రాజ‌కీయం స‌రే.. చ‌ట్టం ముందు కేసీఆర్ వాద‌న నిలుస్తుందా?

Update: 2022-09-19 01:30 GMT
గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు అంశంపై.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుకు విసిరిన స‌వాళ్లు వంటివి ప్ర‌స్తుతం చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. రాజకీయంగా కంటే కూడా.. దీనిని చ‌ట్టం కోణంలో చూస్తే.. ఇది నిల‌బ‌డుతుందా?  లేదా అన్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం. ఎస్టీ రిజర్వేషన్లను పదిశాతానికి పెంచుతూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

అంతేకాదు.. రిజర్వేషన్ల శాతాన్ని 50 నుంచి 62 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లు కేంద్రం వద్ద నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉందని... బిల్లుతో సంబంధం లేకుండా గిరిజన రిజర్వేషన్లను పెంచాలని గతంలో భావించామ‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. కేంద్రం ఏదో చేస్తుంద‌ని ఎదురు చూశామ‌ని.. కానీ ఇప్పుడు అమ‌లు దిశ‌గా ముందుకు వెళ్తామ‌ని.. సీఎం ప్ర‌క‌టించారు. అయితే.. దేశంలో రిజ‌ర్వేషన్లు 50 శాతం మించ‌రాద‌న్న సుప్రీం కోర్టు తీర్పు నేప‌థ్యంలో కేసీఆర్ వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంద‌నేది ప్ర‌శ్న‌.  

ఎన్నిక‌ల ముందే..

ముస్లిం మైనార్టీలకు 12శాతం, గిరిజనులను 10 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ గ‌తంలోనే కేసీఆర్ ప్ర‌భుత్వం ఓ బిల్లు రూపొందించింది. బీసీ-ఈ కేటగిరీ కింద ముస్లిం మైనార్టీలకు ఉన్న 4శాతం రిజర్వేషన్లను 12శాతానికి, గిరిజనులకు అమలు అవుతున్న 6శాతం రిజర్వేషన్లను 10శాతానికి పెంచారు. ఆ బిల్లు ప్రకారం రాష్ట్రంలో బలహీన వర్గాలకు 37శాతం రిజర్వేషన్లు ఉంటాయి.  దళితులకు ఉన్న 15శాతం రిజర్వేషన్లు ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా ఉంటాయి.

మొత్తం రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని 50నుంచి 62కు పెంచుతూ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం కూడా పొందింది. 2017 ఏప్రిల్ 16వ తేదీన రిజర్వేషన్ల పెంపు బిల్లు శాసనసభ, మండలిలో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. అప్ప‌టి నుంచి ఈ బిల్లు పెండింగులోనే ఉంది. వాస్త‌వానికి సుప్రీం కోర్టు తీర్పు నేప‌థ్యంలో కేంద్రం నేరుగా దీనిని రాష్ట్ర‌ప‌తికి పంపించే సాహ‌సం చేయ‌లేదు. దీనిని 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సి ఉంటుంది.

అయితే.. ఇలాంటి డిమాండ్లు కాపుల రూపంలో ఏపీ నుంచి.. ఇత‌ర రాష్ట్రాల్లోని సామాజిక వ‌ర్గాల నుంచి కూడా కేంద్రంపై ఒత్తిడులు ఉన్నాయి. దీంతో వీటిని కేంద్రం ప‌రిష్క‌రించ‌డం లేదు. ఇక‌, ఇప్పుడుకేసీఆర్ దూకుడు పెంచి.. మీరు అమ‌లు చేస్తారో.. ఉరేసుకుంటారో.. అని ఒక సెంటిమెంటు డైలాగు కురించారు. బాగానే..ఉంది కానీ.. ఇది చ‌ట్టం ముందు నిల‌వ‌డం మాత్రం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇది కేవ‌లం ఎన్నిక‌ల‌కు ముందు.. కేసీఆర్ చేస్తున్న రాజ‌కీయ సాములో భాగ‌మేన‌ని తేల్చేస్తున్నారు.
Tags:    

Similar News