కేసీఆర్ ఇల్లు అంటే ఆ మాత్రం ఉండాలిగా

Update: 2016-02-09 17:30 GMT
పేద‌ల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇల్లు క‌ట్టిస్తానని చెప్పే ముఖ్య‌మంత్రి.. తాను ఉండ‌టానికి ఎలాంటి ఇంటిని చూసుకుంటారు? తన జీవితంలో తల దాచుకునేంత గూడు కాని కట్టుకోగలిగితే చాలనుకునే పేదోడి కోస‌మే డ‌బుల్ బెడ్ రూం స్థాయి క‌ల క‌న్న సీఎం.. త‌న సొంతానికి వ‌చ్చేస‌రికి మరెంత విశాలమైన ఇల్లు క‌ట్టించుకోవాల‌ని అనుకుంటారు? ఒకవేళ భారీ కట్టడాన్ని కట్టుకోవాలని అనుకున్నా తప్పు పట్టలేం? పేదోడి కోసం ఖరీదైన కల కనే ముఖ్యమంత్రి.. తన కోసం తన స్థాయికి తగ్గ కలను కంటే తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? ఇంతకీ ఇదంతా ఏ ముఖ్యమంత్రి గురించో ఇప్పటేకే అర్థమై ఉంటుంది. అవును.. ఇప్పటివరకూ చెప్పిందంతా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురించే.

తాజాగా కేసీఆర్ ఒక నిర్ణయానికి ఓకే చెప్పేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ఉండేందుకు రూ.30 కోట్ల వ్య‌యంతో.. తొమ్మిది ఎక‌రాల్లో సరికొత్త ఇంటికి నిర్మించాలన్న ఆదేశాలు ఇచ్చేశారు. హైదరాబాద్ నడి బొడ్డు  లాంటి అమీర్ పేటలో 9 ఎకరాల సువిశాల స్థలంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటిని నిర్మించనున్నారు. ఈ తొమ్మిది ఎకరాల్లో 2 ఎక‌రాలు కేవ‌లం అచ్చంగా సీఎం ఇంటి కోసే నిర్మించనున్నారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి నివాసం కోసం బేగంపేట‌లో భారీ భ‌వంతిని నిర్మించారు. ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ నివాసం ఉండ‌టం తెలిసిందే. 2004లో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఉంటున్న ఇంట్లోకి వెళ్లటంతో పాటు.. మరణించే వరకూ అదే ఇంట్లో ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత సీఎం అయిన రోశయ్య.. వైఎస్ లాంటి నేత ఉన్న ఇంట్లో తాను ఉండటమేమిన్న భావనతో ఆ ఇంట్లోకి అస్సలు వెళ్లలేదని చెబుతారు. రోశయ్య తర్వాత.. ఊహించని రీతిలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా.. వైఎస్ లాంటి వ్యక్తి నివాసం ఉన్న ఇంట్లో తాను ఉండటం ఇష్టం లేక.. అలా అని దాన్ని ఖాళీగా ఉంచటం ఇష్టలేక.. పార్టీ కార్యకలాపాలు.. ఏదైనా సమావేశాల కోసం వినియోగించేవారు.

రాష్ట్ర విభజన జరగటం.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి ఈ ఇంటికి కేటాయించటం జరిగిపోయాయి. కానీ. అసలు సమస్య కేసీఆర్ తోనే. స్వతహాగా నమ్మకాలు.. వాస్తును ఎక్కువగా నమ్మే ఆయనకు.. తనకు కేటాయించిన ఇంటికి వాస్తు సరిగా లేదని.. దాంతో సమస్యలు తప్పవన్న విషయాన్ని తేల్చి చెప్పటం.. అలా చెప్పే వారి మాటల్ని ఎక్కువగా నమ్మే కేసీఆర్ వైఖరితో.. ఆయనకు ఆ ఇల్లు ఒక సమస్య మారింది. ఇంటికి దోషంగా భావిస్తున్న వాస్తు సమస్యల్ని పరిష్కరించాలని ప్రయత్నించినా.. ఎంతకూ తెమలని పరిస్థితి. మొత్తంగా కేసీఆర్ కు కొత్త ఇల్లు తప్పించి.. ఉన్న ఇంట్లో ఉండేందుకు పెద్దగా ఇష్టం లేని పరిస్థితికి వచ్చేసింది.

