కేసీఆర్ దెబ్బ‌కు ఆ పార్టీల‌న్నీ గ‌ల్లంతే!

Update: 2017-10-15 05:11 GMT
`కారులో ఎంత‌మంది ఎక్కినా.. ఇంకొక‌రికి చోటు ఉంటుంది` అని చెప్ప‌డ‌మే కాదు నిరూపించేశారు టీఆర్ఎస్ నేత‌లు! ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ విల‌విల్లాడిపోయాయి. ఆ పార్టీల‌కు చెందిన చాలా మంది నేత‌లను కారులో ఎక్కించేసుకున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌! మ‌రి దీనికి విరామం ఇచ్చిన ఆయ‌న‌.. మ‌రోసారి రాజ‌కీయ వ్యూహ‌ల‌కు ప‌దును పెడుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ప్రత్యామ్నాయ వ్యూహాలు రచిస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయ వ్యూహాల్లో భాగంగా 2014 ప్రారంభం నుంచి నిర్వహించిన `ఆపరేషన్ ఆకర్ష్` వ్యూహాన్ని మ‌రోసారి అమ‌లు చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఇందులో కాంగ్రెస్ నేత‌ల‌కు ఆహ్వానాలు కూడా సిద్ధ‌మ‌య్యాయ‌ని తెలుస్తోంది!

ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఈజీగా 50 స్థానాల్లో గెలుపొందుతామని, కొంచెం కష్టపడితే మరో 30 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. ఇంతకుముందు 100 స్థానాలకు తక్కువ కాకుండా గెలుచుకుంటామని కేసీఆర్ చెప్పారు. మ‌రి ఇది స‌డ‌న్‌గా త‌గ్గ‌డానికి కార‌ణ‌మేంట‌నేది ప‌రిశీలిస్తే.. ఇటీవ‌ల ప్ర‌భుత్వంపై వ్యతిరేక‌త పెరుగుతోంది. ఇదే విష‌యం సర్వేల్లోనూ తేలుతోంది. కొంత‌మంది ఎమ్మెల్యేల‌పై ఇప్ప‌టికే ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని తేలింది. దీంతో పాటు జిల్లాల సంఖ్య పెర‌గ‌డం కూడా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్రారంభించాల‌నే ఆలోచ‌న‌కు మ‌ళ్లీ ఆజ్యం పోసింద‌ట‌.

ఈ క్రమంలో కొంత‌మందికి ఆఫ‌ర్లు కూడా వెళ్లాయ‌ట. పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని, ఎమ్మెల్యే స్థానాల్లో టిక్కెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని సమాచారం. ప్రత్యేకించి 2004 - 14 మధ్య రాష్ట్ర మంత్రులుగా ఉన్న ముఖేశ్ గౌడ్, దానం నాగేందర్, సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణలకు `ఆహ్వానాలు` పంపారని వినికిడి. ఇక కాంగ్రెస్‌లోని కొంత‌మంది నేత‌లు.. కూడా భ‌విష్య‌త్‌పై పున‌రాలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌.  వీరంతా కారు ఎక్కేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఈ జాబితాలో గద్వాల జేజెమ్మగా భావించే మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ మంత్రులు దానం నాగేందర్, మోత్కుపల్లి నర్సింహులు నేతలంతా ఉన్నార‌ట‌.

గద్వాల - జోగులాంబ జిల్లా కీలకమైన మాజీ మంత్రి డీకే అరుణ కుటుంబానికి కంచుకోట. కానీ 2014 తర్వాత పరిస్థితి తారుమారైంది. సొంత వ్యాపారాలు, లావాదేవీలు జరుపుకోవడం కూడా డీకే ఫ్యామిలీకి క్లిష్టతరంగా మారింది. ఇక‌ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా మెరుగైన రాజకీయ భవిష్యత్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఖైరతాబాద్ నుంచి 1999 ఎన్నికల నుంచి కీలక పాత్ర పోషిస్తున్న దానం నాగేందర్.. పీ జనార్దన్ రెడ్డి తర్వాత హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. ఈ క్రమంలో దానం నాగేందర్ టీఆర్ఎస్ గూటికి చేరితే కాంగ్రెస్ పార్టీకి కష్ట కాలమేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత.. 2014కు ముందు సీఎం కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచి విమర్శలు గుప్పించిన మోత్కుపల్లి నర్సింహులుకు గులాబీ పార్టీ నుంచి ఆహ్వానం అందిందని తెలుస్తోంది. ఇక మరో సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, మెదక్ జిల్లాలు మినహా టీఆర్ఎస్ పార్టీకి పెద్దగా సంస్థాగతంగా పట్టులేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో సంస్థాగతంగా పట్టు సాధించాలని సీఎం కేసీఆర్ సంకల్పంతో ఉన్నారు. కమ్మ సామాజిక వ‌ర్గాన్ని కలుపుకొని గెలుపు బావుటా ఎగురవేయాల ని టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది!  

టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల్లో ఆహ్వానాలు అందుకున్న నాయకుల్లో చాలా మంది తమకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని గ్యారంటీ ఇస్తే `కారె`క్కడానికి సిద్ధమని సంకేతాలిచ్చారని సమాచారం. ఏది ఏమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో విపక్షాల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మ‌రి కేసీఆర్ వ్యూహాలు.. అంతుచిక్క‌వ‌నేది మ‌రోసారి రుజువ‌య్యేందుకు ఎంతో స‌మ‌యం లేద‌నేది మాత్రం తెలుస్తోంది!!
Tags:    

Similar News