుడిగా మారుతున్నారు. అనేక అంశాలపై కేసీఆర్ సలహాలను మోడీ కోరుతున్నారు. మొన్న నోట్ల రద్దు తరువాత కూడా కేసీఆర్ ను ఢిల్లీ రమ్మని పిలిచి మోడీ ఆయనతో చర్చలు జరిపారు. ఆ తరువాత హైదరాబాద్ వచ్చిన మోడీ కేసీఆర్ తో విమానాశ్రయంలోనే రెండుసార్లు ఆంతరంగికంగా మాట్లాడారు. మోడీ కేసీఆర్ కు అంతగా ప్రయారిటీ ఇస్తుంటే తామెలా విమర్శలు చేయగలమని బీజేపీ నేతలు అంటున్నారు.
    
నిజానికి వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపడేందుకు బీజేపీకి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఏపీతో పోల్చితే తెలంగాణలో అన్ని జిల్లాల్లో క్యాడర్ ఉండడం.. కేంద్రంలో అధికారంలో ఉండడం.. మోడీ ఇమేజి... రాష్ట్ర నేతలు కష్టించి పనిచేస్తుండడం వంటివన్నీ కలిసొచ్చేవే. కానీ... ప్రభుత్వ విధానాలపై ఏమీ వ్యతిరేకంగా మాట్లాడలేకపోతుండడంతో ఎలా ముందుకెళ్లాలో తెలియక బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
    
ఇటీవల కేసీఆర్ 50 కోట్లతో కట్టుకున్న ఇంటి విషయంలో పార్టీలన్నీ ఎండగడుతున్నా బీజేపీ మాత్రం దానికి వ్యతిరేకంగా ఒక్క ప్రకటన కూడా చేయలేకపోయింది. అంతేకాదు.. ఇంతకుముందూ పలు అంశాల్లో అవకాశాలు అందివచ్చినా కేసేఆర్ ప్రభుత్వాన్ని ఏమీ అనలేక ఊరుకుంటున్నామని... కేంద్రంలోని పెద్దల తీరు కారణంగానే ఇక్కడ పార్టీని బలోపేతం చేయలేకపోతున్నామని అంటున్నారు.  దీంతో కేసీఆర్ ను తిట్టాలా... లేదంటే ఆయన్ను  తిట్టనివ్వకుండా చేస్తున్న మోడీని తిట్టాలా అని డైలమాలో పడ్డారట బీజేపీ నేతలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News