కేసీఆర్ కు అస్వస్థత.. రాత్రి వేళ హడావుడి గా యశోదా కు

Update: 2020-01-22 03:58 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి వేళ ఆయన్ను సోమాజీగూడలోని యశోదా ఆసుపత్రికి తీసుకొచ్చారు. దగ్గు.. జలుబు.. జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను ఆసుపత్రికి తీసుకురావటం ఒక ఎత్తు అయితే.. ఆయన వెంట సతీమణి శోభ.. కుమార్తె కవిత.. మనమడు హిమాన్షు.. ఎంపీ కమ్ దగ్గరి బంధువు సంతోష్ లు వెంట ఉండటం తో ఉత్సుకత పెరిగింది. చిన్నపాటి ఆరోగ్య సమస్య అయితే ఇంత మంది రావటం ఏమిటన్న ప్రశ్న తలెత్తింది.

దీనికి తోడు దగ్గర దగ్గర గంటన్నర పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. మంగళవారం రాత్రి 8.45 గంటలకు యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. రాత్రి పది గంటల వరకూ ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం సాధారణ జ్వరమేనని.. సీజనల్ ఛేంజ్ వల్ల వచ్చిందే తప్పించి మరింకేమీ లేదని చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి యశోదా ఆసుపత్రి కి రావటానికి ముందు కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించే ప్రముఖ వైద్యులు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవీ రావు ప్రగతిభవన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే.. ఆసుపత్రి కి వస్తే మరిన్ని టెస్టులు చేద్దామన్న సూచన తో ఆయన ఆసుపత్రికి వచ్చినట్లుగా చెబుతున్నారు. పరీక్షలు జరుగుతున్న చివర్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం ఆసుపత్రి కి రావటం.. కేసీఆర్ ప్రగతి భవన్ వెళ్లే వరకూ వెంట ఉండటం గమనార్హం. ఆసుపత్రి తో రక్త పరీక్ష తో పాటు.. ఈసీజీ.. సీటీ స్కాన్.. 2డీ ఈకో తదితర వైద్య పరీక్షలు చేయగా.. అంతా బాగున్నట్లు గా తేల్చారు. దీంతో.. రాత్రి పదిన్నర గంటల ప్రాంతం లో తిరిగి ప్రగతి భవన్ కు వెళ్లి పోయారు.


Tags:    

Similar News