కేఆర్ఎంబీ అధికారులపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఆగ్రహం

Update: 2021-09-01 10:30 GMT
కృష్ణా బోర్డు అధికారులపై తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఏపీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ లేఖలు రాసి అధికారులను వేధిస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులు 1980లో శంకుస్థాపన చేశారని.. అలాంటి ప్రాజెక్టు అనధికార ప్రాజెక్ట్ ఎలా అవుతుందని రజత్ కుమార్ ప్రశ్నించారు.

ఏపీ రాసిన ప్రతీ లేఖపై కేఆర్ఎంబీ-జీఆర్ఎంబీ తెలంగాణ వివరణ కోరడం ఏంటని కృష్ణా బోర్డు అధికారులను రజత్ కుమార్ ప్రశ్నించారు. ప్రాజెక్టుల పూర్వాపరాలు తెలుసుకోకుండా బోర్డులు తెలంగాణకు సమాధానాలు ఇవ్వాలని ఎలా అడుగుతారని నిలదీశారు.

నీటి వివాదాల్లో నెలకొన్న అంశాలపై ఇవాళ్టి సమావేశంలో తెలంగాణ తరుఫున గట్టి వాదనలు వినిపిస్తామని రజత్ కుమార్ తెలిపారు. తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగిందని.. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం మీటింగ్ లో ప్రశ్నిస్తాం అని తెలిపారు.

ఇప్పటికే కృష్ణా బేసిన్ నుంచి ఏపీ తరలిస్తున్న నీటిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమ ప్రాజెక్ట్ అని.. దీనిపై కేఆర్ఎంబీ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు 50శాతం ఇవ్వాల్సిందేనని తెలంగాణ డిమాండ్ చేస్తోంది.

తెలంగాణలో జనాభా పెరుగుతోందని.. కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణలో పెద్ద పరిశ్రమలు స్థాపిస్తున్నారని.. నీటి వాటా ఖచ్చితంగా పెంచాలని సూచించారు. టెలిమెట్రీల విషయంలో కేఆర్ఎంబీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని.. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ పదే పదే బోర్డులకు లేఖలు రాసి వేధిస్తోందన్నారు. విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీని ఏపీకి తరలించవచ్చని.. కానీ వైజాగ్ తరలించడం అంటే కృష్ణ బేసిన్ దాటి గోదావరి బేసిన్ లోకి తరలించడమేనని ఇది సరికాదని పేర్కొన్నారు.




Tags:    

Similar News