దీనికి ప్రత్యామ్నయంగా ఆయన చాలానే ఆలోచనలు చేశారు. అందులో ఒకటి.. ఐఏఎస్ లకు చెందిన క్వార్టర్లను ఖాళీ చేయించేసి.. తన అవసరాలకు తగ్గట్లుగా ఇళ్లను తయారు చేయటం. ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికి ఇంటి అవసరం వచ్చినప్పుడు ఇక ఆపేదెవరు? అంతే.. ఐఏఎస్ ల క్వార్టర్లు ఖాళీ అయిపోయాయి. అయితే.. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఆ ఇళ్లల్లో పూజలు చేసిన తర్వాత.. మళ్లీ ఎవరో ఏదో అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో ఆయన గృహ ప్రవేశ కార్యక్రమానికి బ్రేకులు పడిపోయాయి. అప్ప‌టినుంచి త‌న‌దైన డ్రీం హౌస్ కోసం ఆయన చాలానే ప్ర‌య‌త్నాలు చేశారు. రకరకాల స్థలాల్ని చూడటం.. అందులో భవనం కట్టించాలన్న ప్రయత్నాలు మొదలెట్టారు.

ఇదే సమయంలో.. ముఖ్యమంత్రి నివాసం కోసం కేసీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తటం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆ విష‌యాన్ని కొంత‌కాలం ప‌క్క‌న పెట్టేశారు. ఒక విషయం మీద కేసీఆర్ దృష్టి పెడితే.. దాని సంగ‌తి పూర్తి చేసేంత‌వ‌ర‌కూ నిద్ర‌పోని వైఖరి తెలిసిందే. మిగిలిన విషయాల మీదనే పట్టుదలగా ఉండే వ్యక్తి.. తన నమ్మకాలకు సంబంధించిన అంశం.. అది కూడా తాను ఉండాల్సిన ఇంటి విషయంలో మరెంత పట్టుదలగా ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే.. ఆయన కోరుకున్నట్లుగా.. తన అవసరాలకు తగ్గట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి నిర్మానానికి పచ్చజెండా ఊపేశారు.

కేసీఆర్ లాంటి వ్యక్తి ముచ్చటపడ్డ ఇల్లు ఎలా ఉంటుంది? తాజాగా కట్టించే ఇంటితోనైనా ఆయన డ్రీం హౌస్ ముచ్చ‌ట తీరుతుందా? అన్న ప్రశ్న వేస్తే.. అవుననే మాట వినిపిస్తోంది. ఆర్నెల్ల వ్యవధిలో నిర్మించాల‌ని భావిస్తున్న ఈ కొత్తింటి లెక్క‌లు బారీగానే ఉన్నాయి. తొమ్మిది ఎక‌రాల్లో క‌ట్టే ఈ ఇంటిని రూ.30కోట్లు ఖ‌ర్చు పెట్ట‌నున్నారు. ఒకేసారి 300 నుంచి 400 వ‌ర‌కు వాహ‌నాలు పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు ఈ కొత్తింట్లో ఉండ‌నున్నాయి. అంతేకాదు.. ఓ వెయ్యి మందితో ఏదైనా మీటింగ్ పెట్టుకోవాల‌న్ని ఇబ్బంది లేకుండా ఉండేలా ఓ కాన్ఫ‌రెన్స్ హాలు.. ప్ర‌భుత్వానికి సంబంధించిన కార్య‌క్ర‌మాలు.. అధికారుల‌తో రివ్యూ ఏర్పాటుకు వీలుగా ఒక స‌మావేశ మందిరం.. లాంటివి ఉండ‌నున్నాయి.

క‌ళ్లు చెదిరే మోడ‌ల్‌ ను కేసీఆర్ ఓకే అన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇన్ని విషయాలతో పాటు మరికొన్ని విషయాల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అదేమంటే.. తాజాగా నిర్మించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటి కోసం ఐఏఎస్ ల క్వార్టర్లతో పాటు.. ఒక క్లబ్ ను తొలగించనున్నారు. లక్షలాది మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించే రాష్ట్రాధినేత.. ముఖ్యమంత్రి నివాసం కోసం భారీతనం ఉట్టిపడేలా రాజప్రసాదం లాంటి నివాసాన్ని నిర్మించటాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదేమో? అందుకోసం ఐఏఎస్ లకు కేటాయించిన క్వార్టర్లను తొలగించటాన్ని అర్థం చేసుకోవాలేమో.

Tags:    

Similar News