కేసీఆర్ కు దినదిన గండం

Update: 2022-07-12 11:30 GMT
కేంద్రంతో ఉన్న క‌య్యం కార‌ణంగా కొత్త అప్పులు పుట్టే దాఖ‌లాలే లేవు. కేసీఆర్ ప్ర‌తిపాదించాక కేంద్రం ఒప్పుకుని తీరాల్సిందే అన్న విధంగా తెలంగాణ రాష్ట్ర  స‌మితి మాట‌లున్నాయి. కానీ నిన్న‌టి వ‌ర‌కూ ఓ లెక్క ఇప్పుడో లెక్క అన్న డైలాగ్ మాదిరిగా టోట‌ల్ సీన్ మారిపోయింది. కేసీఆర్ ను కేంద్రం పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు అన్న వాద‌న‌కు ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రెస్మీట్లు పెట్టి మరీ ! కేంద్రాన్ని తిట్టిపోస్తున్న కేసీఆర్ కు డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌స్తాయో చూస్తామ‌న్న ధోర‌ణిలో కేంద్రం ఉంది.

ఇప్ప‌టికే ప్ర‌జాధ‌నం చాలా వ‌ర‌కూ ప‌బ్లిసిటీ పేరిట వృథా చేస్తోంద‌ని భావిస్తున్న కేంద్రం కొత్త‌గా అప్పులు ఇవ్వ‌డానికి ముందుకు రావ‌డం లేదు. కేసీఆర్ కూడా మ‌రో మార్గం వెత‌క‌డం లేదు. ఉన్న మేర‌కు రానున్న ఆదాయాల‌ను దృష్టిలో ఉంచుకుని అప్పులు చేసి ఉద్యోగుల‌కు ఇవ్వాల్సిన జీతాలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇప్ప‌టికే భూముల వేలంతో కొంత డబ్బులు తెచ్చుకోవాల‌నుకున్న ప్ర‌భుత్వం చెబుతున్న ధ‌ర‌లు రియ‌ల్ట‌ర్ల‌కు, ఇత‌ర కొనుగోలు దారుల‌కు ఆమోద‌యోగ్యంగా లేవు. మ‌రోవైపు సచివాల‌యం నిర్మాణం పేరిట భారీ ఎత్తున నిధుల వెచ్చింపు కూడా స‌మంజ‌సంగా లేద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఖ‌జానా ఖాళీ అయిపోయింద‌ని ఇక జీతాలు ఏ విధంగా ఎక్క‌డి నుంచి తెచ్చి ఇస్తార‌న్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది.

ఒక‌టో తారీఖున జీతం రావాలి. కానీ రాలేదు. పోనీ మొద‌టి వారంలో రావాలి కానీ రాలేదు. ఇప్పుడు 12వ తారీఖు జూలై నెల. పోనీ ఇప్పుడైనా జీతం వ‌చ్చిందా అంటే కొంద‌రికే అన్న స‌మాధానం వినిపిస్తూ ఉంది. ఇదీ తెలంగాణ వాకిట నెల‌కొన్న వేత‌న జీవుల స‌మ‌స్య. ఉద్యోగ‌స్తుల స‌మస్య. ఇప్ప‌టికీ కొన్ని జిల్లాల‌కే వేత‌నాలు ఇచ్చామ‌ని సంబంధిత వ‌ర్గాలు ధ్రువీక‌రిస్తున్నాయ‌ని ప్ర‌ధాన మీడియా చెబుతోంది.

మొత్తం 19 జిల్లాల తెలంగాణ‌లో 14 జిల్లాల‌కే వేత‌నాలు అందాయ‌ని తెలుస్తోంది. జీతం రాక ఇబ్బందులు ప‌డుతున్న ఉద్యోగులు కేసీఆర్ వైఖ‌రిని నిర‌సిస్తూ సోష‌ల్ మీడియాలో మండిప‌డుతున్నారు. జీతాలు స‌ర్దుబాటు చేయ‌లేకే వ‌ర్షాల నెపంతో బ‌డుల‌కు సెల‌వులు ఇస్తున్నార‌ని కూడా కొంద‌రు అంటున్నారు. ఇప్ప‌టిదాకా వేత‌న బ‌కాయిలు తీర్చేందుకు ఏడు వేల కోట్ల రూపాయ‌ల అప్పు చేసింద‌ని స‌ర్కారు వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. ఇవాళ మ‌రో వెయ్యికోట్ల రూపాయ‌ల అప్పు చేయ‌నున్నార‌ని కూడా నిర్థార‌ణ అవుతున్న‌ది.

తెల్లారితే చాలు బంగారు తెలంగాణ మాది.. ఘ‌న‌మైన పాల‌న అందిస్తున్న చ‌రిత్ర మాకే సొంతం అని చెప్పే కేసీఆర్ ఈ విధంగా వేత‌న బకాయిలు తీర్చ‌డంలో ఎందుక‌నో వెనుక‌బ‌డిపోతున్నార‌ని, ఇదెంత మాత్రం త‌గ‌ద‌ని, మిగులు బ‌డ్జెట్ తో మొద‌ల‌యిన రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయింద‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి.
Tags:    

Similar News