5 గంటల పాటు సాగిన తెలంగాణ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ఇవే..

Update: 2020-02-17 05:23 GMT
సమావేశం ఏదైనా సరే కనీసం మూడు గంటలు గరిష్ఠంగా ఎనిమిది తొమ్మిది గంటల పాటు సాగుతుంటాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీలు. తాజాగా నిర్వహించిన మంత్రిమండలి సమావేశం ఏకంగా ఐదు గంటల పాటు సాగింది. పలు అంశాల మీద ఆసక్తికర చర్చ నడిచినట్లు గా తెలుస్తోంది. గడిచిన కొద్ది రోజులు గా కేంద్రం తీరు పై విమర్శలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాటలకు తగ్గట్లే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఉండటం గమనార్హం.

కేంద్రం ఇచ్చే పన్నువాటా సరిగా లేదన్న విషయాన్ని ప్రస్తావించటమే కాదు.. ఈ తీరును తప్పు పట్టారు. అంతేకాదు.. మోడీ సర్కారు తీసుకొచ్చిన సీఏఏ చట్టాన్ని అమలు చేయలేమన్న విషయాన్ని ఆయన చెప్పారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామన్న ఆయన.. లౌకికవాదానికి మారుపేరైన తెలంగాణ ప్రభుత్వం ఈ తరహా చట్టాలకు వ్యతిరేకమన్నారు. ఈ అంశం పై తమ విధానం దేశం మొత్తానికే తెలిసేలా చేస్తామన్న ఆయన.. సీఏఏపై కేంద్రం పునరాలోచించుకోకుంటే హైదరాబాద్ లో భారీ సభను ఏర్పాటు చేస్తామన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పలు పథకాలు (రాజీవ్ స్వగృహ, బంగారుతల్లి, అభయహస్తం, వడ్డీ లేని రుణం) తదితరాలను అధ్యయనం చేసి వాటిని కొనసాగించాలా? వద్దా? అన్న విషయం మీద ఒక నిర్ణయానికి వస్తామన్నారు. ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు పట్టణ ప్రగతి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని.. ఇందులో భాగంగా నగరాలు.. పట్టణాల్లో వసతులు.. సౌకర్యాల కల్పనే లక్ష్యంగా వ్యవహరించనున్నారు.
కేబినెట్ సమావేశం లో చర్చించి.. తీసుకున్న మరిన్ని నిర్ణయాలేమంటే..

% రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం ద్వారా విక్రయించటానికి ఓకే
% అభయహస్తం పథకం సమీక్ష బాధ్యత మంత్రి హరీశ్ .. ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియాకు అప్పగింత
% మేడారం జాతరను సక్సెస్ చేసినందుకు మంత్రులకు.. అధికారులకు ప్రత్యేక అభినందనలు
% జీహెచ్ఎంసీకి నెలకు రూ.78 కోట్లు.. ఇతర నగరాలు.. పురపాలక సంఘాలకు నెలకు రూ.70 కోట్ల చొప్పున ఆర్థిక సంఘ నిధుల్ని వెంటనే విడుదల చేయటం
% నగర.. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులకు 3100 వాహనాల్ని సమకూర్చాలి. ఇందులో 600 వాహనాలు ఇప్పటికే వచ్చాయి. మిగిలిన వాటిని వెంటనే అందుబాటు లోకి తీసుకు రావాలి.
% మంచినీటి సరఫరా వ్యవస్థ ను పటిష్టం చేయటం.
% రహదారుల్ని మెరుగు పర్చుకోవటం
% శశ్మాన వాటికల ఏర్పాటుకు స్థలాల ఎంపిక
% ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్ని పార్కింగ్ కోసం వినియోగించాలి
% వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లోకాయుక్త బిల్లును ప్రవేశ పెట్టటం
% కొత్త రెవెన్యూ చట్టం.. నీటిపారుదల వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణ తదితర అంశాలపై చర్చ


Tags:    

Similar News