టీడీపీతో పొత్తా.? పుట్టి మునుగుతారు..

Update: 2018-08-27 08:00 GMT
పొత్తుపొడుపులు ఎక్కడుంటాయి.. ఎప్పుడుంటాయి.  సమఉజ్జీల మధ్యనుంటాయి. సమాన పార్టీలు కలిసి అధికార పక్షాన్ని ఎదుర్కోవడానికి ఇలా జట్టు కడుతాయి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా ఉండి కూడా పుట్టిమునిగే పార్టీతో అంటకాగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఆ పార్టీతో గడిచిన ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని మునిగిపోయిన బీజేపీ రాష్ట్ర నేత ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడికి విన్నవించినా ఆయన లైట్ తీసుకోవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశం జరిగింది. మన మాస్టార్ కోదండరాం ప్రతిపక్షాలన్నింటిని బాగానే మేనేజ్ చేసి ఈ సమావేశానికి రప్పించాడు. ఇక్కడే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కలిశాడు. ఇద్దరూ పిచ్చాపాటీగా మాట్లాడారు. ఈ సమయంలోనే బాంబు పేల్చాడు లక్ష్మణ్.

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని టీఆర్ ఎస్ ను ఎదుర్కోవాలని కలలు గంటున్న కాంగ్రెస్ నేతలకు హితబోధ చేశాడు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే సీట్లు కూడా రావని.. అది ఆంధ్రపార్టీ కింద లెక్కగట్టి తెలంగాణ జనాలు పార్టీని గుర్తించడం లేదని.. అటువంటి పార్టీతో పొత్తుపెట్టుకుంటే మీ అసలుకే మోసం వస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డికి లక్ష్మణ్ స్పష్టం చేశాడట.. కానీ ఉత్తమ్ మాత్రం అధికార టీఆర్ ఎస్ ను ఎదుర్కోవాలంటే పొత్తు అనివార్యమంటూ కవర్ చేశారట..

టీడీపీ ఇప్పుడు తెలంగాణలో నామరూపాల్లేకుండా పోతోంది. వీర విధేయుడు రేవంత్ రెడ్డి కూడా టీడీపీ కాడి వదిలేసి కాంగ్రెస్ లో చేరారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకొని పోతుండడం ఏమాత్రం లాభం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ ఏమేరకు ఫలితం సాధిస్తుందో వేచిచూడాల్సిందే..
Tags:    

Similar News