ల‌క్ష్మ‌ణ్ సీటు కు ఎస‌రే...కొత్త అధ్య‌క్షుడు ఎవ‌రంటే...

Update: 2019-12-12 05:55 GMT
తెలంగాణ బీజేపీ మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కింది. డిసెంబర్ నెలాఖరు కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారని గ‌త కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారం ఏకంగా పార్టీ పెద్ద‌లే క్లారిటీ ఇవ్వ‌డంతో...ఇప్పుడు కొత్త అధ్య‌క్షుడు ఎవ‌రు? బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్‌ను మార్చేస్తారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. నాలుగు ఎంపీ సీట్లు సాధించడంతో, తెలంగాణ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీజేపీ అధినాయకత్వం. దీంతో రాష్ట్ర బీజేపీని పరుగులు పెట్టే అధ్యక్షుని కోసం కసరత్తు చేస్తోంది. ఇటీవ‌లే ఈ మేర‌కు ఢిల్లీ వర్గాలు మీడియాకు ఉప్పందించాయి. ఈ నేపథ్యంలో పార్టీ నాయ‌క‌త్వ మార్పులు ఖాయ‌మంటున్నారు. తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. సంక్రాంతి తర్వాతే రాష్ట్ర బీజేపీ కి కొత్త చీఫ్ వస్తారని చెప్పారు.

ప్ర‌స్తుత అధ్య‌క్షుడు లక్ష్మణ్ త‌న ప‌ద‌వి కొన‌సాగేందుకు ఢిల్లీలో తన ప్రయత్నాలు చేస్తున్నార‌ని అంటున్నారు. మరికొందరు నేతలు కూడా, అధ్యక్ష రేసులో తాము సైతం ఉన్నామంటూ రకరకాల మార్గాల ద్వారా లాబీయింగ్ చేస్తున్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏకంగా సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించి, జాతీయస్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పేరును కూడా, చాలామంది అధ్యక్ష పదవికి సూచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అర్వింద్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే, పార్టీ మరింత దూకుడుగా ముందుకెళుతుందని, అధిష్టానానికి కొందరు సీనియర్లు చెబుతున్నారట. ఇక కరీంనగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచి, ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌గా పాపులర్ అవుతున్న బండి సంజయ్ సైతం, అధ్యక్ష పదవి కోసం ఢిల్లీ స్థాయి లో లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొందరు సీనియర్ల ద్వారా, ఆయన పావులు కదుపుతున్నట్ట కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. యూత్‌లో ఫాలోయింగ్‌ ఉన్న సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారని రాష్ట్ర పార్టీలో చర్చ సాగుతోంది. సంజయ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈయనకే అధ్యక్ష పదవి వస్తుందనే ప్రచారం బీజేపీ లో జోరుగా సాగుతోంది.


ఈ నెల 13 నుంచి మూఢాలు ఉన్నాయని, సంక్రాంతి తర్వాతే మంచి రోజులు ఉండటం తో అప్పుడే కొత్త చీఫ్ వస్తారని మురళీధర్ రావు చెప్పారు. కాగా, ఆయ‌న కామెంట్ల వెనుక ర‌క‌ర‌కాల చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్పటివరకూ అధ్యక్షులుగా ఉన్న నేతలు హైదరాబాద్‌కు చెందిన వారే కావ‌డంతో పార్టీ రాజధాని దాటి బలోపేతం కావడం లేదంటున్నారు. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో మూడు ఎంపీ సీట్లను గెలుచుకుంది. దీంతో ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు ఇస్తే… పార్టీ పెరిగే అవకాశం ఉందనేది అధిష్టానం ఆలోచన అంటున్నారు.


Tags:    

Similar News