కేంద్రమంత్రి మాటతో లక్ష్మణ్ గాలి పోయినట్లైందా?

Update: 2019-09-10 05:22 GMT
గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న లక్ష్మణ్ మీడియాలో తెగ దర్శనమిచ్చేస్తున్నారు. ఇంతకాలం సాత్వికంగా ఉంటారన్న పేరున్న ఆయన.. ఇటీవవల కాలంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. విమర్శలతో మోతెక్కించటమే కాదు.. వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

ఆయన చేస్తున్న విమర్శల్లో అందరిని ఆకర్షిస్తోంది.. తెలంగాణలో విద్యుత్ శాఖలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని. ఇదే అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సైతం పదే పదే ప్రస్తావించటంతో.. విద్యుత్ శాఖలో చోటు చేసుకున్న భారీ కుంభకోణం ఏమిటన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమైంది. ఇలాంటి సమయంలో తాను ప్రస్తావిస్తున్న విద్యుత్ కుంభకోణం గురించి వివరిస్తూ.. తెలంగాణలో విద్యుత్ ను అధిక ధరలకు కొన్నారని..కొనుగోళ్ల ఒప్పందాల్లో భారీ స్కాం జరిగిందని ఆయన మండిపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. లక్ష్మణ్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అదే పనిగా ఎక్కువ ధరకు విద్యుత్ ను కొనుగోలు చేశారన్న మాట తప్పించి.. మరే ఆధారాన్ని చూపించకపోవటం ఒక ఎత్తు అయితే.. తాజాగా కేంద్రమంత్రి నోటి నుంచి వచ్చిన సమాధానం లక్ష్మణ్ గాలి తీసేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర విద్యుత్ శాఖ సహాయమంత్రి  ఆర్కే సింగ్ ను మీడియా ప్రతినిధులు తెలంగాణలో చోటు చేసుకున్న విద్యుత్ స్కాం గురించి అడిగారు.

ఇందుకు ఆయన.. తనకు ఎలాంటి సమాచారం లేదని.. ఒకవేళ అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఎవరైనా తమకు ఫిర్యాదు చేయొచ్చని వ్యాఖ్యానించారు. ఓపక్క తమ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడేమో తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి భారీ స్కాం జరిగినట్లుగా హడావుడి చేస్తుంటే.. కేంద్రమంత్రికి మాత్రం అందుకు సంబంధించిన సమాచారం ఏమీ లేదని చెప్పటం చూస్తే.. లక్ష్మణ్ విమర్శలపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే పనిగా మీడియాకు స్కాం జరిగిందని చెప్పే లక్ష్మణ్.. కేంద్రంలోని తమ ప్రభుత్వానికి కుంభకోణం వివరాలు ఎందుకు ఇవ్వనట్లు..?


Tags:    

Similar News