తెలంగాణ ప్రజల్ని కన్వీన్స్ చేయలేని కేసీఆర్.. దేశ ప్రజల్ని ఆకట్టుకుంటారా?

Update: 2022-06-15 16:30 GMT
తెలంగాణలో తిరుగులేని రాజకీయ అధినేతగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ను గులాబీ దండు అభివర్ణిస్తుంటారు. తమకు ప్రత్యర్థులు ఎవరూ లేరని.. తమకు పోటీ ఏమైనా ఉందంటే అది కాస్తా కేఏ పాల్ మాత్రమేనన్న జోక్ వేసేస్తుంటారు మంత్రి కేటీఆర్. తెలంగాణ విపక్షాల్ని చీపురు పుల్లల మాదిరి తీసేసే గులాబీ నేతల మాటల్లో వాస్తవం ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

నిజంగానే కేసీఆర్ అంత తురుమ్ ఖాన్ అయితే.. తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాల కోసం ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే సాయం తీసుకోవాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. తాను తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రంలో.. తాను చెప్పినట్లు ఒప్పుకునే తన సొంత ప్రజల్ని ప్రభావితం చేయటానికి.. వారి చేత ఓట్లు వేయించుకోవటానికి ఎన్నికల వ్యూహకర్తను అరువు తెచ్చుకోవటం దేనికి సంకేతం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తెలంగాణ రాష్ట్రానికి తాను చేయాల్సిందంతా చేసేసినట్లుగా చెప్పే కేసీఆర్.. ఇప్పుడు తన చూపు మొత్తం దేశం మీదనే అంటూ జాతీయ పార్టీ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెతకు తగ్గట్లే.. ఇప్పటికి రెండుసార్లు తెలంగాణలో అధికార పార్టీగా అవతరించిన టీఆర్ఎస్.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావటానికి తన సొంత తెలివి కంటే కూడా.. రాష్ట్రంతో ఏ మాత్రం సంబంధం లేని పీకేకు ఎలా ఇస్తారన్న సందేహం వ్యక్తమవుతోంది.

తెలంగాణ ప్రజల్ని ఏం చెప్పి.. వారిని ప్రభావితం చేయటానికి కేసీఆర్ కంటే పీకే టాలెంట్ పెద్దదా? అన్న సందేహం రాక మానదు. నిజంగానే పీకే టాలెంట్ పెద్దది అంటే.. కేసీఆర్ ఛరిష్మా తెలంగాణలో తగ్గిపోయిందా? అలాంటిదేమీ లేదన్నప్పుడు పీకే అవసరం ఎందుకు వచ్చింది? అన్నది మరో సందేహం.

మొదటి రెండు దఫాలు ఎవరి సాయం లేకుండానే ఎన్నికల్ని విజయవంతంగా ఈదటమే కాదు.. ఎన్నికలకు ముందే తమకొచ్చే సీట్ల లెక్కల్ని చెప్పేసే మేధావికి ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త అవసరం ఎందుకు? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ వాదనను చూసినప్పుడు తెలంగాణ శక్తిమాన్ ‘శక్తి’ మీద కొత్త సందేహాలు రాక మానదు.
Tags:    

Similar News